Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొత్త కొత్తగా ఉంటవి....

నేటి నుంచే ప్రారంభం కానున్న మద్యం షాపులు
ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకే అనుమతి
పర్మిట్‌ రూమ్స్‌లో నో సిట్టింగ్‌
షాపు వద్ద 5 సీసీ కెమెరాలు తప్పనిసరి
నిబంధనల అమలుపై అధికారుల దృష్టి


హనుమకొండ క్రైం, నవంబరు 30:
  కొత్త మద్యం షాపులు మంగళవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. నవంబరు 20న వైన్స్‌షాపులకు నిర్వహించిన లక్కీడ్రా ద్వారా మద్యం దుకాణాలు దక్కించుకున్నవారు బుధవారం షాపులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు నవంబరు 29, 30 తేదీలలో కొత్త స్టాకు దిగుమతి చేసుకున్నారు. గుండ్లసింగారం, రాంపూర్‌, దామెరలోని బివరేజెస్‌ గోదాము (లిక్కర్‌డిపో)ల నుంచి కొత్త మద్యం పాలసీలో భాగంగా స్టాకును దిగుమతి చేసుకున్నారు.

మందు కరువు
1వ తేదీ నుంచి కొత్త వైన్‌షాపులు ప్రారంభం అవుతుండగా, పాత షాపుల్లో మద్యం కరువైంది. లక్కీడ్రాలు నిర్వహించిన రోజునుంచి షాపుల్లో కోరుకున్న స్టాకు లేక షాపులు వెలవెలబోతున్నాయి. దినసరి కూలీలు, మధ్యతరగతి వారు సేవించే మందు లేకపోవడంతో చాలామంది వైన్‌షాపుల వద్దకు వెళ్లి నిరుత్సాహంతో వెనక్కి తిరిగి వస్తున్నారు. కోరుకున్న సరుకు లేకపోవడంతో చాలామంది బెల్టుషాపులను ఆశ్రయించి రూ.10 ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనలు పాటించాలి
2021-2023 వరకు ఎక్సైజ్‌ గెజిట్‌ పాలసీలో భాగంగా 1వ తేదీ నుంచి కొత్త మద్యం షాపులలో విక్రయాలు జరుగుతాయని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. లక్కీడ్రా ద్వారా మద్యం షాపులు పొందిన వారు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని సూచించారు. ఎమ్మార్పీ రేట్లకు మాత్రమే మద్యం విక్రయించాలని, ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతీ షాపు వద్ద 5 సీసీ కెమెరాలు నిరంతరం పని చేసే విధంగా జాగ్రత్తపడాలన్నారు. పర్మిట్‌ రూంలలో సిట్టింగ్‌ చేయకూడదని, ఎవరికీ సిట్టింగ్‌ అనుమతి ఇవ్వలేదని, అన్ని షాపుల యజమానులు గుర్తుంచుకోవాలన్నారు. వైన్‌షాపులలో లూజ్‌ మద్యం కానీ, కల్తీ మద్యం కానీ అమ్మకూడదన్నారు.   వైన్‌షాపుల ముందు కొవిడ్‌ నిబంధనలు పాటించే విధంగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, షాపుల ముందు తప్పకుండా ఉచిత శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వారికి భౌతికదూరం పాటించే విధంగా సెక్యూరిటీగార్డులను ఏర్పాటు చేసుకోవాలని, షాపుల వద్ద ఎలాంటి అల్లర్లు, గొడవలు, హత్యలు జరిగినా యజమానులే బాధ్యులవుతారని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు.

పాతషాపుల అడ్డాలే కొత్తవారికి..

అర్బన్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో ఇటీవల నిర్వహించిన మద్యం షాపుల టెండర్లలో చాలామంది పాతవారే బినామీల ద్వారా షాపులను చేజిక్కించుకున్నారు. 59 షాపులకు పాత అడ్డాలు (గతంలో ఉన్న షాపులు) నడుస్తుండగా కొత్తగా జారీ చేసిన 6 షాపులు కొత్త ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. గోపాలపురం, కమలాపూర్‌, ముల్కనూరు, వేలేరు, ఆరెపల్లి, రంగశాయిపేటలో కొత్తషాపులు కొత్త అడ్డాలలో వెలిశాయి. కొత్త షాపులను కూడా పాత లిక్కర్‌ డాన్‌లే తీసుకుని విక్రయాలు జరుపనున్నట్టు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో గతంలో వైన్‌షాపులు నడిపించిన వారికి అక్కడి షాపులు లక్కీడ్రాలో రాకపోవడంతో వచ్చిన వారికి కొంత నజరానా ఇచ్చి అగ్రిమెంట్‌ చేయించుకుని షాపులు చేజిక్కించుకున్నట్టు సమాచారం. ఇంకా కొన్నిచోట్ల పాత అడ్డాలు కొత్తవారికి ఇవ్వడానికి నిరాకరించడంతో తప్పనిసరి పరిస్థితిలో పాతవారికి భాగస్వామ్యం ఇచ్చినట్టు సమాచారం. కొన్నిప్రాంతాల్లో షాపులు డ్రాలో దక్కించుకున్నవారికి స్టాకు దిగుమతి చేసుకునేందుకు దబ్బులు లేకపోవడంతో పాత వారు పెట్టుబడి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement
Advertisement