కాలువలకు కొత్తరూపేది?

ABN , First Publish Date - 2021-06-23T05:12:01+05:30 IST

ఖరీఫ్‌ వచ్చేసింది. వరినాట్లకు సమయం ఆసన్నమవుతోంది.. ఈ సమయంలో ఆదుకోవలసింది పంట కాలువలే. జిల్లాలో అధికశాతం వీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ఏటా జూలై వచ్చేసరికి సాగునీటి కాలువలన్నీ నీటి ప్రవాహంతో కళకళలాడుతుంటాయి. ఈ ఏడాది మాత్రం కాలువలు నీటితో నిండే అవకాశాలు కనిపించడం లేదు.

కాలువలకు కొత్తరూపేది?
తోటపల్లి ఎడమ కాల్వకు లైనింగ్‌ పనులూ చేపట్టని దృశ్యం.

ఖరీఫ్‌ వచ్చినా కానరాని చర్యలు

పూడిక తొలగించని యంత్రాంగం

కొన్నిచోట్ల మొక్కుబడిగా పనులు

 రూ.కోట్లలో నిధులున్నా పట్టించుకోని వైనం

ఖరీఫ్‌ వచ్చేసింది. వరినాట్లకు సమయం ఆసన్నమవుతోంది.. ఈ సమయంలో ఆదుకోవలసింది పంట కాలువలే. జిల్లాలో అధికశాతం వీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ఏటా జూలై వచ్చేసరికి సాగునీటి కాలువలన్నీ నీటి ప్రవాహంతో కళకళలాడుతుంటాయి. ఈ ఏడాది మాత్రం కాలువలు నీటితో నిండే అవకాశాలు కనిపించడం లేదు. ఇంతవరకు జంగిల్‌ క్లియరెన్స్‌, పూడిక తొలగింపు, లైనింగ్‌ పనులు చేపట్టకపోవడమే ఈ పరిస్థితికి కారణం. 


(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

ఖరీఫ్‌కు సంబంధించి వరి విత్తనాలు వేసిన రైతులు మరి కొన్నివారాల్లో నాట్లకు సిద్ధం కానున్నారు. వరి పొలానికి నీరందించే కాలువలు మాత్రం సిద్ధంగా లేవు. సంబంధిత యంత్రాంగం ఈ ఏడాది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కాలువలను పట్టించుకోవడం మానేశారు. నిధులున్నా నిర్లక్ష్యం చూపారు. ఇంతవరకు కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టలేదు. వర్షాలు ప్రారంభమవుతున్న తరుణంలో జంగిల్‌ క్లియరెన్స్‌ చేసి పనులు మమ అనిపించేయాలని ఇంజినీరింగ్‌ అధికారులు భావిస్తున్నారు. కొన్ని చోట్ల అరకొరగా పనులు చేపడుతున్నారు. వెంగళరాయసాగర్‌, వట్టిగెడ్డ, ఆండ్ర, పెద్దగెడ్డ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు భారీగా మంజూరయ్యాయి. నీటి పారుదల శాఖలో సహజంగా మే, జూన్‌ నెలల్లో కాలువల పనులు చేపడతారు. వర్షాలు పడ్డాక ఆ పనులకు సంబంధించి ఎఫ్‌మ్‌(ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌) బుక్కులు తయారు చేసుకుంటారన్నది విమర్శ. రికార్డుల సంగతి తర్వాత... ఈ ఏడాది పనులే చేయలేదు. దీంతో మరిన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది డిసెంబరులో కొన్ని సాగునీటి ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపన చేయగా నేటికీ అవి ప్రాథమిక దశలోనే ఉండిపోయాయి. 

ఒట్టిగెడ్డను పట్టించుకోని డిప్యూటీ సీఎం

ఒట్టిగెడ్డ సాగునీటి ప్రాజెక్టుకు రూ.44 కోట్లు జైకా నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో పనులు చేపట్టేందుకు వీలుగా ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి గత ఏడాది డిసెంబరులోనే పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. 16,750 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఈ సాగునీటి ప్రాజెక్టు పరిధిలో కాల్వల ఆధునికీకరణ పనులు జరగాలి. దీని ఊసే లేకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబరులో శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి... తరువాత దృష్టి పెట్టడం లేదు. ఆమె సొంత నియోజకవర్గమే కాకుండా సొంత మండలంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టు ఇది. 

