సింగూరు ప్రాజెక్టులోకి కొత్త నీరు

ABN , First Publish Date - 2020-07-01T11:52:35+05:30 IST

పుల్కల్‌ మండ లం సింగూరు ప్రాజెక్టులోకి కొత్త నీరు వచ్చి చేరింది. రెండు, మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టు లో

సింగూరు ప్రాజెక్టులోకి కొత్త నీరు

మూడు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో


పుల్‌కల్‌, జూన్‌ 30: పుల్కల్‌ మండ లం సింగూరు ప్రాజెక్టులోకి కొత్త నీరు వచ్చి చేరింది.  రెండు, మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టు లో మూడు వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. డబ్బవాగు ద్వారా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నది. సోమ, మంగళవారాల్లో కలిపి మూడు వేల క్యూసెక్కుల వరకు కొత్త నీరు వచ్చి చేరిందని అధికారులు పేర్కొంటున్నారు.


ప్రాజెక్టు నీటి మట్టం అడుగంటిపోవడంతో వెలవెలబోయింది. మంజీర నదికి కుడివైపు పరివాహక ప్రాంతాలైన ఝరాసంగం, కోహీర్‌, జహీరాబాద్‌, న్యాల్‌కల్‌, మునిపల్లి మండలాల్లో భారీ వర్షం కురియడంతో వరద వచ్చి చేరింది. ఒక్క ఝరాసంగం మండలంలోనే 10 సెంటీమీటర్ల వర్షం నమోదు కావడంతో అధికారవర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. డబ్బవాగు జన్మస్థానమైన ఝరాసంగం మండలంలోని పలు గ్రామాల నుంచి వరద నీరు అధికంగా వాగులోకి వచ్చి చేరడంతో ప్రవాహం పెరిగింది. దీంతో ఆ నీరంతా నేరుగా ప్రాజెక్టులోకి చేరుతున్నది. మరో రెండు రోజుల్లో ప్రాజెక్టులో నీటి మట్టంటీఎంసీ వరకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


ప్రాజెక్టులో ఇప్పటికే అర టీఎంసీకి తక్కువగా నీటి మట్టం ఉండడం ప్రస్తుతం వరద నీరు వచ్చి చేరితే ఒక టీఎంసీకి చేరుకుంటుందని నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకు కుడి, ఎడమ వైపుల మిషన్‌ భగీరథ పథకం కింద తాగునీటి పథకాలు నిర్వహిస్తున్నారు. కొత్తగా వచ్చి చేరిన వరద నీటితో తాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయి. ప్రాజెక్టులోకి తొలి సారిగా కొంత మేరకు వరద నీరు వచ్చి చేరడంతో బ్యాక్‌వాటర్‌ పరిసరాలు నీటితో కళకళలాడుతున్నాయి. అయితే, ఇంకా వర్షాకాలం మరో మూడు నెలలు ఉండడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-01T11:52:35+05:30 IST