కొత్త ఏడాది ఖర్చు రూ.56.99కోట్లు

ABN , First Publish Date - 2022-01-02T06:18:36+05:30 IST

కొత్త సంవత్సరం సంబురాలు ఉమ్మడి జిల్లాలో అంబరాన్ని అంటాయి. కరోనా భయం వెంటాడుతున్నా పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ, నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఒక్క మద్యంపైనే రూ.54కోట్లు ఖర్చుచేశారు.

కొత్త ఏడాది ఖర్చు రూ.56.99కోట్లు

రూ.54కోట్ల మద్యం తాగేశారు

భారీగా చికెన్‌, బేకరి, స్వీట్స్‌ అమ్మకాలు

313 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల నమోదు

నూతన సంవత్సరం తొలిరోజు 122 మంది జననం


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ): కొత్త సంవత్సరం సంబురాలు ఉమ్మడి జిల్లాలో అంబరాన్ని అంటాయి. కరోనా భయం వెంటాడుతున్నా పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ, నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఒక్క మద్యంపైనే రూ.54కోట్లు ఖర్చుచేశారు. వీటికి చికెన్‌, బేకరి, స్వీట్స్‌ అదనం. దీనికి రూ.2.99కోట్లకు పైగానే ఖర్చు చేశారు. నూతన సంవత్సరం పేరుతో మొత్తంగా రూ.56.99కోట్లు ఖర్చయ్యాయి.


పాత సంవత్సరానికి టాటా చెబుతూ, కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు డిసెంబరు చివరి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఆనందంగా గడిపేందు కు ప్రధానంగా యువకులు ప్రధాన్యం ఇస్తారు. కొత్త ఏడాది జోష్‌ కోసం మద్యం, బేకరి ఐటమ్స్‌, స్వీట్లపై పెద్దమొత్తం ఖర్చు చేశారు. మద్యం ప్రియులు మటన్‌, చికెన్‌పై కూడా అధికంగా వ్యయం చేశారు. చివరి రోజున అమ్మకాలు అధికంగా ఉంటాయని అంచనా వేసిన వ్వాపారులు అందుకు తగ్గటుగానే వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో 31న ఒక్కరోజే ఉమ్మడి జిల్లా ప్రజలు స్వీట్లు, బేకరి ఐటమ్స్‌పై సుమారు రూ.2.99కోట్లకు పైగా ఖర్చు చేశారు.


ఒక్కరోజే భారీగా అమ్మకాలు

ఉమ్మడి జిల్లాలో బార్లు, వైన్స్‌లు కలిపి 389 వరకు ఉన్నాయి. వైన్స్‌ల సంఖ్య 336 కాగా, బార్ల సంఖ్య 53. నల్లగొండ జిల్లాలో 155, సూర్యాపేట జిల్లాలో 99, యాదాద్రి జిల్లాలో 82 వైన్స్‌లు ఉన్నాయి. ఇక బార్ల విషయానికొస్తే నల్లగొండ జిల్లాలో 20, సూర్యాపేటలో 22 బార్లు, యాదా ద్రి జిల్లాలో 7 ఉన్నాయి. నల్లగొండలో 18 ప్రధానపట్టణాలలో సుమారు 140 రెస్టారెంట్లు, 120 సాధారణ హోటళ్లు, 240 చికెన్‌ దుకాణాలు, 120 బేకరీలు, 144 స్వీట్‌ షాపులు ఉన్నాయి. కాగా ఈనెల 30న జిల్లాలోని రెస్టారెంట్లలో సుమారు రూ.35లక్షలు వ్యాపారం, హోటల్స్‌లో రూ.24లక్షలు, చికెన్‌ అమ్మకాలు రూ.11.52లక్షలు అయ్యాయి. స్వీట్స్‌ అమ్మకాలు రూ14.40లక్షలు, బేకరీల్లో రూ.12లక్షలు మొత్తంగా రూ96.65లక్షలు ఖర్చు చేశారు. ఇక 31న ఒక్క రోజే రెస్టారెంట్లలో సుమారు రూ.1.05కోట్ల అమ్మకాలు జరిగాయి. సాధారణ హోటళ్లలో సుమారు రూ.24లక్షలు, చికెన్‌ అమ్మకాలు రూ.60లక్షలు, స్వీట్స్‌ రూ.50లక్షలు, బేకరి ఐటమ్స్‌ రూ.60లక్షలు మొత్తంగా ఒక్కరోజులో ఉమ్మడి జిల్లా ప్రజలు ఖర్చు చేసింది రూ.2.99కోట్లకు పైనే. అంటే డిసెంబరు 30వ తేదీతో పోల్చితే 31న అదనంగా రూ.2.02కోట్ల వ్యాపారం కొనసాగింది. దీనికి తోడు మటన్‌. ఫిష్‌, మహిళలు ముగ్గులువేసే రంగులపై చేసిన ఖర్చు మరో రూ.15లక్షల వరకు ఉంది.


