దివ్య హత్య కేసులో కొత్త ట్విస్టులు.. వారిద్దరి మొబైల్స్‌లోనే మిస్టరీ!

ABN , First Publish Date - 2020-10-17T09:13:31+05:30 IST

దివ్య తేజస్విని హత్య కేసులో మొబైల్‌ ఫోన్లే కీలకంగా మారుతున్నాయి.

దివ్య హత్య కేసులో కొత్త ట్విస్టులు.. వారిద్దరి మొబైల్స్‌లోనే మిస్టరీ!


హాట్‌టాపిక్‌గా దివ్య సెల్ఫీ వీడియో

ఆస్పత్రిలో నోరువిప్పిన నాగేంద్ర

ముగిసిన మృతురాలి అంత్యక్రియలు

దిశ పోలీస్‌స్టేషన్‌కు కేసు బదిలీ


విజయవాడ (ఆంధ్రజ్యోతి): దివ్య తేజస్విని హత్య కేసులో మొబైల్‌ ఫోన్లే కీలకంగా మారుతున్నాయి. కేసు మూలాలు మొత్తం వాటి ద్వారానే బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ కేసును దిశ పోలీస్‌స్టేషన్‌కు మార్పు చేశారు. 


జరిగిన ఘటనపై రెండు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 302 సెక్షన్‌తోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయగా, నాగేంద్రపై ఆత్మహత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. దివ్యను తాను హత్య చేయలేదని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగేంద్ర చెబుతున్నాడు. ఏడు నెలలుగా తమను ఆమె తండ్రి దూరం చేశాడని ఆరోపించాడు. 


దివ్య అంత్యక్రియలు క్రీస్తురాజపురంలో శుక్రవారం నిర్వహించారు. స్త్రీ,శిశు సంక్షేమశాఖ సంచాలకురాలు కృత్తికా శుక్లా, దిశ చట్టం ప్రత్యేకాధికారి దీపికా పాటిల్‌ మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ కేసులో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. 


అతడు ఎవరు?

దివ్య సెల్ఫీ వీడియో ఒకటి బయటకు వచ్చింది. తనను వేధిస్తున్న ఓ వ్యక్తి గురించి ఆమె ఆక్రోశంతో మాట్లాడింది. అతడు ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అందులో 29నిమిషాల 49 సెక్షన్లపాటు ఆమె సుదీర్ఘంగా మాట్లాడింది. పేరు చెప్పకుండా అతడు తన విషయంలో సైకోలా ప్రవర్తిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆరేడు నెలలుగా ఎంతో క్షోభను అనుభవిస్తున్నానని వీడియోలో స్పష్టం చేసింది. ఆమెను అంతగా వేధించిన స్నేహితులు ఎవరన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీనియర్లు ఎవరైనా సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి ర్యాగింగ్‌ చేస్తున్నారా? లేక నాగేంద్ర ఇలాంటి వేధింపులకు గురి చేశాడా? అన్నది తేల్చే పనిలో సైబర్‌ నిపుణులు ఉన్నారు. 


మార్చి28... ఏప్రిల్‌ 2...

ఘటనాస్థలంలో ఉన్న నాగేంద్ర, తేజస్విని మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో మొత్తం డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగేంద్ర, తేజస్వినిల మధ్య ఫోన్‌ సంభాషణలను గుర్తించారు. మార్చి 28వ తేదీన తేజస్విని నుంచి నాగేంద్రకు, ఏప్రిల్‌ రెండో తేదీన నాగేంద్ర నుంచి తేజస్వినికి ఫోన్‌ కాల్స్‌ వెళ్లినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది.  అప్పటి నుంచి ఘటన జరగడానికి ముందు వరకు వాళ్లిద్దరూ వాట్సాప్‌ చాటింగ్‌ చేసుకున్నారు. లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన తేజస్విని తల్లిదండ్రులు ఉండడం వల్ల ఫోన్లు తక్కువ మాట్లాడి, చాటింగ్‌ చేసిందా? అని అనుమానిస్తున్నారు. దివ్య, నాగేంద్ర మాట్లాడుకున్న ఆడియో వాయిస్‌ను సైబర్‌ ల్యాబ్‌లో విశ్లేషిస్తున్నారు.


దివ్యతేజస్వినిని నేను చంపలేదు

సంచలనం కలిగించిన ఇంజనీరింగ్‌ విద్యార్థిని హత్య కేసులో ‘ఆత్మహత్య’ కోణం కొత్తగా వెలుగులోకి వచ్చింది. తన ప్రేమను అంగీకరించలేదని దివ్య తేజస్వినిని బుడిగి నాగేంద్ర అలియాస్‌ చిన్నస్వామి గొంతు కోసి చంపేశాడని ఇప్పటివరకు పోలీసులు భావించారు. అయితే, దివ్యను తాను హత్య చేయలేదని నాగేంద్ర చెప్పాడు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు శుక్రవారం ఈ ఘటనపై స్పందించాడు. ‘‘దివ్య, నేను ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. పదిరోజుల క్రితం వివాహం చేసుకున్నాం. ఆమె తండ్రి జోసఫ్‌ మా ఇద్దరిని వేరే చేశారు. దీంతో దివ్య, నేను కలిసి చనిపోవాలనుకున్నాం.


ఈ ఆలోచనతోనే నేను గురువారం ఉదయం దివ్య ఇంటికి వెళ్లాను. ఇద్దరం ఎవరి గొంతు వాళ్లం కోసుకున్నాం’’ అని తెలిపారు. గురువారం రాత్రి జీజీహెచ్‌కు నాగేంద్రను తరలించినప్పుడు.. అతని గొంతు భాగంతోపాటు మణికట్టు వద్ద లోతైన గాయాన్ని వైద్యులు గమనించారు. గొంతును చాకుతో కోసుకొన్న కొద్దిసేపటినే తనకు స్పృహ తప్పిందని, చేతిపై ఎవరు కోశారో తెలియదని నాగేంద్రచెబుతుండటం గమనార్హం! నాగేంద్రకు చిన్నపేగు వద్ద తీవ్ర గాయం కావటంతో గురువారం రాత్రి ఆపరేషన్‌ జరిపినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి తెలిపారు. 48 గంటల తరువాతే అతని ఆరోగ్య స్థితిపై స్పష్టత వస్తుందని తెలిపారు.

Updated Date - 2020-10-17T09:13:31+05:30 IST