అమల్లోకి కొత్త ఆంక్షలు

ABN , First Publish Date - 2021-05-07T12:47:36+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌ రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో గురువారం నుంచి మరికొన్ని సరికొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. ఆ ప్రకారంగా ఉదయం 6 నుంచి మధ్నాహ్నం 12 గంటల

అమల్లోకి కొత్త ఆంక్షలు

       - 12 గంటలకే మూతపడిన దుకాణాలు 

       - 4 గంటలే తెరుచుకున్న మద్యం షాపులు  

        - కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులే


అడయార్‌(చెన్నై): రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌ రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో గురువారం నుంచి మరికొన్ని సరికొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. ఆ ప్రకారంగా ఉదయం 6 నుంచి మధ్నాహ్నం 12 గంటల వరకే దుకాణాలు, సూపర్‌మార్కెట్లు, మాంసం దుకాణాలు, టీ షాపులు పనిచేశాయి. అదేవిధంగా నగర బస్సుల్లో కేవలం 50 శాతం ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేలా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రయాణికులంతా విధిగా మాస్క్‌ ధరించేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా, సబర్బన్‌, మెట్రో రైళ్ళలో సాధారణ ప్రయాణికులకు అనుమతి నిరాకరించారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు, చెంగల్పట్టు జిల్లాల్లో ఎక్కడ కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒక్కటంటే ఒక్క దుకాణం కూడా తెరిచి ఉంచలేదు. పలు ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహించి తెరివుంచిన దుకాణాలను మూసివేయించారు. 


ఆఫీసుల్లో సగంమంది ఉద్యోగులు

కరోనా వైరస్‌ సంక్రమణకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా గురువారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం ఉద్యోగులతోనే నడిచాయి. రాష్ట్ర సచివాలయంతో పాటు రెవెన్యూ శాఖ, ప్రజాపనుల శాఖ, వాణిజ్య పన్నులు, విద్యుత్‌, ఆరోగ్య శాఖలతో పాటు దాదాపు 60 శాఖల వరకు ఉన్నాయి. ఈ శాఖలన్నీ 50 శాతం ఉద్యోగులతోనే పనిచేశాయి. ఆ ప్రకారంగా అన్ని శాఖల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరయ్యారు. అయితే, నెలకు రూ.59,300 నుంచి రూ.2.28 లక్షల వరకు వేతనం తీసుకునే ఉద్యోగులు, ఉన్నతాధికారుల, డైరెక్టర్లు, కమిషనర్లు మాత్రం విధిగా ప్రతి రోజూ విధులకు హాజరుకావాల్సిందేనని ప్రభుత్వ కొత్తగా జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వుల మేరకు అన్ని శాఖల్లో పనిచేసే ఉన్నతాధికారులు విధులకు హాజరయ్యారు. 


మధ్యాహ్నానికే మద్యం షాపులు క్లోజ్‌

కరోనా వైరస్‌ కష్టాల్లోనూ పూర్తిస్థాయిలో నడిచిన మద్యం దుకాణాలకు కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సాధారణంగా మధ్యాహ్నం 12 గంటల రాత్రి 9 గంటల వరకు తెరిచివుంచేవారు. కానీ, కొత్త ఆంక్షల మేరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం నాలుగు గంటలు మాత్రమే తెరిచివుంచారు. దీంతో నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాల్లో మందుబాబుల రద్దీ అధికంగా కనిపించింది. ముఖ్యంగా రాత్రిపూట మద్యం సేవించే అలవాటు ఉండేవారు మద్యంషాపులకు క్యూకట్టడంతో అనేక షాపుల్లో తీవ్రమైన రద్దీ నెలకొంది. 

Updated Date - 2021-05-07T12:47:36+05:30 IST