కొత్త కొత్తగా ఉన్నది.. ‘కరోనా’ లాక్‌డౌన్‌ వేళ తెరపైకి నయా జీవనశైలి

ABN , First Publish Date - 2020-04-05T18:00:44+05:30 IST

రోనా నివారణ కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో ప్రజల జీవన శైలిలో ఊహించని మార్పులు కనిపిస్తు న్నాయి. సమాజానికి ఇది కొత్త అనుభవం. శాస్త్ర, సాంకేతికరంగాలు ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో భార్యాపిల్లలతో కాస్త హాయిగా గడిపే టైం కూడా దొరికేది కాదు.

కొత్త కొత్తగా ఉన్నది.. ‘కరోనా’ లాక్‌డౌన్‌ వేళ తెరపైకి నయా జీవనశైలి

రోజుల తరబడి ఇళ్లల్లోనే స్వీయ నిర్బంధంలో జనం

కాలక్షేపం కోసం కొత్తదారుల వెతుకులాట

పురి విప్పుతున్న హాబీలు, సృజనాత్మకత

బలపడుతున్న రక్త సంబంధాలు

పరిమళిస్తున్న ప్రేమానురాగాలు

ఇండోర్‌ గేమ్స్‌కు, సంప్రదాయ ఆటలకు పెరిగిన ఆదరణ

కుటుంబసభ్యులందరూ ఒకేచోట ఉండటంతో ఇళ్లల్లో కొత్త కళ

కాలాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు

‘కరోనా’ ఎన్నో నేర్పుతోందంటున్న సామాజిక పరిశీలకులు

‘కరోనా’ లాక్‌డౌన్‌ వేళ తెరపైకి నయా జీవనశైలి


హన్మకొండ, వరంగల్ (ఆంధ్రజ్యోతి): కరోనా నివారణ కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో ప్రజల జీవన శైలిలో ఊహించని మార్పులు కనిపిస్తు న్నాయి. సమాజానికి ఇది కొత్త అనుభవం. శాస్త్ర, సాంకేతికరంగాలు ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో భార్యాపిల్లలతో కాస్త హాయిగా గడిపే టైం కూడా దొరికేది కాదు. అయితే  లాక్‌డౌన్‌ కొత్త జీవన పాఠాలను నేర్పుతోంది. ఇంతకు ముందు రుచిచూడని జీవన మాధుర్యాన్ని పంచుతోంది. కొత్త జీవన సత్యాలను ఆవిష్కరిస్తోంది. జీవితంలో ఇన్నాళ్ళు పోగొట్టుకున్న అనుభూతులను తిరిగి అందిస్తోంది. కుటుంబ సంబంధాలను పటిష్టం చేస్తోంది. అనుబంధాలను కొత్తగా అనుభవంలోకి తెస్తోంది. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, సోదరులు, తోబుట్టువులు, బంధువు లు ఇలా అందరి మధ్య ఆప్యాయ తను పెంచుతోంది. లాక్‌డౌన్‌ అంటే గృహనిర్బంధమే అయినా ఇప్పుడు మాత్రం అందరూ ఆహా గృహమే కదా స్వర్గసీమ అంటున్నారు.


హాబీలకు కొత్త ఊపిరులు..

