వీధి బతుకులకు కొత్త జీవితం

ABN , First Publish Date - 2021-01-11T05:55:57+05:30 IST

అభాగ్యుల అభ్యున్నతి కోసం నిరంతర సేవా మార్గంలో నడుస్తున్న ఇరవై నాలుగేళ్ల మనీషాకు స్ఫూర్తి వాళ్ల నాన్నే! ఆయన

వీధి బతుకులకు కొత్త జీవితం

వీధుల్లో వెళుతున్నప్పుడు బిచ్చగాడు కనిపిస్తాడు. ఏం చేస్తాం? వీలైతే ఎంతో కొంత దానం చేస్తాం. లేదంటే అతడిని దాటుకుని వెళ్లిపోతాం. అదే తమిళనాడు నర్సింగ్‌ అధ్యాపకురాలు మనీషా అయితే..! ఓ అడుగు ముందుకు వేస్తారు. అమ్మలా వారిని అక్కున చేర్చుకొంటారు. బతుకు బాగు కోసం అహర్నిశలూ శ్రమిస్తూ... గౌరవప్రదమైన జీవితానికి బాటలు వేస్తారు. ఇది ఆమెకు నిత్యకృత్యం... 


అభాగ్యుల అభ్యున్నతి కోసం నిరంతర సేవా మార్గంలో నడుస్తున్న ఇరవై నాలుగేళ్ల మనీషాకు స్ఫూర్తి వాళ్ల నాన్నే! ఆయన మాంసం కొట్టు నిర్వాహకుడు. తొమ్మిదేళ్ల ప్రాయం నుంచే నాన్న కొట్టుకు వెళుతుండేవారు మనీషా. ‘‘షాపులో నాన్న చేసే పని నేర్చుకునేదాన్ని. నాన్న సంపాదించేది కొంతే అయినా... అది మా కుటుంబ అవసరాలకే పెద్దగా సరిపోకపోయినా... అందులోనే కొంత సాయం చేసేవారు. ఇబ్బందుల్లో ఉన్నవారిని తోచినట్లు ఆదుకొనేవారు’’ అని చిన్ననాటి రోజులు గుర్తు చేసుకున్న మనీషా ప్రస్తుతం ఈరోడ్‌లోని నర్సింగ్‌ కాలేజీలో లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.


నాన్నను చూసి అలవర్చుకున్న పరోపకార గుణం ఆమెతోపాటే పెరుగుతూ వచ్చింది. అందుకే రోడ్డుపై బిచ్చగాళ్లు కనిపించినప్పుడు ఆమె ముఖం తిప్పుకుని వెళ్లిపోరు. ఏదో ఇంత చిల్లర వేసి చేతులు దులుపుకోరు. దగ్గరికి వెళ్లి, పలుకరించి, వాళ్లు ఎందుకీ పరిస్థితుల్లో ఉన్నారో ఆరా తీస్తారు. నిలువ నీడ చూపి, పొట్ట కూటి కోసం వీధినపడే అవసరం లేకుండా ఉపాధి మార్గం చూపిస్తారు. వయసు పైబడిన వారికి వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం కల్పిస్తారు. 


ఒక్కరుగా మొదలుపెట్టి...

తొలి అడుగు ఎప్పుడూ ఒంటరే. వీధి బతుకులు బాగు చేయాలనే తపనతో మనీషా వేసిన ఆ మొదటి అడుగుకు ఇప్పుడు వందల అడుగులు తోడయ్యాయి. ఒక జట్టుగా మారి... 2018లో ‘జీవితం ఫౌండేషన్‌’గా అవతరించాయి. ‘‘నాకు నాన్నే ఆదర్శం. ఆయన అడుగుజాడల్లో నడవాలని ‘జేఎన్‌కే నటరాజ కాలేజీ ఆఫ్‌ నర్సింగ్‌ అండ్‌ సైన్స్‌’లో చేరాను. ఆ సమయంలో రోడ్లపైనే జీవించే వారికి భోజనం, దుస్తులు ఇచ్చేదాన్ని. నా కోర్సులో భాగంగా వృద్ధాశ్రమాలకు కూడా వెళుతుండేదాన్ని.


