కొత్త అద్దె చట్టం.. ముసాయిదా సిద్ధం

ABN , First Publish Date - 2020-10-14T07:16:00+05:30 IST

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న అద్దె చట్టం-2020 ముసాయిదా సిద్ధమైంది.

కొత్త అద్దె చట్టం.. ముసాయిదా సిద్ధం

నెలాఖరు వరకూ అభిప్రాయాల సేకరణ

వివాదాల పరిష్కారానికి ట్రైబ్యునళ్లు


హైదరాబాద్‌, అక్టోబరు 13(ఆంధ్రజోతి): కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న అద్దె చట్టం-2020 ముసాయిదా సిద్ధమైంది. దీనిపై అభిప్రాయాలను, సలహాలను అక్టోబరు 31లోగా తెలియజేయాలని ప్రజలను కోరింది.  ముసాయిదాను అన్ని రాష్ట్రాలకూ పంపింది.  దీనికి అనుగుణంగా రాష్ట్ర మునిపల్‌ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 15రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలని సూచించింది. యజమాని, అద్దెకున్నవాళ్ల.. ఇరువురి ప్రయోజనాలను, హక్కులకూ సమ ప్రాధాన్యమిస్తూ ఈ ముసాయిదా తయారు చేశామని కేంద్రం పేర్కొంది. విద్య, ఉపాధి, వ్యాపారం, ఆరోగ్య సంరక్షణ వంటి కారణాలతో పట్టణ ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నట్లు గుర్తించామని తెలిపింది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలులో ఉన్న అద్దె చట్టాలతో.. గృహ సముదాయం, నాణ్యత, పరిమాణం ఆధారంగా అద్దె నిర్ణయం జరుగుతోందని, ఈ కారణంగా గృహ యజమానులు నిరుత్సాహపడుతున్నారని కేంద్రం పేర్కొంది. ఒక్కోసారి సౌకర్యాలలేమి కూడా ఉంటోందని తెలిపింది.   


ముసాయిదాలోని ముఖ్యాంశాలివే..

దేశంలోని అన్ని ప్రాంతాల్లో.. పరస్పర రాతపూర్వక అంగీకార ఒప్పందాల ద్వారా అద్దెకు ఇవ్వడం/ తీసుకోవడం, అద్దె నిర్ణయం. 


వివాదాల పరిష్కారం కోసం ఫాస్ట్‌ ట్రాక్‌ క్వాసీ-జ్యుడిషియల్‌ మెకానిజం ఏర్పాటు. 


నివాస ప్రాంతాలకు భద్రతా డిపాజిట్‌ రెండు నెలలకు మించరాదు. నివాసేతర అద్దె ప్రాంగణాలకు గరిష్ఠంగా ఆరు నెలలు. 


పలు డిఫాల్ట్‌ నిబంధనలు కూడా చట్టంలో ఉంటాయి. ఉదాహరణకు అద్దె చె ల్లింపులో విఫలమైతే.. తదుపరి వడ్డీతో సహా చెల్లింపులు, ఒప్పందం ప్రకారం ఖాళీ చేయడంలో విఫలమైతే... మొదటి రెండు నెలల అద్దె రెట్టింపు, తదుపరి ప్రతి నెలా నాలుగు రెట్లు చెల్లించడం వంటి నిబంధనలు ఉంటాయి. 


జిల్లా స్థాయిలో ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేసి జిల్లా న్యాయమూర్తి లేదా అదనపు జిల్లా న్యాయమూర్తిని నియమిస్తారు. అప్పీలు వెసులుబాటు ఉంటుంది.

Updated Date - 2020-10-14T07:16:00+05:30 IST