ఆదిభట్లలో కొత్త యూనిట్‌

ABN , First Publish Date - 2021-03-02T06:28:50+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన ఎంటీఏఆర్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూ రేపటి నుంచి ప్రారంభం కానుంది. న్యూక్లియర్‌ పవర్‌, ఏరోస్పేస్‌, రక్షణ, పర్యావరణ అనుకూల ఇంధన రంగాల్లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అగ్ని వంటి క్షిపణులకు కీలకమైన పరికరాలను

ఆదిభట్లలో కొత్త యూనిట్‌

రాకెట్‌, క్రయోజనిక్‌ ఇంజన్లు తయారీ

హైడ్రోజన్‌తో విద్యుదుత్పత్తి

ఎంటీఏఆర్‌ టెక్నాలజీస్‌ ఎండీ శ్రీనివాస రెడ్డి


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌)

హైదరాబాద్‌కు చెందిన ఎంటీఏఆర్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూ రేపటి నుంచి ప్రారంభం కానుంది. న్యూక్లియర్‌ పవర్‌, ఏరోస్పేస్‌, రక్షణ, పర్యావరణ అనుకూల ఇంధన రంగాల్లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అగ్ని వంటి క్షిపణులకు కీలకమైన పరికరాలను అందిస్తోంది. ఆదివారం ప్రయోగించిన పీఎ్‌సఎల్‌వీ-సీ 51కు లిక్విడ్‌ ప్రొపల్షన్‌ ఇంజన్‌ను సమకూర్చింది. న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, డీఆర్‌డీఓ, ఇస్రోతో దాదాపు గత 30 ఏళ్లుగా కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్న సందర్భంగా ఎంటీఏఆర్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో ఇష్ఠాగోష్ఠిగా ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...


భవిష్యత్‌లో విస్తరణ ప్రణాళికలు?

న్యూక్లియర్‌ ఎనర్జీ, ఏరోస్పేస్‌, రక్షణ, పర్యావరణ అనుకూల ఇంధన రంగాల్లో కీలకమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. లిక్విడ్‌ ప్రొపల్షన్‌, క్రయోజనిక్‌ ఇంజన్లను అందిస్తున్నాం. న్యూక్లియర్‌ రియాక్టర్లలో కీలకమైన భాగాలను సరఫరా చేస్తున్నాం. హైదరాబాద్‌లో కంపెనీకి 7 తయారీ యూనిట్లు ఉన్నాయి. ఆదిభట్లలో కొత్తగా స్పెషాలిటీ షీట్‌ మెటల్స్‌ తయారీ, స్పెషాలిటీ ఫ్యాబ్రికేషన్‌ను చేపడతాం. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఇది అందుబాటులోకి వస్తుంది. తొమ్మిది ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్‌ను భవిష్యత్తులో సామర్థ్యాలను పెంచుకోవడానికి వీలుగా నిర్మిస్తున్నాం. ఏరోస్పేస్‌, పర్యావరణ అనుకుల ఎనర్జీ రంగాల అవసరాలను తీరుస్తుంది. 


వచ్చే 3-4 ఏళ్లలో ఆదాయం వృద్ధి రేటు?

గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.215 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో 50 శాతం ఆదాయం దేశీయంగా, 50 శాతం ఎగుమతుల ద్వారా లభిస్తోంది. ఎగుమతుల కోసం ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌, ఎల్బిట్‌ సిస్టమ్స్‌తో కలిసి పని చేస్తున్నాం. ఆదాయం సగటున ఏడాదికి 16 శాతం వృద్ధి చెందుతోంది. భవిష్యత్తులో కూడా 16 శాతం, అంతకంటే ఎక్కువగా ఆదాయంలో వృద్ధి రేటును కొనసాగించగలం. 


చేతిలో ఉన్న ఆర్డర్లు ?

ప్రస్తుతం చేతిలో రూ.336 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నా యి. భవిష్యత్‌లో ఆర్డర్‌ బుక్‌ బాగా పెరిగే వీలుంది. అణు విద్యుత్‌ రంగంలో ప్రభుత్వం కొత్త రియాక్టర్లను ఏర్పాటు చేస్తోంది. హైడ్రోజన్‌తో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే జనరేటర్లను తీసుకురానున్నాం. గోరఖ్‌పూర్‌, హరియాణాలో 700 మెగావాట్ల సామర్థ్యంతో రెండు అణు విద్యుత్‌ రియాక్టర్లను నెలకొల్పుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని రియాక్టర్‌ ఏర్పాటుకు టెండర్లు పిలవనున్నారు. రియాక్టర్ల తయారీలో మిషన్‌ క్రిటికల్‌ భాగాలను సరఫరా చేయడానికి కంపెనీకి ఆకర్షణీయంగా ఆర్డర్లు లభించే అవకాశం ఉంది. 


క్లీన్‌ ఎనర్జీలో కంపెనీ ప్రణాళికలు?

క్లీన్‌ ఎనర్జీలో విస్తరణపై దృష్టి పెట్టనున్నాం. హైడ్రోజన్‌ను వినియోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఉత్పత్తులను అభివృద్ధి చేశాం. ప్రోటోటై్‌పలను కూడా సిద్ధం చేశాం. మొత్తం 3 రకాల ఉత్పత్తులను అభివృద్ధి చేశాం. 


ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లో అవకాశాలు ?

ఏరోస్పేస్‌, రక్షణ రంగాలకు చెందిన అన్ని రకాల పరిశోధన, అభివృద్ధి  కేంద్రాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. హైదరాబాద్‌లోని కంపెనీలకు ఇది చాలా అనుకూల అంశం. పరిశోధన సంస్థలతో కలిసి పని చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రక్షణ, ఏరోస్పేస్‌ రంగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నందున భవిష్యత్తులో హైదరాబాద్‌లోని కంపెనీల ప్రాధాన్యత మరింత పెరుగుతుంది.

Updated Date - 2021-03-02T06:28:50+05:30 IST