ముఖ్యంగా వారాంతాల్లో ఆశ్రమాల్లోని వృద్ధులతో గడిపేదాన్ని. వారికి కావల్సినవి సమకూర్చడం, సాయం అందించడం అలవాటుగా మారింది. అందరూ ఉండి దిక్కులేనివారిలా కొందరు... ఏ ఆధారం లేక అనాథలుగా అంతిమ ఘడియల కోసం వేచి చూసేవారు కొందరు... పలుకరిస్తే ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. వింటుంటే హృదయం ద్రవిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రి వార్డులకు కూడా అప్పుడప్పుడూ వెళ్లి, రోగులకు సహకరిస్తుంటాను. దానివల్ల నాకు ఎంతో సంతృప్తి కలుగుతుంది’’ అంటారు మనీషా. 


ఆ తేడా తెలిసేలా... 

‘‘నర్సుగా శిక్షణ తీసుకొనేటప్పుడు సానుభూతి... సహానుభూతుల మధ్య తేడా ఏమిటో బోధించేవారు. ఈ కోర్సులో చేరక ముందు వీధుల్లో ఉండేవారి పట్ల సానుభూతి చూపేదాన్ని. కానీ నర్సింగ్‌ వల్ల సహానుభూతిని కూడా నాకు పరిచయం చేసింది. ఆ తరువాత నుంచే ఆ క్షణానికి వారి కడుపు నింపేసి, బట్టలు ఇచ్చేస్తే సరిపోదని అర్థమైంది. వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా, గౌరవప్రదమైన


జీవితానికి భరోసా కల్పించేలా చర్యలు తీసుకొంటేనే ప్రయోజనం ఉంటుందనిపించింది’’ అంటారు మనీషా. ఆమె నెలకొల్పిన ‘జీవితం ఫౌండేషన్‌’ చేసేది  ఇదే! అందుకే వీధుల్లో ఎవరైనా కనిపిస్తే, ముందు వాళ్లను కలిసి, వివరాలన్నీ రాబడతారు. అందులో కొందరు అనాథలుంటారు. మరికొందరు ఇంటి పరిస్థితుల వల్ల, మానసిక పరిపక్వత లేకపోవడంవల్ల బిచ్చగాళ్లుగా మారినవారుంటారు. ఒకవేళ కుటుంబ సభ్యులు ఒప్పుకొంటే, తిరిగి వారిని ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తారు మనీషా.



కొందరైతే... ‘మాకెందుకు ఈ శని... మీరే ఉంచుకోవచ్చుగా’ అంటూ నిర్ణాక్ష్యిణ్యంగా మాట్లాడతారు. ఓసారి అలాంటి ఘటనే ఎదురైంది.

రోడ్డు మీద ఓ యువకుడు తారసపడ్డాడు. పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. అతడిని పరిశీలిస్తే... పూర్తిగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. వైద్యుల వద్దకు తీసుకువెళితే... అతడి గురించి తల్లితండ్రులు కేర్‌ తీసుకొంటే గానీ మామూలు మనిషి కాడన్నారు. దాంతో వాళ్లింటికి వెళ్లాం. అతడి తల్లితండ్రులకు విషయం వివరిస్తే... ‘మాకు సంబంధం లేదు. నువ్వే చూసుకో’ అంటూ బాధ్యత లేకుండా మాట్లాడారు. దిగ్ర్భాంతి కలిగింది. దీంతో నేనే అతడిని పునరావాస కేంద్రంలో చేర్పించి, మామూలు మనిషిని చేశాను’’ అంటూ చెప్పుకొచ్చారు మనీషా. ఆమె ఇప్పటి వరకు దాదాపు రెండొందల మందికి పైగా అనాథలు, అభాగ్యులకు పునరావాసం కల్పించి, మెరుగైన జీవితానికి పునాదులు వేశారు మనీషా.





ఉద్యోగం వదిలేసి...


నర్సు ట్రైనింగ్‌ డిగ్రీ పొందిన తరువాత మనీషా ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఉద్యోగానికి చేరారు. అయితే కొద్ది నెలల్లోనే ఆ ఉద్యోగం వదిలేశారు. ‘‘కార్పొరేట్‌ తరహా ఉద్యోగాలు నా ఒంటికి సరిపడవని అప్పుడే అర్థమైంది. దానికి బదులు పాఠాలు బోధిస్తే పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దే అవకాశం కలుగుతుంది’’ అంటున్న ఆమె తరువాత ‘నంద కాలేజీ ఆఫ్‌ నర్సింగ్‌’లో లెక్చరర్‌గా చేరారు. నాటి నుంచి అక్కడే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.



Updated Date - 2021-01-11T05:55:57+05:30 IST