Hyderabad లో కురిసిన అకాల వర్షంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయ్.. నరకం..!

ABN , First Publish Date - 2022-05-06T15:32:28+05:30 IST

Hyderabad లో కురిసిన అకాల వర్షంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయ్.. నరకం..!

Hyderabad లో కురిసిన అకాల వర్షంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయ్.. నరకం..!

  • అధికారుల అనాలోచిత నిర్ణయాలు
  • పెరుగుతున్న నీటి నిల్వ ప్రాంతాలు 
  • కుంభవృష్టితో వెలుగులోకి మరిన్ని సమస్యలు
  • కొత్త ప్రాంతాల్లో భారీగా వరద నీరు

‘‘రోడ్లపై వరద నీరు నిలిచే ప్రాంతాల్లో సమస్య పరిష్కరిస్తున్నాం. ఇప్పటికే చాలా చోట్ల పూర్తి చేశాం’’.. ఇవీ జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ అధికారుల ప్రకటనలు. ఇప్పటికే సమస్యను గుర్తించిన ప్రాంతాల్లో పరిష్కారం దేవుడెరుగు.. అనాలోచిత నిర్ణయాల కారణంగా కొత్త ప్రాంతాల్లో సమస్యలు పుట్టుకొస్తున్నాయి. నీరు నిలిచే ప్రదేశాలు పెరుగుతున్నాయి. బుధవారం కురిసిన కుంభవృష్టి వానతో ఇవి వెలుగులోకి వచ్చాయి. సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులే ప్రణాళికా లోపంతో కొత్త వాటిని సృష్టిస్తున్నారని బాధిత ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


హైదరాబాద్‌ సిటీ : అకాలవర్షం హైదరాబాద్‌లో వరద ప్రవాహ వ్యవస్థ డొల్ల తనాన్ని మరోసారి ఎత్తి చూపింది. నగరవాసి బుధవారం నరకం చూశాడు. ఉదయం వర్షం కురవడం.. ట్రాఫిక్‌ రద్దీ తక్కువగా ఉండడంతో వరద నీరు త్వరగా వెళ్లే అవకాశం కలిగింది. అయినా పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 20 నుంచి 30 నిమిషాలపాటు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. బుధవారం కురిసిన వర్షంతో కొత్తగా నీటి నిల్వలు నిలిచిపోయిన ప్రాంతాలు వెలుగులోకి వచ్చాయి. వాటర్‌ లాగింగ్‌ ఇబ్బందులు తొలగిన ఏరియాలతో పోలిస్తే కొత్తగా సమస్య ఏర్పడుతోన్న ప్రాంతాలే ఎక్కువగా ఉండడం గమనార్హం.


జలమయమయ్యే ప్రాంతాలు 150కి పైగా..

గ్రేటర్‌లో 9,103 కి.మీల మేర రహదారులున్నాయి. వరద నీటి ప్రవాహ వ్యవస్థ 1,300 కి.మీలలోపే ఉంది.  దీంతో వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. ట్రాఫిక్‌ పోలీసుల నివేదిక ప్రకారం గతంలో 230కిపైగా రోడ్లపై వరద నీరు నిలిచే ప్రాంతాలుండేవి. పలు ప్రాంతాల్లో డ్రైన్‌లు నిర్మించి, పైపులైన్లు వేసి సమీపంలోని నాలాలు, చెరువుల్లోకి వర్షపు నీరు వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికీ వర్షం పడితే రోడ్లు జలమయమయ్యే ఏరియాలు 150కి పైగా ఉన్నాయని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. నీరు నిలిచే ప్రాంతాలను కేటగిరీలుగా విభజించి వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు పరిష్కార మార్గాలు వెతుకుతున్నట్టు పేర్కొన్నారు. అయినా మెజార్టీ ఏరియాల్లో పూర్తిస్థాయిలో పరిష్కారం లభించలేదు. 


గతంలో లేని విధంగా..

ప్రభుత్వ విభాగాల అనాలోచిత నిర్ణయాలతో నగరంలో వరద నీరు నిలిచే ప్రాంతాలు పెరుగుతున్నాయి. జంక్షన్ల మూసివేత, ప్రీ కాస్ట్‌ డివైడర్ల ఏర్పాటు, మెట్రో కారిడార్లలో డివైడర్ల నిర్మాణంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా పలు ఏరియాల్లో వరద నీరు నిలుస్తోంది. నగరంలోని ప్రధాన మార్గాలతోపాటు అంతర్గత రోడ్లలో గతంలో డివైడర్లు నిర్మించే వారు. మూడు నుంచి ఐదు అడుగుల పొడవు, ఒకటి నుంచి ఒకటిన్నర అడుగు ఎత్తులో ఉండే డివైడర్ల మధ్య ఖాళీ ఉండేది. వర్షం పడితే.. ఆ గ్యాప్‌ల నుంచి పల్లం వైపు నీటి ప్రవాహం సాగేది. వాహనదారుల భద్రత పేరిట కొన్నాళ్లుగా దాదాపు రెండున్నర మీటర్ల మేర ఎత్తుండే ప్రీ కాస్ట్‌ డివైడర్లు ఏర్పాటు చేస్తున్నారు. 


ఖాళీ లేకుండా వాటిని ఏర్పాటు చేస్తుండడంతో నీటి ప్రవాహానికి అవరోధంగా మారుతోంది. దీంతో రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్‌ ప్రధాన రహదారి, యూసు్‌ఫగూడ స్టేడియం, రహ్మత్‌నగర్‌-బోరబండ మార్గం, రామంతాపూర్‌ మోడ్రన్‌ బేకరీ, కేఎ్‌ఫసీ జంక్షన్‌, హైదర్‌గూడ, హబ్సిగూడ, గుడిమల్కాపూర్‌, మెహిదీపట్నం, శిల్పారామం, రాజ్‌భవన్‌లోని విల్లామేరీ కాలేజ్‌, షేక్‌పేట ఆదిత్య టవర్స్‌, హఫీజ్‌పేట-కొండాపూర్‌ మార్గం తదితర ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలుస్తోంది.


రాజాసింగ్‌-కాలేరు సంవాదం

నగరం మునకపై టీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ట్విటర్‌లో సంవాదం నడిచింది. బుధవారం కురిసిన భారీ వర్షానికి గోషామహల్‌లోని బేగంబజార్‌, గౌలిగూడ గురుద్వార్‌, ఉస్మాన్‌సాగర్‌గంజ్‌ పరిధిలో ముంపు ప్రాంతాలను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌.. గంటన్నరపాటు కురిసిన వర్షానికి నగర పరిస్థితి కళ్లకు కట్టింది. ట్విటర్‌లో గొప్పలు చెప్పుకోవడం కాదు.. క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.


దీనిపై స్పందించిన అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌.. గుజరాత్‌లో నగరాల్లో వర్షం కురిసినప్పుడు పరిస్థితి చూడండి.. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటకలోని నగరాల్లో ఇవీ పరిస్థితులంటూ.. ఫొటోలు పోస్ట్‌చేసి ట్రబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అని పేర్కొన్నారు. వీరి ట్వీట్లపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పక్క నగరాల విషయం ప్రస్తావించడం కాదు.. మన సిటీలో ఎంతమేర అభివృద్ధి చేశామన్నది ప్రధానమని ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు. రాష్ట్ర విపత్తు నిర్వహణ కింద తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో చెప్పాలని మరో నెటిజన్‌ స్పందించారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎక్కడైనా ఇదే జరుగుతోందని మరొకరు అభిప్రాయపడ్డారు.


Read more