వివాదనామ సంవత్సరం

ABN , First Publish Date - 2021-12-25T05:30:00+05:30 IST

కరోనా దెబ్బతో తెలుగు చిత్ర పరిశ్రమ వరుసగా రెండో ఏడాది కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పరిస్థితులు చక్కబడి,..

వివాదనామ సంవత్సరం

 కరోనా దెబ్బతో తెలుగు చిత్ర పరిశ్రమ వరుసగా రెండో ఏడాది కూడా  తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పరిస్థితులు చక్కబడి, మళ్లీ పాత రోజులు వస్తున్నాయని అందరూ హ్యాపీ మూడ్‌లో ఉంటే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టికె ట్‌ ధరలను 20 ఏళ్ల గరిష్ఠానికి తగ్గించి టాలీవుడ్‌ని  దెబ్బతీసింది. అటు కొవిడ్‌, ఇటు ప్రభుత్వ నిర్ణయాలపై సమష్ఠిగా పోరాడాల్సిన దశలో మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికలు తెలుగు చిత్ర పరిశ్రమలో చిచ్చు పెట్టాయి. సినిమాలతో వినోదం పంచాల్సిన ప్రముఖులు కాస్తా రెండు వర్గాలుగా చీలిపోయి సవాళ్లు, ప్రతిసవాళ్లతో వాతావరణాన్ని వేడేక్కించి, జనం నోళ్లలో పలుచనయ్యారు. టికెట్‌ ధరలు, బెనిఫిట్‌ షోల రద్దు లాంటి అంశాల్లోనూ పరిశ్రమలో ఏకాభిప్రాయం రాలేదు.  ఏపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ మరికొందరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మొత్తానికి ఈ ఏడాది మంచి విషయాలకన్నా చెడు అంశాల్లోనే తెలుగు చిత్ర పరిశ్ర మ వార్తల్లో నిలిచింది. 2021 టాలీవుడ్‌కు వివాదనామ సంవత్సరంగా మిగిలింది.


హీట్‌ పెంచిన వకీల్‌సాబ్‌

మూడేళ్ల విరామం తర్వాత పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్‌’ చిత్రంతో బాక్సాఫీసుపైకి దండెత్తారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదలైంది. కరోనా కష్టకాలాన్ని మరిపించేలా ఘన విజయాన్ని ఇండస్ట్రీకి అందించాడు ‘వకీల్‌ సాబ్‌’. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ‘వకీల్‌సాబ్‌’ బెనిఫిట్‌ షోలను ప్రభుత్వం రద్దు చేసింది. ‘వకీల్‌సాబ్‌’కు మాత్రమే కాదు గతంలోనూ ఏ సినిమాలకూ బెనిఫిట్‌ షోలకు ప్రభుత్వ అనుమతి లేదనే వాదన ప్రభుత్వం వినిపించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్‌పై కక్ష సాధింపుగానే చిత్ర పరిశ్రమలోని ఓ వర్గం, పవన్‌ అభిమానులు అభిప్రాయపడ్డారు. 


 ఇదిలా ఉండగానే పవన్‌ కల్యాణ్‌ని విమర్శిస్తూ  నటుడు, రచయిత పోసాని కృష్ణమురళీ ప్రెస్‌మీట్‌ పెట్టడం అగ్నికి  మరింత ఆజ్యం పోసినట్లు అయింది.  పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితంపై ఆయన ఆరోపణలు చేయడంతో అభిమానులు దాడికి ప్రయత్నించారు. ‘నా భార్యను అవమానించడమే కాకుండా, ఇంటిపై దాడికి దిగారు. పవన్‌ను వదిలిపెట్టేది లేద’ని అంటూ మెగా ఫ్యామిలీపై ఆయన బూతు పురాణం ఎత్తుకోవడం పరిశ్రమను నివ్వెరపరిచింది. 


నానిపై నిషేధం అంటూ...