నిరాశాజనకంగా వెంగళరాయసాగర్‌

ఈ ప్రాజెక్టు మూడు మండలాల రైతులకు ఆశా కిరణం. ప్రధాన కాల్వల పనులు చేపట్టేందుకు రూ.63 కోట్లు మంజూరయ్యాయి. వేసవిలోనే ఈ పనులు చేపట్టి పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇటీవల తీరికగా పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో మక్కువ, సీతానగరం, బొబ్బిలి మండలాల్లోని 25వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రధాన కుడి, ఎడమ కాల్వల ఆధునికీకరణకు జైకా నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల కోసం దశాబ్ద కాలంగా అదిగో ఇదిగో అంటూ వచ్చారు. ఇపుడు నిధులు మంజూరై ఏడాది అవుతున్నా పరిస్థితిలో ఏ మాత్రం మార్పులేకపోయింది. ప్రాజెక్టు పరిధిలో ప్రస్తుతం ప్రధాన మట్టి కట్ట నుంచి 10 కిలోమీటర్ల పొడవున జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు జరుగుతున్నాయి. ఆ తరువాత కాల్వల్లో పేరుకుపోయిన సిల్టు తొలగించాలి. అనంతరం లైనింగ్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఈఏడాదికి జంగిల్‌ క్లియరెన్స్‌తోనే పనులు ముగించే పరిస్థితి కనిపిస్తోంది.

అధ్వానంగా అండ్ర కాలువలు

ఆండ్ర సాగునీటి ప్రాజెక్టు చంపావతినదిపై మెంటాడ మండలంలో నిర్మించారు. మెంటాడ, గజపతినగరం, బొండపల్లి మండలాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టులోని కాల్వలు పూర్తిగా సిల్టు, పొదలతో నిండి ఉన్నాయి. ఆధునికీకరణకు రూ.18 కోట్లు మంజూరైనా ఇంతవరకు కీలక పనులు చేపట్టలేదు. అనుకూల వాతావరణం ఉన్నపుడు పట్టించుకోని అధికారులు ఇప్పుడు హడావిడి చేస్తున్నారు. 

తోటపల్లిదీ అంతే..

భారీ సాగునీటి ప్రాజెక్టు తోటపల్లి కాలువల ఆధునికీకరణలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు పరిధిలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. వంద కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వలు విస్తరించి ఉన్నాయి. వీటికి ఏటా ఒడ్డు కోతకు గురై కాల్వల్లో సిల్టు చేరుతోంది. రూ.150 కోట్లతో కాల్వలను ఆధునికీకరించాల్సి ఉంది. వేసవిలో పనులు చేపట్టకుండా ఇపుడు లైనింగ్‌ పనులు చేపట్టడం గమనార్హం. 

పేరుకే పెద్దగెడ్డ

పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ సాగునీటి ప్రాజెక్టుకు కూడా జైకా నిధులు మంజూరయ్యాయి. పాచిపెంట, సాలూరు, రామభద్రపురం మండలాల్లోని 12 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు కాల్వల ఆధునికీకరణ జరిగితే శివారు ఆయకట్టుకూ నీరందుతుంది. నిధులు రూ.22 కోట్లు మంజూరైనా ఇప్పటికీ పనులు చేపట్టలేదు. మరో ప్రధాన సాగునీటి ప్రాజెక్టు తాడిపూడి సాగునీటి ప్రాజెక్టులో కూడా కాల్వలు భారీగా దెబ్బతిన్నాయి. మరమ్మతులకు ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. 

పనులు చేయిస్తున్నాం

సాగునీటి కాలువల పనులు జరుగుతున్నాయి. వెంగళరాయసాగర్‌ కుడి ప్రధాన కాల్వ పరిధిలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపట్టాం. 10కిలో మీటర్ల మేర పూర్తి చేశాం. తరువాత సిల్టు తొలగించి లైనింగ్‌ పనులు చేపడతాం. సాగునీరు వదిలే వరకు ఆధునికీకరణ పనులు చేయిస్తాం. మిగిలిన పనులు ఖరీఫ్‌ తరువాత చేపడతాం. 

- ఎం.రాజశేఖర్‌, ఏఈ, వెంగళరాయసాగర్‌



Updated Date - 2021-06-23T05:12:01+05:30 IST