Abn logo
Sep 23 2021 @ 01:43AM

కొత్త మండలాధీశులు వచ్చేస్తున్నారు..!

రేపే 53 మండలాలకు ఎంపీపీల ఎన్నిక

అదేరోజు కీలకమైన కోఆప్షన్‌ సభ్యులు,  ఉపాధ్యక్షుల నియామకం

ప్రిసైడింగ్‌ అధికారులదే నిర్వహణ బాధ్యత

ఒంగోలు(జడ్పీ), సెప్టెంబరు 22: దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మండల పరిషత్‌లకు కొత్త పాలకవర్గాలు రాబోతున్నాయి. జిల్లావ్యాప్తంగా 53 మండలాలకు శుక్రవారం కొత్త అధ్యక్షులు కొలువుదీరబోతున్నారు. వీరితోపాటు ఉపాధ్యక్షులు, మండలానికి ఒక కో-ఆప్షన్‌ సభ్యుడిని కూడా ఎన్నుకోనున్నారు. ఆయా మండలాల ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మొత్తం సభ్యుల్లో 50శాతం మంది హాజరైతేనే కోరం ఉన్నట్లవుతుందని, లేనిచోట ఎన్నికను 25కు వాయిదా వేస్తామని యంత్రాంగం చెబుతోంది. కోఆప్షన్‌ సభ్యులతోపాటు ఎంపీపీ, ఉపాధ్యక్షులను సైతం చేతులెత్తే విధానం ద్వారానే ఎన్నుకోనున్నారు. ఇందుకు సంబంధించిన నియమావళి పట్ల ఆయా ఎంపీటీసీలకు, సిబ్బందికి ఇప్పటికే మండల కేంద్రాల్లో అవగాహన కల్పించారు.


ఎంపీపీ అను నేను.. 53 మండలాలకు...

జిల్లాలో మొత్తం 56 మండలాలు ఉండగా 53కు మాత్రమే ఎన్నిక జరగనుంది. పొదిలి మండలం నగరపంచాయతీగా అప్‌గ్రేడ్‌ అయిన నేపథ్యంలో అక్కడ ఎన్నిక నిలిచిపోయింది. చీరాల, వేటపాలెం మండలాలకు కోర్టు వ్యాజ్యాలతో ఎన్నికలు జరగలేదు.