ఐపీఎల్ 2022: కొత్త జట్ల జోరు.. మాజీ ఛాంపియన్లు బేజారు

ABN , First Publish Date - 2022-04-18T23:49:28+05:30 IST

ముంబై : ఐపీఎల్ 2022 సీజన్ మంచి రసవత్తరంగా కొనసాగుతోంది. మొత్తం 10 జట్లతో కూడిన ఈ ఏడాది సీజన్‌ మ్యాచ్‌లు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి.

ఐపీఎల్ 2022: కొత్త జట్ల జోరు.. మాజీ ఛాంపియన్లు బేజారు

ముంబై : ఐపీఎల్ 2022 సీజన్ మంచి రసవత్తరంగా  కొనసాగుతోంది. మొత్తం 10 జట్లతో కూడిన ఈ సీజన్‌ మ్యాచ్‌లు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి. తీవ్ర ఉత్కంఠతో కూడిన ముగింపులు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ల మెరుపులు, బౌలర్ల గర్జనలు, ఫీల్డర్ల సాహసాలు టోర్నీకి ఆకర్షణగా మారాయి. అయితే ఈ సీజన్‌లో మరో ప్రత్యేకత ఏంటంటే.. కొత్తగా అడుగుపెట్టిన రెండు జట్లు అదరగొడుతుండగా.. గత సీజన్లలో ఛాంపియన్లుగా వెలుగొందిన రెండు జట్లు ఘోర ఓటములను చవిచూస్తున్నాయి. స్టార్ ప్లేయర్లు ఉన్నా పరాజయాలను తప్పించుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్‌లో విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్ డీలా పడింది. ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడి అన్నింటిలోనూ ఓటమిపాలయింది. దీంతో ఇదివరకెప్పుడూ చూడని ఆరంభ పరాభవాన్ని ఆ జట్టు ఎదుర్కొంటోంది. మరో జట్టు చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పేలవ ప్రదర్శన చూస్తుంటే ఈసారి ఆ జట్టు ప్లే ఆఫ్‌కు చేరే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే జరిగితే ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ రెండవసారి ఫ్లే ఆఫ్ చేరనట్టవుతుంది. మహింద్ర సింగ్ ధోని నుంచి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టు పగ్గాలను అందుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచిందంటే ఆ జట్టు ప్రదర్శన ఏంటో స్పష్టమవుతోంది.


మాజీ ఛాంపియన్లు ఘోరపరాభవాన్ని ఎదుర్కొంటున్న వేళ ఈ ఏడాదే కొత్తగా అడుగుపెట్టిన రెండు జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు మొత్తం 6 మ్యాచులు ఆడి అందులో ఐదింటిని గెలుపొందింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ కూడా 6 మ్యాచులు ఆడి నాలుగింట్లో విజయబావుటా ఎగరేసింది. పాయింట్స్ టేబుల్‌లో రెండవ స్థానంలో కొనసాగుతోంది.

Updated Date - 2022-04-18T23:49:28+05:30 IST