కరోనా: కీలక దశ వేళ.. మరో కొత్త సమస్య..!?

ABN , First Publish Date - 2020-04-08T21:52:22+05:30 IST

విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా కరోనా వ్యాప్తి దాదాపుగా ఆగిపోయింది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో చాలా మందికి పరీక్షలు పూర్తయ్యాయి. వీరిలో పలువురికి నెగిటివ్‌ వచ్చింది. కేవలం 40 మందికే పాజిటివ్‌ వచ్చింది. వీరంతా జీజీహెచ్‌ ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒక్కరు మినహా మిగిలిన వారంతా కోలుకొంటున్నారు.

కరోనా: కీలక దశ వేళ.. మరో కొత్త సమస్య..!?

వాతావరణం.. ఆందోళనకరం... వర్షాలు కురిస్తే వైరస్‌ విజృంభించే ప్రమాదం

క్వారంటైన్లలో 425 మంది.. ఇప్పటికే 398 మందికి పరీక్షలు 

వారిలో పాజిటివ్‌ 42.. నెగిటివ్‌ 292

ఫలితాలు రావాల్సింది 163 

పూర్తి కావస్తున్న అనుమానితుల శ్యాంపిల్స్‌

ఢిల్లీ ట్రిప్‌ పూర్తయి నేటికి 20 రోజులు 

ఈ దశలో క్లైమెట్‌ చేంజ్‌ ఆందోళనకరం

మరింత అప్రమత్తత ఒక్కటే సరైన మార్గం

 

నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా కరోనా వ్యాప్తి దాదాపుగా ఆగిపోయింది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో చాలా మందికి పరీక్షలు పూర్తయ్యాయి. వీరిలో పలువురికి నెగిటివ్‌ వచ్చింది. కేవలం 40 మందికే పాజిటివ్‌ వచ్చింది. వీరంతా జీజీహెచ్‌ ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒక్కరు మినహా మిగిలిన వారంతా కోలుకొంటున్నారు. ఇంకో 163 శ్యాంపిల్స్‌ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇవి వస్తే ఇప్పటి వరకు దాదాపుగా అనుమానిత కేసులన్నింటిని పరీక్షించినట్లే. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న అత్యధిక శాతం మందిలో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. దాదాపుగా జిల్లాలో కరోనాను అన్ని వైపుల నుంచి కట్టడి చేసే ప్రక్రియ పూర్తి కావచ్చింది. ఈ దశలో మారుతున్న వాతావరణం వైద్యాధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడటం, రెండు రోజుల పాటు వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలుపడంతో అధికారుల్లో తెలియని గుబులు మొదలయ్యింది. ప్రజలు మరింత అప్రతమత్తంగా ఉండాల్సిన అవసరం పెరిగింది.


ఎండలు కాపాడాయి..

జిల్లాలో కరోనా కేసులు ప్రారంభమైన రోజు నుంచి ఉష్ణోగ్రత పెరుగుతూ వచ్చింది. పది రోజులుగా సగటు ఉష్ణోగ్రత 37 నుంచి 38 డిగ్రీల వరకు నమోదయ్యింది. ఈ పెరిగిన ఎండలే జిల్లాలో వైరస్‌ వ్యాప్తిని చాలా వరకు నియంత్రించాయని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఆరు రోజుల వ్యవధిలో జిల్లాలో 41 పాజిటివ్‌ కేసులు నమోదైనా, వ్యాధి వ్యాప్తికి మూలమైన ఢిల్లీకి జిల్లా నుంచి వందల సంఖ్యలో ప్రజలు వెళ్లి వచ్చిన వైరస్‌ వ్యాప్తి ఒకరి నుంచి మరొకరికి వేగంగా జరగకపోవడానికి కారణం ఎండలే...అని వైద్యులు గట్టిగా నమ్ముతున్నారు. ఢిల్లీకి వెళ్లివచ్చిన వారిలో 28 మందికి కరోనా పాజిటవ్‌ రాగా, వారి ద్వారా వారి కుటుంబ సభ్యులు 12 మందికి ఈ వ్యాధి సోకింది.  వాస్తవానికి ఈ వైరస్‌ వ్యాప్తి శరవేగంగా జరుగుతుంది. అందుకే ప్రపంచం మొత్తం వణికిపోతోంది. కాని జిల్లాలో (ఇప్పటికి) 12మందికి మాత్రమే కాంటాక్ట్‌ ద్వారా కరోనా సోకింది. పెరిగిన ఎండల కారణంగానే వైరస్‌ వ్యాప్తి ఇంత తక్కువగా జరిగిందని వైద్యశాఖ భావిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఒకటి రెండు రోజుల్లో 40 డిగ్రీలకు చేరుకుంటాయని, దీంతో జిల్లాలో ఈ వైరస్‌పీడ విరగడైపోతుందని ఆశిస్తున్న తరుణంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఆందోళన కలిగిస్తోంది. ఉపరితలం ఆవర్తనం వల్ల రెండు రోజుల పాటు జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఆందోళన మరింత అధికమయ్యింది. 


