జస్టిస్‌ కనగరాజ్‌కు కొత్త పోస్టు!?

ABN , First Publish Date - 2021-06-20T08:07:06+05:30 IST

గత ఏడాది నాటకీయ పరిణామాల మధ్య రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులై... అంతే నాటకీయంగా ఆ పదవి కోల్పోయిన జస్టిస్‌ కనగరాజ్‌కు కొత్త పోస్టు ఖాయమైనట్లు తెలుస్తోంది

జస్టిస్‌ కనగరాజ్‌కు కొత్త పోస్టు!?

పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ ఏర్పాటు యోచన

దానికి చైర్మన్‌గా జస్టిస్‌ కనగరాజ్‌?

గత ఏడాది ఎస్‌ఈసీగా నియామకం

నాటకీయ పరిణామాలతో నిలవని పదవి

ఇప్పుడు మళ్లీ రిటైర్డ్‌ జడ్జికి సముచిత గౌరవం

పోలీసులపై ఫిర్యాదులను విచారించే పీసీఏ


అమరావతి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది నాటకీయ పరిణామాల మధ్య రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులై... అంతే నాటకీయంగా ఆ పదవి కోల్పోయిన జస్టిస్‌ కనగరాజ్‌కు కొత్త పోస్టు ఖాయమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ‘పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ’ (పీసీఏ)ను ఏర్పాటు చేసి... దానికి ఆయనను సారథిగా నియమించనున్నట్లు సమాచారం! జస్టిస్‌ కనగరాజ్‌ మద్రాస్‌ హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించి రిటైర్‌ అయ్యారు. గత ఏడాది ఎస్‌ఈసీతో ‘లడాయి’కి దిగిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను రాత్రికి రాత్రి పదవి నుంచి తప్పించింది. తెల్లవారే సరికి ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత నిమ్మగడ్డ రమేశ్‌ న్యాయ పోరాటం చేసి... మళ్లీ ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మొత్తం పరిణామాల మధ్య జస్టిస్‌ కనగరాజ్‌ బాధితుడిగా మిగిలారు. ఆయనను నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పదవీ విరమణ తర్వాత తిరిగి ఎస్‌ఈసీగా నియమిస్తారని భావించినప్పటికీ... సాంకేతికంగా అదీ కుదరలేదు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ కనగరాజ్‌కు సముచిత స్థానం కల్పించే అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం అన్వేషణ సాగించినట్లు సమాచారం! సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ‘పోలీస్‌ కంప్లైట్‌ అథారిటీ’ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. దీనికి జస్టిస్‌ కనగరాజ్‌ను అధ్యక్షుడిగా నియమించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 


ఏమిటీ అథారిటీ?

పోలీసుల నుంచి ప్రజలకు న్యాయం జరగక పోయినా, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించకున్నా, సకాలంలో తగిన న్యాయం లభించక పోయినా ప్రజలు పీసీఏను ఆశ్రయించవచ్చు. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రాష్ట్రాలు పీసీఏని ఏర్పాటు చేయాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ అథారిటీలు ఏర్పాటయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఏడాది జనవరిలో పీసీఏను ఏర్పాటు చేసింది. హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని చైర్మన్‌గా పీసీఏను ఏర్పాటు చేయాలి. ఇందులో... ఒక రిటైర్డ్‌ ఐఏఎస్‌, మరో రిటైర్డ్‌ ఐపీఎ్‌సతోపాటు ఏదైనా స్వచ్ఛంద సంస్థ నుంచి ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి సభ్యుడిగా ఉంటారు. తమకు అందే ఫిర్యాదులపై పీసీఏ విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. అయితే... పీసీఏ  సిఫారసులను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరంలేదు.



Updated Date - 2021-06-20T08:07:06+05:30 IST