హైదరాబాద్‌లో రూ.8.50 లక్షల దారిదోపిడీ కేసులో కొత్త ట్విస్ట్..!

ABN , First Publish Date - 2020-05-27T16:13:36+05:30 IST

మీర్‌పేట్‌ దారి దోపిడీ కేసులో ఫిర్యాదుదారుడే దొంగగా తేలింది. డబ్బు కోసం దోపిడీ డ్రామా ఆడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన తిరుపతిరెడ్డికి విస్తరాకుల తయారీ పరిశ్రమతో పాటు ముడి సరుకు సరఫరా

హైదరాబాద్‌లో రూ.8.50 లక్షల దారిదోపిడీ కేసులో కొత్త ట్విస్ట్..!

దొంగ అల్లుడు..!

మీర్‌పేట్‌ దారి దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్‌

సరూర్‌నగర్‌, హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): మీర్‌పేట్‌ దారి దోపిడీ కేసులో ఫిర్యాదుదారుడే దొంగగా తేలింది. డబ్బు కోసం దోపిడీ డ్రామా ఆడినట్టు పోలీసుల విచారణలో  వెల్లడైంది. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన తిరుపతిరెడ్డికి విస్తరాకుల తయారీ పరిశ్రమతో పాటు ముడి సరుకు సరఫరా చేసే వ్యాపారం ఉంది. హైదరాబాద్‌లోని పలు పరిశ్రమలకు ముడి సరుకు, విస్తర్లు సరఫరా చేస్తుంటాడు. వారి నుంచి డబ్బు వసూలుకు అల్లుడి వరుసయ్యే ఎం.అచ్చిరెడ్డి(28)ని నియమించుకున్నాడు. అచ్చిరెడ్డి సోమవారం కోదాడ నుంచి నగరానికి వచ్చి సూరారం, అంబర్‌పేట్‌లలో రూ.8.50 లక్షలు వసూలు చేసుకుని ఓ బ్యాగులో పెట్టుకున్నాడు.


అనంతరం గుర్రంగూడలో మరో రూ.26,500 వసూలు చేసుకుని జేబులో పెట్టుకున్నాడు. మొత్తం డబ్బును కాజేయాలని నగదు ఉన్న బ్యాగును గుర్రంగూడలోని ఓ రహస్య ప్రదేశంలో దాచి పెట్టాడు. మీర్‌పేట్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తెల్ల రంగు బైకుపై వచ్చి ఎత్తుకుపోయారని ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గుర్రంగూడ-నాదర్‌గుల్‌ రోడ్డులోని సీసీ కెమెరాలన్నింటినీ పరిశీలించారు. అచ్చిరెడ్డి పేర్కొన్న ముగ్గురు వ్యక్తులు వెళ్లిన తెల్ల రంగు వాహనం ఎక్కడా కనిపించలేదు. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా, అచ్చిరెడ్డి అసలు విషయం బయటపెట్టాడు. సదరు మొత్తాన్ని కాజేయాలనే ఆశతో తానే ఈ డ్రామా ఆడినట్టు ఒప్పుకున్నాడు. దాంతో అతడి నుంచి రూ.8.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-05-27T16:13:36+05:30 IST