లాక్‌డౌన్‌ అంటే స్వీయ గృహ నిర్బంధం. అత్యవసర పనులకు మాత్రమే బయటకు వచ్చే వెసులుబాటు ఉంటుంది. కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఉండాలంటే ఇది అత్యవసరం. ఈ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకున్న వారు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. మొదట్లో కొందరు ఏదో టైమ్‌పాస్‌ కోసం బయట అడుగుపెట్టగా  వీపు విమానం మోత మోగింది. దీంతో అనేక మంది తప్పనిసరిగా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ క్రమంలో తమ అలవాట్లు, హాబీలకు పదునుపెడుతున్నారు. ఇంట్లో ఉంటూ ఏమీ తోచకపోవడంతో ర్యాకుల్లోని పుస్తకాల బూజు దులిపి పేజీలు తిరగేస్తున్నారు. మూలనపడేసిన ప్యాడ్‌స్టాండ్స్‌, కలర్స్‌ బయటికి తీసి బొమ్మలేస్తున్నారు. స్వయంగా చిత్రకారుడు అయిన వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ ఇంట్లో బొమ్మలు వేస్తున్న దృశ్యం వ్యాట్సా్‌పలో వైరల్‌ అవుతోంది. మరికొందరు ఇష్టపడి కొన్న సీడీలను తెరిచి సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు. మరిచిపోయిన పాతమిత్రులను గుర్తుచేసుకొని ఫోన్లు చేసి మరీ పలకరిస్తున్నారు. ఇన్నాళ్ళు అట్టపెట్టెల అడుగున పడి ఉన్న ఫోటో ఆల్బమ్‌లను తెరిచి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఎప్పుడో పాఠశాలకు వెళ్ళే రోజుల్లో తీయించుకున్న గ్రూప్‌ ఫోటోలో తనెక్కడున్నాడో వెతుక్కుంటున్నారు. తోటి విద్యార్థులను గుర్తుపట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వృద్ధులైన అమ్మానాన్నలతో కాసేపు మనుసు విప్పి మాట్లాడుతున్నారు.భార్యా పిల్లలతో కాలక్షేపం చేస్తున్నారు. మొత్తంగా లాక్‌డౌన్‌ మనిషిని కుటుంబంతో లాక్‌చేసింది.


ఇంటి నుంచే విధులు..

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇళ్ళ నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఉద్యోగుల్లో 90 శాతం మంది ఇలాగే చేస్తున్నారు. ఇది ఒక రకంగా వారికి మంచిదే అయింది. ఇన్నాళ్ళు తమ పని తీరు, స్వభావం, ఎదుర్కొంటున్న ఒత్తిళ్ళ గురించి ఇంట్లోౄవారికి తెలియదు.  ఉద్యోగులు చేస్తున్న పనులేమిటో, ఆవి ఎంత సంక్షిష్టంగా ఉంటాయో, ఒక్కోసారి ఎంత ఒత్తిడికి గురి చేస్తాయో, కదలకుండా గంటల తరబడి ఎలా చేస్తున్నారో కుటుంబంలోని సభ్యులకు ఇపుడు తెలిసి వస్తోంది. 


చెరుచుకుంటున్న పుస్తకాలు..

పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు తమ ఇళ్ళలో చిన్నపాటి లైబ్రరీని ఏర్పాటు చేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా తమకు ఇష్టమైన పుస్తకాలు కనిపించినా, కొత్త పుస్తకాలను మార్కెట్‌లోకి వచ్చినా వాటిని కొనేస్తుంటారు. వీటిని తమ పుస్తకాల సెల్ఫ్‌ల్లో భద్రంగా దాచి పెట్టుకుంటారు. తీరిక ఉన్నప్పుడు చదువుతుంటారు. ఇది వారికో హాబీ. అయితే పనుల ఒత్తిడి వల్ల కొందరికి అది సాధ్యం కావడంలేదు. అటువంటి వారికి లాక్‌డౌన్‌ కాలం కలిసొచ్చింది. రెండు రోజులకో పుస్తకం చదివేస్తున్నారు. 


ఆటలు..

ఆటలంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. ప్రతీ ఒక్కరికి ఏదో ఒక ఆట గురించి కొద్దో గొప్పో తెలిసి ఉంటుంది.  పాఠశాల, కళాశాల స్థాయిలో కూడా ఆడి మెడల్స్‌, షీల్డ్‌లు తెచ్చుకున్నవారూ ఉన్నారు. కానీ పెళ్లై బాధ్యతలు మీదపడ్డ తర్వాత ఆటల పట్ల వారి ఇష్టం ఇటకెక్కుతుంది. అలాంటివారు ఇపుడు ఎంచక్కా ఇంట్లోనే పిల్లలతో కలిసి క్యారమ్స్‌, చెస్‌ వంటివి ఆడుతున్నారు. ఇంటి టెర్ర్‌సపై షటిల్‌, బ్యాడ్మింటన్‌ ఆటలు కూడా సాగుతున్నాయి. ఫుట్‌బాల్‌ను సైతం ఇంట్లో వరండాల్లో ఆడుతున్నారు.


ఆలోచనలకు ఆక్షర రూపం..

తమ ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చే హాబీ చాలా మందిలో ఉంటుంది. రచనను కొందరు వృత్తిగా ఎంచుకుంటే మిగతావారు ఆదొక హాబీగా కొనసాగిస్తారు. వృత్తి ఏదయినా ప్రవృత్తి రచనా వ్యాసంగంగా ఉన్నవాళ్ళు చాలా మందే ఉన్నారు. అలాంటివారు ఇపుడు కరోనా మహమ్మారిపై కవితలు అల్లుతున్నారు. రచనలు చేస్తున్నారు. వాటిని సోషల్‌ మీడియాలో పెట్టి ఇతరులతో పంచుకుంటున్నారు. 


ఫోన్లు, టీవీలు..

కొందరు టీవీలు, స్మార్ట్‌ఫోన్లు చూస్తూ కాలం గడిపేస్తున్నారు. మార్చి 14  నుంచి 20వ తేదీ వరకు టెలివిజన్‌ వీక్షకుల సంఖ్య 6 శాతం పెరిగిందని ుబార్క్‌్‌ వెల్లడించింది. మరో వైపు స్మార్ట్‌ ఫోన్లు చూస్తున్నవారి సంఖ్య కూడా పెరిగింది. సినిమాలు, పిల్లలకు సంబంధించిన ఛానళ్ళకు అధికంగా ఇంప్రెషన్స్‌ లభిస్తున్నాయి. వార్తల యాప్స్‌ను తెగ డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. 


విదేశాల్లో ఉన్నవారితో..

విదేశాల్లో ఉన్న తమవారి గురించి వాకబు చేస్తున్నారు. వీడియో కాల్స్‌ ద్వారా క్షేమ సమచారాన్ని తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం అనేక కుటుంబాల్లో పిల్లలు ఉద్యోగరీత్యా, పైచదువుల కోసం విదేశాల్లో ఉంటున్నారు. వారి యోగక్షేమాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లే శరణ్యమయ్యాయి. లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లో ఖాళీగా ఉంటున్న తల్లిదండ్రులు ఎక్కువ సేపు పిల్లలతో ఫోన్లలో మాట్లాడుతున్నారు.


అసహనం..

అయితే కరోనా వల్ల కుటుంబంలో కొత్త సమస్యలు కూడా పుట్టుకువస్తున్నాయి. భార్యా భర్తల మధ్య తరుచూ గొడవలు తలెత్తుతున్నాయి. భర్తలకు ఉన్న కొన్ని అలవాట్లు, మానసిక బలహీనతల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గృహహింస పెరుగుతోందన్న వాదన కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా మద్యం సేవించడం ఒక్కసారిగా నిలిచిపోవడంతో ఆ ఆలవాటు ఉన్నవారిలో వణుకు పుడుతోంది. ఫిట్స్‌ వస్తున్నాయి. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. సాధారణంగా మహిళలే ఇంటిపని ఎక్కువ చేస్తారు. లాక్‌డౌన్‌ సమయంలో కూడా పురుషులు ఇంటి పనుల్లో సహకరించడం లేదు. దీంతో భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. భార్యపోరు పడలేకపోతున్నట్టు ఓ పౌరుడు ఇటీవల మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేసిన విషయం తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated Date - 2020-04-05T18:00:44+05:30 IST