నాని ‘టక్‌ జగదీష్‌’ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేయడంపై తెలంగాణ థియేటర్స్‌ అసోసియేషన్‌ ఫైర్‌ అయింది. ‘థియేటర్లలలో సినిమాను రిలీజ్‌ చేస్తామని చెప్పి ఓటీటీతో ఎక్కువ రేటుకు బేరమాడర’ని నానిని, చిత్ర నిర్మాతలను విమర్శించారు. దాంతోపాటు థియేటర్లలో విడుదలవుతున్న ‘లవ్‌స్టోరి’కి పోటీగా సెప్టెంబరు 10నే ‘టక్‌ జగదీష్‌’ను ఓటీటీలో విడుదల చేయడం థియేటర్స్‌ ఓనర్స్‌కు కోపం తెప్పించింది. నాని సినిమాలను థియేటర్లలో రిలీజ్‌ చేయడంపై నిషేధం విధిస్తున్నామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఇరువర్గాలు రాజీపడ్డాయి. 


విడాకులూ వివాదాలమయం

మీడియాలో పుంఖానుపుంఖాలుగా  వచ్చిన గాసిప్స్‌కు  తెర దించుతూ  అక్టోబరు 2న టాలీవుడ్‌ జంట నాగచైతన్య, సమంత సామాజిక మాధ్యమాల వేదికగా తమ విడాకుల విషయాన్ని ప్రకటించారు. ఈ వార్త ఇటు టాలీవుడ్‌లో అటు అభిమానుల్లో ప్రకంపనలు రేపింది. అలాగే  మీడియాలో వచ్చిన వరుస కథనాలు వివాదంగా మారాయి. నిరాధారమైన వార్తలు రాస్తున్నారంటూ సమంత న్యాయపోరాటానికి దిగారు. కోర్టుజోక్యంతో వివాదం సద్దుమణిగింది. 


శ్యామ్‌సింగరాయ్‌ ఫైర్‌

ఏపీ ప్రభుత్వంపై నాని విమర్శలతో వాతావరణం మరోసారి వేడెక్కింది. ‘శ్యామ్‌సింగరాయ్‌’ మూవీ ప్రచార కార్యక్రమంలో నాని చే సిన వ్యాఖ్యలతో ఏపీ మంత్రులు ఫైర్‌ అయ్యారు. థియేటర్ల వసూళ్లను కిరాణా షాపుల కలెక్షన్స్‌తో పోల్చడంపై మండిపడ్డారు. ఆంధ్రాలో కొన్ని చోట్ల ‘శ్యామ్‌సింగరాయ్‌’ ప్రదర్శించే థియేటర్లను మూసివేయడంతో పాటు దాడులకు దిగారు.



పాట వివాదాల కూత

పలు సినీగీతాలు ఈ ఏడాది వివాదాలపాలయ్యాయి. ఇటీవలె విడుదలైన ‘పుష్ప-1’ చిత్రంలోని ‘ఊ అంటావా...’ ప్రత్యేక గీతంపై రచయిత చంద్రబోస్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ విమర్శలకు గురయ్యారు. పురుషుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్న ఈ పాట తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కొందరు కోర్టుకు వెళ్లారు. దేవిశ్రీ ప్రసాద్‌ ‘ఊ అంటావా...’ పాటను భక్తిగీతంతో పోల్చారంటూ సోషల్‌ మీడి యా వేదికగా ట్రోలింగ్‌కి గురయ్యారు. 


నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ‘లవ్‌స్టోరి’లోని జానపద గీతం ‘సారంగదరియా’ ఈ ఏడాది సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది. దీనికి సుద్దాల అశోక్‌తేజ సాహిత్యం అందించారు. మంగ్లీ పాడారు. అయితే ఈ గీతాన్ని మొదట పాడిన తనకు ఎలాంటి క్రెడిట్‌ ఇవ్వకుండా ‘సారంగదరియా’ గీతాన్ని సినిమాలో వాడుకున్నారని కోమలి అనే జానపద గాయని ఆరోపించారు. దీనిపైపెద్ద దుమారం చెలరేగింది. కోమలికి క్రెడిట్‌ ఇస్తామని, ఆడియో ఫంక్షన్‌కి ఆహ్వానిస్తామని దర్శకుడు శేఖర్‌ కమ్ముల చెప్పడంతో వివాదం ముగిసింది. అలాగే ‘వరుడు కావలెను’ సినిమా కోసం అనంత శ్రీరామ్‌ రాసిన ‘దిగు దిగు దిగు నాగ’ పాటను వ్యాంప్‌ పాత్రకు వాడారంటూ సంప్రదాయవాదులు అభ్యంతరం తెలిపారు. ‘ఆ పాట పల్లవిని వాడుకున్నా ఆ ఘనత అజ్ఞాత జానపద రచయితలకే దక్కుతుంది. వారికి నా పాదాభివందనాలు’ అని అనంత శ్రీరామ్‌ చేసిన ట్వీట్‌తో వివాదం చల్లబడింది. అలాగే పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లానాయక్‌’ కోసం రామజోగయ్య శాస్త్రి రాసిన టైటిల్‌ సాంగ్‌ వివాదాస్పదం అయింది. ఇందులో పోలీసుల సేవలను గురించి వివరించలేదని, అలాగే జీతాలు తీసుకునేది ప్రజలకు సేవ చేయడానికే కానీ వారి ఎముకలు విరగ్గొట్టడానికి కాదని హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీ ఎం. రమేష్‌ ట్విట్టర్‌లో స్పందించారు. 


