లయ తప్పిన గుండెకు కొత్త చికిత్స

ABN , First Publish Date - 2021-10-26T08:38:02+05:30 IST

లయ తప్పిన గుండెకు స్వస్థత చేకూర్చే అదునాతన వైద్య ప్రక్రియ అందుబాటులోకి వచ్చేసింది. ‘క్రయోబెలూన్‌ అబ్లేషన్‌’గా వ్యవహరిస్తున్న ఈ ప్రక్రియ దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ‘ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ’

లయ తప్పిన గుండెకు కొత్త చికిత్స

  • క్రయోబెలూన్‌ అబ్లేషన్‌ ప్రక్రియతో గుండె వేగానికి కళ్లెం
  • ఏఐజీలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ప్రక్రియ


హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): లయ తప్పిన గుండెకు స్వస్థత చేకూర్చే అదునాతన వైద్య ప్రక్రియ అందుబాటులోకి వచ్చేసింది. ‘క్రయోబెలూన్‌ అబ్లేషన్‌’గా వ్యవహరిస్తున్న ఈ ప్రక్రియ దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ‘ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ’ ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చింది. హృదయ స్పందనల్లో తేడా (ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌) సమస్య ఉన్న రోగులు ఈ చికిత్స చేయించుకుని ఒక్కరోజులోనే ఇంటికి వెళ్లి, ఎలాంటి సమస్యా లేకుండా తమ దైనందిన కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. ఏఐజీ ఆస్పత్రిలో వారం రోజుల క్రితం ఇద్దరు రోగులకు ఈ చికిత్స చేశారు. మన దేశంలో ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ (ఏఎ్‌ఫఐబి)తో 50 లక్షల మందికిపైగా అవస్థ పడుతున్నారు. ఇది గుండెపోటును ప్రేరేపించి, గుండె ఆగిపోయేలా చేసే ఒక తీవ్రమైన అనారోగ్య పరిస్థితి.


దీని బారిన పడితే.. హృదయ స్పందనలను నియంత్రించే విద్యుత్‌ ప్రేరణలు గుండె వేగంగా కొట్టుకునేలా చేసి గుండెకి జరిగే రక్తసరఫరాలో అంతరాయాన్ని కలగిస్తాయి. దీంతో రోగికి గుండె దడ, శారీరక బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయని ఏఐజీ డైరెక్టర్‌, ఎలెకో్ట్రఫిజియాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ సి. నరసింహన్‌ తెలిపారు. సాధారణంగా ఈ రుగ్మతను మందులతో తగ్గించే ప్రయత్నం చేస్తారు. మందులకు తగ్గకపోతే.. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌ విధానంలో చికిత్స చేస్తారు. అయితే, ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌ ప్రక్రియ అధిక ఉష్ణశక్తిని ఉపయోగించే సుదీర్ఘమైన ప్రక్రియ. దీని స్థానంలో ‘క్రయోబెలూన్‌ అబ్లేషన్‌’ ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిందని నరసింహన్‌ వివరించారు. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌ కన్నా ఈ విధానంలో ఫలితాలు మెరుగ్గా ఉంటాయని, వ్యాధి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వెల్లడించారు. దీనిని కూలింగ్‌ బెలూన్‌ చికిత్సగా పేర్కొంటామని తెలిపారు. ఈ విధానం ద్వారా తమ ఆస్పత్రిలో ఇద్దరు రోగులకు చికిత్స అందించామని చెప్పారు.  

Updated Date - 2021-10-26T08:38:02+05:30 IST