
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్స్‌కు సంబంధించి ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపై వివాదం మొదలైంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎమ్సీ) పార్టీ జెండా రంగులను పోలి ఉండేలా యూనిఫామ్స్ తెలుపు, నీలి రంగుల్లో ఉండటమే ఇందుకు కారణం. అలాగే బెంగాల్ ప్రభుత్వ లోగో (విశ్వ బంగ్లా) కూడా యూనిఫామ్స్‌పై ఉంది. దీంతో టీఎమ్సీ ప్రభుత్వం విద్యాసంస్థల్ని రాజకీయమయం చేయాలనుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నెల 21న యూనిఫామ్స్‌కు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం బ్లూ అండ్ వైట్ కలర్ డ్రెస్‌తోపాటు, యూనిఫామ్స్‌పై ప్రభుత్వ లోగో ఉండేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని స్కూల్స్‌లో ఈ రూల్ పాటించాలని సూచించింది. ప్రీ స్కూల్ స్థాయి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులు ఇదే యూనిఫామ్ ధరించాలి. ఇప్పటికే తమ పార్టీ రంగులైన బ్లూ అండ్ వైట్‌ను టీఎమ్సీ రాష్ట్రంలో ఎక్కువగా వాడుతోంది. 2011లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రభుత్వ బిల్డింగులు, ప్రాజెక్టులు, ట్రాఫిక్ చెక్ పోస్టులకు కూడా ఈ రంగులనే వాడుతోంది. ఇప్పుడు స్కూల్ యూనిఫామ్స్‌కు కూడా ఈ రంగులు వాడాలని నిర్ణయించింది. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై నిరసన వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం వల్ల పాఠశాలలు తమ ప్రత్యేకతను కోల్పోతాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.