కొత్తకాలం

ABN , First Publish Date - 2022-01-01T06:15:13+05:30 IST

ఈకొత్త సంవత్సరంలో భారతదేశం డెబ్బయ్ఐదేళ్ళు పూర్తిచేసుకుంటున్నది. మహమ్మారి మనలను నిండా ముంచేసిన పాడుకాలం ముగిసి, మంచిరోజులు త్వరితంగా మొదలైతే బాగుండునని అందరూ కోరుకుంటున్నారు....

కొత్తకాలం

ఈకొత్త సంవత్సరంలో భారతదేశం డెబ్బయ్ఐదేళ్ళు పూర్తిచేసుకుంటున్నది. మహమ్మారి మనలను నిండా ముంచేసిన పాడుకాలం ముగిసి, మంచిరోజులు త్వరితంగా మొదలైతే బాగుండునని అందరూ కోరుకుంటున్నారు. అతివేగంగా విజృంభిస్తున్న ఒమైక్రాన్ మనలను కొంతకాలమైనా సతాయించక తప్పదు. ప్రమాద తీవ్రత తక్కువేనన్న అంచనాలు, విశ్లేషణలతో పాటు,  ఇప్పటికే దాని రాకపోకలు ముగించుకున్న దక్షిణాఫ్రికా ఈ విషయంలో మరింత స్పష్టమైన ధైర్యాన్ని ఇస్తోంది.


కరోనా--–2020 ముఖచిత్రం వేరు, నిన్నటి ౨021 వేరు. పిల్లాపాపలతో నడుచుకుంటూ స్వస్థలాలు పోతున్న వలస కార్మికులూ, నెర్రెలు వారిన వారిపాదాలు తొలివిడత మహమ్మారికి ప్రతిరూపాలు. చరిత్రలో నిలిచిపోయే ఆ భారీ వలసలూ, అందులో భాగంగా వారు ఎదుర్కొన్న అమానవీయమైన పరిస్థితులు, రైలుపట్టాలమీద చెల్లాచెదురైన వారి దేహాలు ఎల్లకాలం గుర్తుండిపోతాయి. నిన్నటి ఏడాది ఆఖరి కొద్దినెలలు కాస్తంత తెరిపి ఇచ్చినా దాదాపు సంవత్సరమంతా కరోనాదశే కొనసాగింది. అతికొద్దికాలంలో డెల్టావేరియంట్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతాకాదు. మలివిడత కరోనా మరణాలు లెక్కకు అందనివి. పాలకులు వేలాది మరణాలను లెక్కలు చెప్పకుండా దాచినా, దహనవాటికల ముందు బారులు తీరిన అంబులెన్సులు, అంతిమయాత్ర వాహనాలు, ఆపద్ధర్మంగా బహిరంగప్రదేశాల్లో ఏర్పడిన కొత్త దహనవాటికలు ఆ మరణాల లెక్కలు చెప్పకనే చెప్పాయి.


ఒకేమారు అనేక మృతదేహాలను దహనం చేస్తున్న దృశ్యాలు, గంగానదిలో కొట్టుకొచ్చిన శవాలు అంతర్జాతీయ పత్రికల పతాక చిత్రాలైనాయి. ప్రాణవాయువు లేక కళ్ళముందే ఆత్మీయులు కన్నుమూసిన భయానక, అమానవీయ స్థితిని దేశం ఎదుర్కొంది. ఒకపక్కన జీవితం సాగుతూ, మరోపక్కన సమస్త ఆర్థిక, మానవ కార్యకలాపాలు మూసివేయడమో, తెరవడమో జరుగుతూ చివరికొద్దినెలల ముందువరకూ అంతా పాక్షికమే. ఉద్యోగ ఉపాధులపైన కరోనా వేసిన ప్రభావం 2021లోనూ ఏదోస్థాయిలో కొనసాగుతూనే ఉంది. పారిశ్రామికవేత్తలకు మాత్రం పాలకులు వివిధ రూపాల్లో తమ అండదండలు అందిస్తూనే వచ్చారు. ఇంతటి మహమ్మారిలోనూ వ్యవసాయం చెదరకుండా అలాగే కొనసాగడం, మంచిపంటలు పండటం దేశం చేసుకున్న అదృష్టం అనుకోవాలి. దానితోపాటు కొన్ని పారిశ్రామిక సేవారంగాలు కోలుకొని దేశ ఆర్థికానికి కాస్తంత ఆక్సిజన్ అందించాయి. ఆదిలో తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కొన్న విద్యారంగం ఈ మధ్యనే కాస్తంత తేరుకుంది. కరోనా కష్టాలను అధిగమించడానికి స్కూళ్ళు, పిల్లలు, టీచర్లు బాగానే శ్రమించారు. 


నాయకులకూ, ఎన్నికలకూ కరోనా అడ్డంకేమీ కాదు. గత ఏడాది మాదిరిగానే, ఎన్నికల ప్రచారాలు, విషప్రచారాలు యధావిధిగా కొనసాగాయి. ప్రజలు ఎంతటి దయనీయస్థితిలో ఉన్నప్పటికీ మతజాఢ్యాలు అంటించడం అన్నది ఏదో రూపంలో సాగుతూనే ఉంది. మానవ సంక్షోభాలను సైతం తమ అధికారానికి సోపానాలుగా మార్చుకోగల సమర్థులు నాయకులు. అమెరికాలోనూ, యూరప్ లోనూ మితవాదశక్తులను ఈ తీవ్ర కరోనా కాలంలోనే ప్రజలు అధికారానికి దూరం చేశారు. మన దేశంలో కూడా కొత్త సంవత్సరంలో అత్యంత కీలకమైన ఎన్నికలు జరగబోతున్నాయి.


అధికారంలో ఉన్నవారికి అత్యంత ముఖ్యమైనవి అవి. చరిత్రలో నిలిచే స్థాయిలో కొత్త సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగించిన ఆందోళన ఏడాది చివర్లో ఫలించడం సంతోషించవలసిన పరిణామం. ఈ ఎన్నికల్లో వారు చూపగలిగే ప్రభావంపైనే పాలకుల బెంగ. ఇప్పుడు మూడోవేవ్ ముంగిట ఉన్నాం. ఇది విస్తృతమైనదే కానీ, ప్రాణనష్టం కలిగించదని అంటున్నారు. వందకోట్ల టీకా వేడుకలకు తాత్పర్యం చెప్పడం కష్టం కానీ, రెండో డోసు అందనివారు కూడా ఎంతో మంది మిగిలిఉండగా, కొత్తగా ముందుజాగ్రత్త డోసు ఒకటి ముందుకొచ్చింది. కొత్తరూపంలో వచ్చిన మహమ్మారి ప్రజలను అంతగా బాధించదని ఆశిద్దాం. దానిని అవలీలగా అధిగమించడమే కాక, ప్రజలు తమ భవిష్యత్తు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారనీ, మంచి ఎంపికలు చేసుకుంటారనీ ఆశిద్దాం.

Updated Date - 2022-01-01T06:15:13+05:30 IST