YS Jagan Convoy : నిఘా వర్గాల హెచ్చరికలతో ‘నయా రూల్’..

ABN , First Publish Date - 2021-12-04T06:21:09+05:30 IST

YS Jagan Convoy కదిలితే.. నిఘా వర్గాల హెచ్చరికలతో నయా రూల్..

YS Jagan Convoy : నిఘా వర్గాల హెచ్చరికలతో ‘నయా రూల్’..

  • సీఎం కదిలితే ఆగిపోవాల్సిందే
  • బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్లపై కొత్త నిబంధన
  • కాన్వాయ్‌  ఏ ఫ్లైఓవర్‌పై ఉన్నా రెండో ఫ్లైఓవర్‌ బంద్‌
  • నిఘా వర్గాల హెచ్చరికలతో నయా రూల్‌


రెండు ఫ్లైఓవర్లు పక్కపక్కనే ఉన్నాయి. ఒక ఫ్లైఓవర్‌పై నుంచి వీఐపీ వెళ్తుంటే మరో ఫ్లైఓవర్‌పై టాఫ్రిక్‌ను అనుమతించేవారు. ఇక నుంచి బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌పై ఇది కుదరదు. రెండు ఫ్లైఓవర్లపై దేని పైనుంచి వీఐపీ కాన్వాయ్‌ వెళ్లినా రెండో ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌ను నిలిపివేస్తారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనలు ఉన్నప్పుడు ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయనున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. జగన్‌ ఇతర జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు, హైదరాబాద్‌, ఢిల్లీకి వెళ్లేటప్పుడు రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.


తిరుగు ప్రయాణంలో విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ఈ దారిలో బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయన ఒక ఫ్లైఓవర్‌ పైనుంచి వెళ్తే మరో ఫ్లైఓవర్‌పై నుంచి ట్రాఫిక్‌ను పంపేవారు. ఇప్పుడు ఆయన ఏ ఫ్లైఓవర్‌పై నుంచి వెళ్లినా మరో ఫ్లైఓవర్‌ పై పూర్తిగా ట్రాఫిక్‌ను నిలిపివేస్తారు. నిఘా వర్గాల నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. సీఎం కాన్వాయ్‌ బయలుదేరడానికి ముందే నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నారు. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొత్తగా అమలు చేయబోయే నిబంధనల వల్ల ఆ సమస్య మరింత జఠిలమవుతుందని భావిస్తున్నారు. - ఆంధ్రజ్యోతి, విజయవాడ  

Updated Date - 2021-12-04T06:21:09+05:30 IST