వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈడబ్ల్యూఎస్ కోటా కొత్త నిబంధనలు : కేంద్రం

ABN , First Publish Date - 2022-01-02T20:52:13+05:30 IST

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్)కు చెందినవారిని

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈడబ్ల్యూఎస్ కోటా కొత్త నిబంధనలు : కేంద్రం

న్యూఢిల్లీ : ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్)కు చెందినవారిని దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంపిక చేసేందుకు ప్రస్తుత విధానాన్ని ఈ సంవత్సరం కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) విద్యార్థులకు ప్రవేశాలు, కళాశాలల కేటాయింపు ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోందని, ఈ సమయంలో నిబంధనలను మార్చడం వల్ల చిక్కు సమస్యలు ఎదురవుతాయని చెప్పింది. సవరించిన ఈడబ్ల్యూఎస్ నిబంధనలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయవచ్చునని పేర్కొంది. శుక్రవారం సమర్పించిన ఈ అఫిడవిట్ వివరాలు ఆదివారం వెలుగులోకి వచ్చాయి. 


సవరించిన ఈడబ్ల్యూఎస్ నిబంధనల ప్రకారం వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలుగా కొనసాగుతుంది. అయితే, ఐదు ఎకరాలు లేదా అంతకన్నా ఎక్కువ భూమిగల కుటుంబాలకు వార్షికాదాయంతో సంబంధం లేకుండా మినహాయింపు ఇచ్చారు. 


సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు)లో ‘క్రీమీ లేయర్’ను నిర్ణయించడానికి కూడా ఇదే ప్రమాణాన్ని అనుసరిస్తున్నారని, ఈడబ్ల్యూఎస్ కోటా కోసం రూ.8 లక్షలు సంవత్సర ఆదాయంగా ఎందుకు నిర్ణయించారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 


నవంబరులో జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ఆదాయ పరిమితిపై ప్రస్తుత విధానాన్ని సమీక్షిస్తామని, నాలుగు వారాల్లోగా ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భారత రాజ్యాంగంలోని అధికరణలు 14, 15, 16లకు అనుగుణంగానే వార్షికాదాయం పరిమితిని రూ.8 లక్షలుగా నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. 


ఈ వాదనలతో జస్టిస్ డీవై చంద్రచూడ్ ఏకీభవించలేదు. ప్రభుత్వం వద్ద జనాభా సంబంధిత లేదా సాంఘిక-ఆర్థిక సంబంధిత సమాచారం ఉండాలన్నారు. ఏ ఆధారం లేకుండా గాలిలో నుంచి ఓ అంకెను తీసి చెప్పకూడదన్నారు. 


Updated Date - 2022-01-02T20:52:13+05:30 IST