Jul 7 2021 @ 07:37AM

‘మా’ ఎన్నికల్లో మరో మలుపు

సెప్టెంబరులోనూ ఎన్నికలు జరక్కపోవచ్చు

మరికొంతకాలంపాటు వాయిదాకు యత్నం?  

బైలాస్‌లో లేని కాలపరిమితి.. సొసైటీస్‌ యాక్ట్‌ వర్తింపు

ప్రస్తుత కార్యవర్గం 6 ఏళ్ల దాకా కొనసాగే అవకాశం?


(చిత్రజ్యోతి, హైదరాబాద్‌): మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌ (మా) ఎన్నికల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. గతంలో చెప్పినట్టుగా ఈ ఎన్నికలు సెప్టెంబరులో కూడా జరగవా? వాటిని మరికొంతకాలం వాయిదా వేయాలని భావిస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ‘మా’లో ఇప్పటి దాకా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం.. ఇంచుమించుగా రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్‌ వల్ల ‘మా’ ఎన్నికల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారంటూ నటుడు ప్రకాష్‌రాజ్‌ ‘మా’ అధ్యక్షుడికి ఏప్రిల్‌లో ఒక లేఖ రాశారు. 


2019లో ఆమోదించిన ఒక తీర్మానం ప్రకారం ఎన్నికలను సెప్టెంబర్‌లో జరపవచ్చని ‘మా’ కార్యవర్గం దీనికి సమాధానమిచ్చింది. ఆ తర్వాత ప్రకాష్‌ రాజ్‌ తన ప్యానల్‌ను ప్రకటించారు. మంచువిష్ణు, జీవిత, హేమ కూడా రంగంలోకి దిగారు. 2019లో ఆమోదించిన తీర్మానంపైన, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశాలను వాయిదా వేసే హక్కు అధ్యక్షుడికి ఉందా? లేదా? అనే అంశంపైన, కార్యవర్గం పదవీకాలంపైన కొందరు సభ్యులు ‘మా’ కార్యవర్గానికి లేఖలు రాశారు. దీనిపై మా లీగల్‌ ఒపీనియన్‌ తీసుకుంది. ‘‘టీఎస్‌ సొసైటీస్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌, 2001 ప్రకారం ఒక కార్యవర్గం ఎన్నికైన తర్వాత గరిష్ఠంగా ఆరేళ్ల కాలం ఉండొచ్చు. మా బైలాస్‌లో ఎక్కడా ఒక కార్యవర్గంఎన్నికైన తర్వాత నిర్దిష్టంగా ఇంతకాలం ఉండాలని లేదు. 28 ఏళ్లుగా ఉన్న సంప్రదాయం ప్రకారం ఒక కార్యవర్గం ఒక ఎన్నిక నుంచి మరొక ఎన్నిక దాకా కొనసాగుతుంది. కాబట్టి.. కొత్త కార్యవర్గం ఎన్నికై అధికారాలు చేపట్టే దాకా ప్రస్తుత కార్యవర్గం పూర్తి అధికారాలతో కొనసాగుతుంది’’ అని లీగల్‌ అడ్వైజర్‌ తన అభిప్రాయాన్ని తెలిపారు. అన్యాపదేశంగా.. సొసైటీస్‌ యాక్ట్‌ ప్రకారం, ఒకసారి ఎన్నికైన కార్యవర్గం ఆరేళ్లదాకా కొనసాగొచ్చనే అర్థం వచ్చేలా మా లీగల్‌ అడ్వైజర్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇదే విషయాన్ని ‘మా’ తన సభ్యులకు తెలిపినట్టు సమాచారం.


నిర్దిష్టంగా లేదు..

ఇప్పటిదాకా ఉన్న సంప్రదాయం ప్రకారం.. ఒకసారి ఎన్నికైన కార్యవర్గంమళ్లీ కొత్త కార్యవర్గంవచ్చేవరకూ కొనసాగుతోంది. అంతే తప్ప ఎన్నికైన కార్యవర్గం నిర్దిష్టంగారెండేళ్లు మాత్రమే ఉండాలని బైలాస్‌లో లేదు. కొన్నిసార్లు రెండేళ్ల మూడు నెలల తర్వాత, మరికొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ కాలం తర్వాత.. ఎన్నికలు జరుగుతూ వచ్చాయి తప్ప రెండేళ్లకొకసారి ఎన్నికలు జరగట్లేదు. ఇక.. సెప్టెంబరులో ఎన్నికలు జరపాలంటూ గత ఏడాది తీర్మానం తీసుకున్న యాన్యువల్‌ జనరల్‌ బాడీ మీటింగ్‌ విషయానికొస్తే.. ఆ మీటింగ్‌ జరగాలంటే దానికి ముందు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) భేటీ నిర్వహించి, తీర్మానం చేయాలి. కానీ.. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మీటింగ్‌ జరక్కుండానే ఏజీఎం సమావేశం జరిగిందని మా లీగల్‌ అడ్వైజర్‌ తన ఒపీనియన్‌లో పేర్కొన్నారు. అంటే దాని చెల్లుబాటు కూడా సందేహాస్పదమే. 


ఈ క్రమంలోనే.. ‘‘‘మా’ ఎన్నికలను సెప్టెంబర్‌లో జరపటానికి వీలుగా 2019లో ఆమోదించిన తీర్మానం చెల్లదు’’ అని కార్యవర్గం మా సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీటన్నిటిబట్టి చూస్తే.. ఎన్నికలు గతంలో తీర్మానం చేసినట్టు సెప్టెంబరులో కూడా జరపకపోవచ్చని, వాటిని మరికొంతకాలంపాటు వాయిదా వేయాలని ప్రస్తుత కమిటీ భావిస్తోందనిఅనుమానాలు కలుగుతున్నాయి.


ఏం జరుగుతుంది?

వాస్తవానికకి ఈ నెల 9న మా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మీటింగ్‌ జరగాల్సి ఉంది. దాని కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ.. ‘మా’ ఆఫీసులో సిబ్బందికి కొవిడ్‌ రావటంతో ఆ భేటీజరిగే అవకాశాలు తక్కువే కనిపి స్తున్నాయి. ‘‘ఎన్నికలు ఎప్పుడు జరపాలనే విషయంపై ఈసీనే నిర్ణయం తీసుకోవాలి. ఈసీ సమావేశమే జరగకపోతే.. ఎన్నికల తేదీపై స్పష్టత రాదు. ప్రస్తుతం కొవిడ్‌ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈసీని వాయిదా వేసే అవకాశాలే కనిపిస్తున్నాయి’’ అని పేరు చెప్పటానికి ఇష్టపడని ‘మా’ సభ్యుడు ఒకరు పేర్కొన్నారు. అయితే, ఈ మధ్యకాలంలో అనేక సొసైటీలు తమ సమావేశాలను, ఎన్నికలను ఆన్‌లైన్‌ ద్వారా జరుపుకొంటున్నాయి.


ఉదాహరణకు.. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్‌ అసోషియేషన్‌ ఇటీవలే తన ఎన్నికలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించుకుంది. అయితే ఆన్‌లైన్‌ ద్వారా ఎన్నికలు జరపడానికి కూడా ఈసీ, ఆ తర్వాత ఏజీఎం ఆమోదం తెలపాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అవకాశం లేదని, అందువల్ల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి ఉందని అంటున్నారు.