రిపబ్లిక్‌ వివాదాల వేదిక

వినాయక చవితి రోజు సాయి తేజ్‌ బైక్‌ ప్రమాదానికి గురయ్యారు. బలమైన గాయాలు కావడంతో హాస్పిటల్‌లో చేర్చారు. ఎట్టకేలకు నెల రోజుల చికిత్స అనంతరం కోలుకోవడంతో మెగా ఫ్యామిలీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సాయితేజ్‌ ప్రమాదం కొత్త మలుపు తీసుకొని, వివాదానికి కారణమైంది. ప్రమాదం జరిగిన అనంతరం వీకే నరేష్‌ ఓ వీడియోలో మాట్లాడుతూ ‘‘బైక్‌ వేగంగా తోలడంపై నేను సాయితేజ్‌ను తరచూ హెచ్చరించేవాణ్ణి’ అని చెప్పారు. అయితే ఇలాంటి సందర్భంలో  బైక్‌ ప్రమాదాల్లో చనిపోయిన వారి పేర్లను ఆ వీడియోలో నరేష్‌ ప్రస్తావించడం సమంజసం కాదంటూ శ్రీకాంత్‌  ఓ వీడియో వదిలారు. ఈ  వివాదానికి కొనసాగింపుగా కొన్ని రోజులు నరేష్‌, శ్రీకాంత్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది. బండ్ల గణేష్‌ కూడా నరేష్‌ వైఖరిని తప్పుబట్టారు.


  సాయితేజ్‌ ‘రిపబ్లిక్‌’ మూవీ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన పవన్‌ కల్యాణ్‌ ఏపీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. టికెట్‌ ధరల తగ్గింపు, ఆన్‌లైన్‌ టికెటింగ్‌పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి పేర్ని నానిని సన్నాసి అంటూ పిలవడం వివాదానికి దారి తీసింది. పేర్ని నాని కూడా పవన్‌పై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇది కాస్తా టాలీవుడ్‌, ఏపీ ప్రభుత్వం మధ్య యుద్ధంగా మారే పరిస్థితి ఏర్పడింది. దీంతో సినీ ప్రముఖులు రంగంలోకి దిగారు. తమకు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలతో సంబంధంలేదని పలువురు నిర్మాతలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి వివరణ ఇచ్చుకున్నారు. 


‘మా’లో రగడ

గతంలో ఎన్నడూ లేని విధంగా ‘మా’ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ప్రకాష్‌రాజ్‌ మెగా ఫ్యామిలీ అండతో అధ్యక్షుడిగా ఎన్నికల బరిలో నిలిచారు. విష్ణు మంచు ఆయనపై పోటీకి దిగారు. రెండు ప్యానళ్లు విమర్శలు, ప్రతి విమర్శలతో వార్తల్లో నిలిచాయి. నరేష్‌, నాగబాబు, ప్రకాష్‌రాజ్‌, విష్ణు, కోట శ్రీనివాసరావు తదితరుల తమదైన వాదనలతో విరుచుకుపడ్డారు. ప్రకాష్‌ రాజ్‌ నాన్‌ లోకల్‌ అంటూ కొందరు విమర్శించారు. చివరకు అక్టోబరు 10న జరిగిన ఎన్నికల్లో విష్ణు అధ్యక్షుడిగా గెలవడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది. అయితే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి గెలిచిన వారంతా రాజీనామాలు చేశారు.

Updated Date - 2021-12-25T05:30:00+05:30 IST