బందరు పోర్టు నిర్మాణానికి కొత్త ప్రణాళిక
టెండర్ల నిబంధనల్లో సవరణ
మచిలీపట్నం టౌన్, జనవరి 21 : బందరు పోర్టు టెండర్లు రద్దు కాకుండా కొన్ని సవరణలు చేస్తూ కాంట్రాక్టర్లను మళ్లీ పిలిచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. పోర్టుకు ఎవరూ టెండర్లు వేయకపోవడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రస్తుతం ప్రభుత్వ భూమిలోనే పనులు మొదలు పెట్టవచ్చా? అదనంగా మరో 900 ఎకరాలు సేకరించాలా? అనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పోర్టు నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో జరగాలంటే 3,435 ఎకరాలు అవసరమని తేలింది. ప్రభుత్వ భూమి 1,675 ఎకరాలు ఉండగా, అసైన్డ్ భూములు 210 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. గతంలో టీడీపీ హయాంలో కొన్న భూములు 650 ఎకరాలు ఉండగా, రైల్వేలైన్లకు, రోడ్లకు అవసరమైన స్థలం గురించి ఆలోచిస్తున్నారు. పూర్తిస్థాయిలో వనరులు సమకూర్చేందుకు దాదాపు 900 ఎకరాలు అవసరమని తేలింది. ఇందుకుగాను మేకావారిపాలెం శివారు మచిలీపట్నం వెస్ట్‌లోని భూములు, పోతే పల్లిలోని భూములు 400 ఎకరాలు కొనుగోలు చేయాలని యోచిస్తున్నారు. మచిలీపట్నం వెస్ట్‌లోని భూములకు రూ.40 లక్షల వరకు వెచ్చించే అవకాశముంది. అయితే పోతేపల్లిలోని భూములకు ఆ మేరకు చెల్లించేందుకు అవకాశాలు లేవని భావిస్తున్నారు. కాగా ముడా పరిధిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. బందరు పోర్టు ముడాతో ముడిపడి ఉండటంతో సరికొత్త డీపీఆర్‌ను రూపొందిస్తున్నారు. పోర్టుకు కావలసిన భూములు కొనుగోలు చేసేందుకు రైతులతో సంప్రదింపులు జరిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిపై ముడా వీసీ బి.ఎస్.ఎన్.రెడ్డిని వివరణ కోరగా, రాష్ట్ర మంత్రి పేర్ని నాని, ముడా చైర్మన్ బొర్రా నాగ వెంకట దుర్గా భవానీతో చర్చించిన అనంతరం ముడాకు కొత్త డీపీఆర్‌ను రూపొందిస్తామని చెప్పారు. ముడా ఆధ్వర్యంలో కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.