సరికొత్త స్వచ్ఛ సర్వేక్షణ్‌

ABN , First Publish Date - 2022-06-22T06:02:35+05:30 IST

నగరాలు, పట్టణాల్లో పరిశుభ్రతను పెంచడం ద్వారా ఉత్తమమైన ఆవాస ప్రాం తాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛసర్వేక్షణ్‌ సరికొత్త మార్పులతో రాబోతోంది. దీనికి స్వచ్ఛసర్వేక్షణ్‌ - 2013 నుంచే శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికే ఈ యేడుకు సంబంధించిన టూల్‌ కిట్‌ను కేంద్ర పట్టణ, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా రూపొందించిన నూతన నియమావళిని కూడా జారీ చేసింది. స్వచ్ఛసర్వేక్షణ్‌ ద్వారా పారిశుధ్య పరిరక్షణ లక్ష్యాన్ని మరింత సమర్థవంతంగా సాధించేందుకు వీలుగా కేంద్రం కొన్ని సంస్కరణలు చేసింది. మదింపు, మార్కులు, ర్యాంకుల నిర్ధారణలో కొత్త విధానాలను ప్రవేశపెట్టింది.

సరికొత్త స్వచ్ఛ సర్వేక్షణ్‌

మార్పులకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం
ఇక నుంచి నాలుగు విడతల మదింపు
వందశాతం శాంప్లింగ్‌..
మదింపుదారుల సంఖ్య పెంపు
విడుదలైన స్వచ్ఛ సర్వేక్షణ్‌-2023 టూల్‌కిట్‌
జారీ అయిన నూతన మార్గదర్శకాలు
పోటీకి సిద్ధమవుతున్న వరంగల్‌ కార్పొరేషన్‌, ఉమ్మడి జిల్లాలోని 9 పురపాలికలు


నగరాలు, పట్టణాల్లో పరిశుభ్రతను పెంచడం ద్వారా ఉత్తమమైన ఆవాస ప్రాం తాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛసర్వేక్షణ్‌ సరికొత్త మార్పులతో రాబోతోంది. దీనికి స్వచ్ఛసర్వేక్షణ్‌ - 2013 నుంచే శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికే ఈ యేడుకు సంబంధించిన టూల్‌ కిట్‌ను కేంద్ర పట్టణ, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా రూపొందించిన నూతన నియమావళిని కూడా జారీ చేసింది. స్వచ్ఛసర్వేక్షణ్‌ ద్వారా పారిశుధ్య పరిరక్షణ లక్ష్యాన్ని మరింత సమర్థవంతంగా సాధించేందుకు వీలుగా కేంద్రం కొన్ని సంస్కరణలు చేసింది. మదింపు, మార్కులు, ర్యాంకుల నిర్ధారణలో కొత్త విధానాలను ప్రవేశపెట్టింది.

హనుమకొండ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర పట్టణ, గృహ నిర్మాణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2016 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్‌ను నిర్వహిస్తోంది. పట్టణాలు, నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని, స్ఫూర్తిని పెంపొందించడం, స్వచ్ఛత పరిరక్షణలో పౌరులను పెద్దఎత్తున భాగస్వాములను చేయడం, పట్టణాలు, నగరాలు పౌరుల ఆవాసానికి ఉత్తమమైన ప్రదేశాలుగా మార్చడం, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. కాగా, స్వచ్ఛ సర్వేక్షణ్‌ -2023 నియమావళికి అనుగుణంగా పోటీ పడేందుకు వరంగల్‌ మహానగర పాలక సంస్థతో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని తొమ్మిది పురపాలక సంఘాలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు సిబ్బందిని సమాయత్తం చేస్తున్నాయి. వీలైనన్ని ఎక్కువ మార్కులు, ఆ మేరకు ర్యాంకులు సాధించడం ద్వారా స్వచ్ఛసర్వేక్షణ్‌ పురస్కారాలను పొందేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

నాలుగు విడతల తనిఖీలు

స్వచ్ఛ సర్వేక్షణ్‌ -2013లో స్వచ్ఛత పరిశీలనకు నాలుగు విడతలుగా తనిఖీలు నిర్వహిస్తారు. మొదటి త్రైమాసిక తనిఖీలు ఏప్రిల్‌- మే (కాల్‌ ఆన్‌ వ్యాలిడేషన్‌), రెండో విడత త్రైమాసిక తనిఖీలు జూన్‌-జులై (కాల్‌ ఆన్‌ వ్యాలిడేషన్‌), మూడో విడత తనిఖీలు ఆగస్టు-సెప్టెంబర్‌, నాలుగో విడత అక్టోబర్‌- డిసెంబర్‌ మధ్య జరుగుతాయి. ఈ మేరకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ నియమావళిని కేంద్ర కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల  మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఈ శాఖ మార్చి 1న స్వచ్ఛ సర్వేక్షణ్‌ - 2022 సర్వేను అధికారికంగా ప్రారంభించింది.  గతంలో 40 శాతంగా ఉన్న శాంప్లింగ్‌ కోసం సర్వే పరిధిని ఇప్పుడు 100 శాతం వార్డులకు విస్తరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ - 2023 క్షేత్రస్థాయిలో మదింపు మరింత కచ్చితత్వం కోసం మదింపుదారుల సంఖ్యను పెంచనున్నారు. కార్పొరేషన్‌, పురపాలికలు స్వచ్ఛపురోగతిని స్వచ్ఛతమ్‌ పోర్టల్‌ ఎంఐఎ్‌సలో ఎప్పటికప్పుడు ఆప్‌లోడ్‌ చేస్తాయి.

