ఇంకా అందలే..!

ABN , First Publish Date - 2022-07-03T05:22:40+05:30 IST

పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎదురు చూపులే మిగులుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈనెలలో కూడా కొత్త పింఛన్లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు.

ఇంకా అందలే..!

  ఈ నెలలో  పంపిణీ కాని కొత్త పింఛన్లు

   జిల్లాలో 8714 మంది ఎదురు చూపు

( పార్వతీపురం - ఆంధ్రజ్యోతి )

పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎదురు చూపులే మిగులుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈనెలలో కూడా కొత్త పింఛన్లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు. వాస్తవంగా కొత్త పింఛన్లను జూన్‌లో మంజూరు చేసి జూలైలో పంపిణీ చేయాల్సి ఉంది. అయితే  ఇప్పటివరకూ వాటి ఊసే కాలేదు. దీంతో అర్హులు వాటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత టీడీపీ  ప్రభుత్వ హయాంలో ఏ నెలకు ఆ నెల కొత్తగా సామాజిక పింఛన్లు మంజూరు చేసి లబ్ధిదారులకు అందించే వారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. అర్హులందరికీ పింఛన్లు మంజూరు అని చెబుతూ కాలయాపన చేస్తోంది.  పలు రకాల నిబంధనలతో  కొంతమందికే వాటిని అందిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా జిల్లాలోని 15 మండలాల్లో కొత్త పింఛన్ల కోసం వేలాది దరఖాస్తులు వెళ్లాయి. సచివాలయాల పరిధిలో అనేక దరఖాస్తులు తిరస్కరించారు. చివరిగా ఎంపీడీవో లాగిన్‌లోకి 8,791 దరఖాస్తులు వెళ్లాయి. ఇందులో 77 మందికి మినహా మిగిలిన వారికి పింఛన్లు మంజూరుకు మండలాల నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. వీరందరికీ ఈ నెలలో పింఛన్లు పంపిణీ చేస్తారని ఆశించినప్పటికీ ఇప్పటివరకూ ఆ ప్రక్రియ చేపట్టలేదు. కొత్త పింఛన్లను ప్రత్యేకంగా ఇచ్చి గొప్పలు చెప్పుకునేందుకు ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కానీ ఈ నెలలోనైనా ఇస్తారా? లేదా ఆగస్టులో అందిస్తారా తెలియని పరిస్థితి కనిపిస్తోంది.  దీనిపై వెలుగు ఏపీడీ సత్యంనాయుడును వివరణ కోరగా  కొత్త పింఛన్లు త్వరలోనే పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. 

 

Updated Date - 2022-07-03T05:22:40+05:30 IST