ఒక్క రోజే 313 కేసులు నమోదు

ఓ వైపు మద్యం అమ్మకాలు విచ్చలవిడి చేయడంతోపాటు, అమ్మకం వేళలను పెంచారు. మరో వైపు ప్రజల ప్రాణాలకు రక్షణ పేరిట డ్రంకెన్‌ డ్రైవ్‌ నిబంధనలతో పోలీసులు కేసులు నమోదచేశారు. డిసెంబరు 31న ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలో 313 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 157, సూర్యాపేట జిల్లాలో 120, యాదాద్రి జిల్లాలో 36 కేసులు నమోదయ్యాయి.


రూ.54కోట్ల మద్యం

ప్రపంచీకరణతో టెక్నాలజీ దూసుకొచ్చింది. ఆ ప్రభావం జీవనశైలిపై పడింది. మద్యం సేవించడం అనేది సాధారణ అంశంగా మారగా, ప్రభుత్వాలు మద్యం అమ్మకాలు పెంచుతూ వచ్చాయి. ఫలితంగా డిసెంబరు 31 ఒక్క రోజే ఉమ్మడి జిల్లాలో రూ.54కోట్ల విలువైన మద్యం విక్రయాలు కొనసాగాయి. గత ఏడాది డిసెంబరు నెల మొత్తం రూ.414కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అదే 2020 డిసెంబరు మాసంలో మద్యం అమ్మకాల విలువ రూ.345కోట్లే. ఇక మాసం విక్రయాలు 2020 డిసెంబరు మాసంతో పోలిస్తే 2021 డిసెంబరులో అదనంగా రూ.69కోట్లకు పెరిగింది.


 అమ్మకాలు పెరిగాయి : గొర్తి కిరణ్‌ బేకరి, స్వీట్స్‌ షాపు నిర్వాహకుడు 

డిసెంబరు 30తో పోల్చితే 31న అమ్మకాలు పెరిగాయి. 30రోజున రూ.10వేల బేకరి, స్వీట్స్‌ రూ.10వేల అమ్మకా లు చేస్తే 31న బేకరి రూ.50వేలకు, స్వీట్స్‌ అమ్మకా లు రూ.34వేలకు పెరిగింది. కరోనా నేపథ్యంలో 2019, 2020లో డిసెంబరు నెలలో అమ్మకాలే లేవు. గతంతో పోల్చితే ఈ డిసెంబరు మాసంలో అమ్మకాలు పెరిగినట్లే. యువత ఎక్కువగా బేకరి ఐటమ్స్‌ కొనుగోలుకు మొగ్గుచూపారు. కరోనా థర్డ్‌వేవ్‌ ప్రచా రం లేకపోతే అమ్మకాలు ఇంకా పెరిగేవి.



న్యూ ఇయర్‌ బేబీస్‌

కొత్త ఏడాదిలో జనవరి 1ని పండుగ రోజుగా అంతా భావిస్తారు. నూతన సంవత్సరం ప్రారంభం కావడంతో పూజలు, కొత్త వస్తువుల కొనుగోలు వంటి రకరకాల పనులకు శ్రీకారం చూడతారు. చిన్న పాటి విషయాలకే అంత ప్రాధాన్యం ఇస్తుంటే ఈ రోజు కడుపులోని బిడ్డ భూమిపైకి రావడం, ఆ అనుభూతి వర్ణించలేనిది. ఉమ్మడి జిల్లాలో జనవరి 1న 122 మంది శిశువులు జన్మించారు. నల్లగొండ జిల్లాలో 60 మంది, సూర్యాపేట జిల్లాలో 42 మంది, యాదాద్రి జిల్లాలో 20 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జన్మించారు.


చాలా సంతోషంగా ఉంది : చందన-రాజ్‌కుమార్‌, నల్లగొండ

నూతన సంవత్సరం తొలి రోజు మాకు పాప పుట్టడం చాలా సంతోషంగా ఉంది. కొత్త సంవత్స రం, పుట్టిన రోజు ఒకడే కావడం యాదృచ్ఛికం. మే ము ముందుగా ఏ మాత్రం ఊహించలేదు. రెండు రోజుల క్రితం ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చాం. డాక్టర్లు జనవరి 1న ఆపరేషన్‌ చేశారు. మా పాప పుట్టిన రోజు ఏటా జనవరి 1న నిర్వహించే అదృ ష్టం కలగడాన్ని ఆనందంగా భావిస్తున్నాం.


Updated Date - 2022-01-02T06:18:36+05:30 IST