అవార్డులు
కార్పొరేషన్‌తో పాటు ఆయా పురపాలికల్లో జనాభా ఆధారంగా ఈ అవార్డులు ఇస్తారు. 15వేల లోపు, 15-25వేల లోపు, 25-50వేల లోపు, 50-లక్ష లోపు, లక్ష-10 లక్షల లోపు జనాభా కలిగిన మున్సిపాలిటీలకు ఐదు పురస్కారాలను ప్రకటిస్తారు. పట్టణాల్లో ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడం, వాహనాల ద్వారా తరలించడం, యంత్రాలను ఉపయోగించి పునర్వియోగించడం.. ఇలా వ్యర్థాలకు అర్థం కల్పిస్తూ ఆదాయంగా మలుస్తున్నారు. పౌరుల భాగస్వామ్యంతో పట్టణ పారిశుధ్య మెరుగుపరచడం, ఆహ్లాద వాతావరణాన్ని కల్పిస్తున్న సంస్థలకు కేంద్రం ర్యాంకులు, అవార్డులు, నగదు ప్రోత్సాహకాన్ని అందచేజేస్తోంది. 2016 నుంచి కేంద్రం స్వచ్ఛసర్వేక్షణ్‌ పేరుతో కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తోంది. ఏటా కేంద్ర           బృందాలు స్థానిక సంస్థల పనితీరును గుర్తిస్తున్నాయి.

సన్నద్ధత
వరంగల్‌ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యుఎంసీ)తో పాటు ఉమ్మడి జిల్లాలోని జనగామ, మహబూబాబాద్‌, డోర్నకల్‌, కురవి, తొర్రూరు, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, భూపాలపల్లి మున్సిపాలిటీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ పురస్కారాలు పొందేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌ కొత్త నియమావళికి అనుగుణంగా ప్రణాళికల రూపకల్పనకు ఇప్పటి నుంచే శ్రీకారాలు చుడుతున్నాయి. త్రిబుల్‌ ఆర్‌కు అనుగుణంగా స్వచ్ఛ ఆటోట్రాలీలతో ఇంటింటి చెత్త సేకరణ చేపట్టడం, తడి వ్యర్థాల ద్వారా సేంద్రియ ఎరువులను తయారు చేసి విక్రయించడం, పొడి వ్యర్థాలను 24 రకాలుగా విడగొట్టి ఆయా కర్మాగారాలకు ఎగుమతి చేయడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. తాజాగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ - 2023 నియమావళి విడుదలైన నేపథ్యంలో పౌరులు, అధికారులు, మహిళా సమాఖ్యలు భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకుంటారు. జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తారు.

ఒక్కో లక్ష్యంగా..
స్వచ్ఛ సర్వక్షణ్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ (రెడ్యూస్‌ రీసైకిల్‌ రీయూజ్‌)కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన సర్వేలో మూడు దశలుండగా తాజాగా నాలుగోదశను కూడా జోడించారు. స్వచ్ఛ సర్వక్షణ్‌ ఒక్కో  ఏడాది ఒక్కో అంశాన్ని లక్ష్యంగా చేసుకొని పనులను నిర్దేశిస్తున్నారు. 2021లో సామాజిక, బహిరంగ మరుగుదొడ్ల నిర్మాణం, తడి, పొడి వ్యర్థాలను వేరు చేయడం  వంటి అంశాలను లక్ష్యంగా ఎంచుకున్నారు. 2022లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సీనియర్‌ సిటిజన్లను సంపూర్ణంగా భాగస్వాములుగా చేయడం ఇతి వృత్తంగా ఎంచుకున్నారు. 2023లో వ్యర్థాలను పునర్వినియోగం చేసి ఆదాయాన్ని ఆర్జిస్తున్న పురపాలికలను గుర్తించనున్నారు. దీనినే ఆర్‌ఆర్‌ఆర్‌గా పిలుస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.

మార్కులు ఇలా..
స్వచ్ఛసర్వేక్షణ్‌లో మొత్తం మార్కులు 9,500. ఇందులో మూడు కేటగిరీలు ఉంటాయి. సర్వీస్‌ లెవల్‌ ప్రోగ్రెస్‌ కేటగిరిలో 4,525 మార్కులు (48శాతం) ఉంటాయి. ఇందులో మూడు అంశాలుంటాయి. వ్యర్థాల సేకరణకు 1,750, ప్రాసెసింగ్‌ డిస్పోజల్‌కు 1,830, యూజ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌, సఫాయి మిత్రకు 945 మార్కులు ఇస్తారు. సర్టిఫికేషన్‌ కేటగిరిలో 2,500 మార్కులు (26శాతం) ఉంటాయి. సిటిజన్‌ వాయిస్‌ కేటగిరికి 2,475 మార్కులు (26శాతం) ఉంటాయి. పురవాసుల స్పందన, యువత స్పందనలు, పౌరుల భాగస్వామ్యం, స్వచ్ఛత యాప్‌, పౌరుల అనుభవాలు, ఇన్నోవేషన్లు, ఉత్తమ ఎంపికలు, విపత్తు ఎంపిడెమిక్‌, ప్రతిస్పందన, సంసిద్ధత వంటి అంశాలను ప్రధాన పరిశీలించి మార్కులు ఇస్తారు.

Updated Date - 2022-06-22T06:02:35+05:30 IST