ఎలాంటి ప్రభావం చూపుతుందో ?

మంగళవారం నెల్లూరులో జరిగిన సమావేశంలో  మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌(డీఎంఈ) ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ వర్ష్ష సూచనలు, చల్లబడిన వాతావరణం ఏ పరిణామాలకు దారితీస్తుందో అని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. మారుతున్న వాతావరణం ఎంత ప్రమాదంగా మారబోతోందో తెలియజేయడానికి ఈ వ్యాఖ్యలు ఒక ఉదాహరణ మాత్రమే. జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 42కు పెరిగినా పరిస్థితి మాత్రం అదుపులో ఉందనే చెప్పాలి. దీనికి అధికారుల కష్టం, ప్రజల క్రమశిక్షణలే కారణం. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిని వెంటవెంటనే గుర్తించి క్వారంటైన్లకు తరలించడం, వారు ఎవరితో కాంటాక్టులోకి వెళ్లారో వారిని సైతం క్వారంటైన్లకు పంపడం, పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించి ఆ ప్రాంత ప్రజలను బయట తిరగనివ్వకుండా కట్టడి చేయడం, యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం..మెజారిటీ ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం..వీటికి తోడు వాతావరణం సహకరించడంతో వైరస్‌ వ్యాప్తి వేగాన్ని గణనీయంగా కట్టడి చేయగలిగారు.


ఇది కీలక దశ

ఇప్పటి వరకు 335 శ్యాంపిల్స్‌ ఫలితాలు రాగా వాటిలో 43 పాజిటివ్‌ వచ్చాయి. అంటే ల్యాబ్‌కు పంపిన స్వాబ్‌లో సగటున 15 శాతం మందికి కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది.  అయితే ఇంకా 168 శ్యాంపిల్స్‌కు సంబంధించిన స్వాబ్‌ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇదే నిష్పత్తిలో లెక్కిస్తే మరో 25 పాజిటివ్‌ కేసులు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఈ కేసులతో కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తించి వారిని క్వారంటైన్లకు తరలించి వారి స్వాబ్‌లను పరీక్షించాల్సి ఉంది. ఇవి కాక ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో ఇంకా కొంత మంది ట్రేస్‌ అవుట్‌ కాలేదని సమాచారం. వీరిని గుర్తించాలి. వీరు ఎవరెవరితో కాంటాక్ట్‌లోకి వెళ్లారో వాళ్లను గుర్తించి పరీక్షించాలి.


అప్రమత్తత ఒక్కటే శరణ్యం

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పడు పాజిటివ్‌ వచ్చిన వారి వల్ల వైరస్‌ ఎవరికైనా వ్యాపించిందా లేదా..!? అనే విషయం తెలియడానికి మరో వారం  పడుతుంది. ఢిల్లీ కేసుల్లో పాజిటివ్‌ రిపోర్టు రావడానికి 14 నుంచి 20 రోజుల సమయం పట్టింది. వీరందరికి మార్చి 31, ఏప్రిల్‌ 1,2,3 తేదిల్లో ఆసుపత్రులకు తరలించారు. వీరి నుంచి ఎవరికైనా వైరస్‌ సోకి ఉంటే అది బయటపడటానికి మరో 15 రోజులు అంటే ఏప్రిల్‌ 15వ వరకు సమయం పడుతుంది. అంటే ఈ రాబోయే రెండు వారాలు అత్యంత కీలకం. ఈ రెండు వారాల పాటు ప్రజలు ఎక్కడివారు అక్కడ ఆగిపోతే తప్ప వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయలేం. ఇంత కీలక దశలో ఉన్న పళంగా వాతావరణం చల్లబడటం ఆందోళన చెందాల్సిన విషయం. దీన్ని జయించాలంటే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి.

Updated Date - 2020-04-08T21:52:22+05:30 IST