గిండిలో కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

ABN , First Publish Date - 2022-03-22T16:57:04+05:30 IST

స్థానిక గిండి కింగ్‌ఇన్‌స్టిట్యూట్‌ సమీపంలో రూ.230 కోట్ల నిధులతో 1000 పడకల సదుపాయంతో నిర్మించనున్న ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సోమవారం ఉదయం ముఖ్యమంత్రి ఎంకే..

గిండిలో  కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

చెన్నై, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): స్థానిక గిండి కింగ్‌ఇన్‌స్టిట్యూట్‌ సమీపంలో రూ.230 కోట్ల నిధులతో 1000 పడకల సదుపాయంతో నిర్మించనున్న ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సోమవారం ఉదయం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శంకుస్థాపన చేశారు. గతేడాది జూన్‌ 3వ తేదీన దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి వేడుకల సందర్భంగా గిండిలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు గిండి కింగ్‌ఇన్‌స్టిట్యూట్‌ సమీపంలో ఎంపిక చేసిన సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఈ ఆసుపత్రిని 51,429 చదరపుటడుగుల విస్తీర్ణంలో ఆరంతస్తులతో కూడిన భవసముదాయాన్ని నిర్మించనున్నట్లు స్టాలిన్‌ తెలిపారు.


ఈ ఆసుపత్రిలో అన్ని రోగాలకు అంతర్జాతీయ స్థాయి చికిత్సలందించటానికి వీలుగా వివిధ విభాగాలను కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. హృద్రోగ శస్తృచికిత్సలు, మూత్రాశయ మార్పిడి శస్త్రచికిత్సలు, క్యాన్సర్‌ చికిత్సలకు కావలసిన కొత్త సాంకేతిక వైద్య పరికరాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి వీలయినంత త్వరగా నిర్మించమని సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలిచ్చానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఏవీ వేలు, ఎం. సుబ్రమణ్యం శాసనసభ్యులు కె.గణపతి, ఏఎంవీ ప్రభాకర్‌రాజా, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ఆర్‌. ప్రియా, డిప్యూటీ మేయర్‌ ఎం. మహే్‌షకుమార్‌, ప్రజాపనుల శాఖ అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దయానంద్‌ కఠారియా, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధాకృష్ణన్‌, ప్రజారోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పి.సెంథిల్‌కుమార్‌, వైద్యవిద్యా మండలి సంచాలకులు డాక్టర్‌ ఆర్‌ నారాయణబాబు, కార్పొరేషన్‌ కౌన్సిలర్లు కృష్ణమూర్తి, దురైరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-22T16:57:04+05:30 IST