పింఛన్‌..బాంచెన్‌

ABN , First Publish Date - 2022-05-26T05:46:48+05:30 IST

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్‌ రాక వృద్ధులు, వితంతువులు ఒంటరి మహిళలు, బీడీ, గీత, నేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు

పింఛన్‌..బాంచెన్‌
పింఛను ఇప్పించాలని కోహెడ మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట దీక్ష చేస్తున్న వృద్ధులు

 ‘ఆసరా’ అందక వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఇబ్బందులు

 కొత్త పింఛన్లు మంజూరుకాని వైనం


కోహెడ, మే 25: ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్‌ రాక వృద్ధులు, వితంతువులు ఒంటరి మహిళలు, బీడీ, గీత, నేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జరిగిన దుబ్బాక ఎన్నికల సందర్భంగా కొంతమందికి కొత్త పింఛన్లు మంజూరు చేశారు. కానీ సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరును నిలిపివేసింది. అర్హత కలిగి ఆసరా కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం మొండి చేయి చూపుతోంది. అలాగే వృద్ధాప్యంలో ఉన్న భార్యాభర్తల్లో ఒకరు చనిపోతే మరొకరికి ఇవ్వాల్సిన పెన్షన్‌ కూడా రావడం లేదు. 


రిజిస్ట్రేషన్‌ చేసుకున్నామా లేదా?


57 ఏళ్లు నిండిన వారితో పాటు, ఆసరా పింఛనుకు అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోహెడ మండలంలో మండలంలో  344 మంది దరఖాస్తు చేసుకుని ఏడు నెలలు గడుస్తున్నా మంజూరు కాలేదు. అంతేకాకుండా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు రిజిస్ట్రేషన్‌ వివరాలు జిల్లా కేంద్ర కార్యాలయంలో తప్ప మండల కార్యాలయంలో లేవు. దీంతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు తమ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయో లేదో అని ఆందోళన చెందుతున్నారు.


ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు


గ్రామాల్లో అర్హులైన వారు దరఖాస్తులు పట్టుకొని స్థానిక ప్రజాప్రతినిధుల (సర్పంచ్‌, ఎంపీటీసీ) ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసులు వారి వద్ద దరఖాస్తులు తీసుకొని మండల పరిషత్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెప్తుండడంతో ప్రజాప్రతినిధులు ఏమీ చేయలేకపోతున్నారు. 

Updated Date - 2022-05-26T05:46:48+05:30 IST