నవ జీవన పత్రం

ABN , First Publish Date - 2022-05-09T08:27:25+05:30 IST

అక్షరం అక్షరంతో కలిసి పదం అవ్వాలి కదా? పదం పదం కలిసి కదం తొక్కుతూ వాక్యం ఉరకలెత్తాలి కదా?...

నవ జీవన పత్రం

అక్షరం అక్షరంతో కలిసి

పదం అవ్వాలి కదా?

పదం పదం కలిసి కదం తొక్కుతూ

వాక్యం ఉరకలెత్తాలి కదా?

వాక్యం రసాత్మకమో నిరసనాత్మకమో అయ్యి

ఊపునో చూపునో మార్చాలి కదా?

వ్యథలనీ, సొదలనీ కథలో కవితలో చేసి 

కబుర్ల కాకరకాయలు అయినా

పంచుకోవాలి కదా?

భావాలు ఊటబావి లోపల నీటిలా తేటగా ఊరుతున్నా

పైకి తోడే తాడు జాడ లేదు

నాచుపట్టిన కోనేటి నీటిలో

మురిగిపోతున్న ఉదయం

నిప్పులవాన కురవాల్సిన నింగి

కృంగి.. కన్నీటి ముసురులో

ముఖం చాటేసినట్టుంది.

ఒక్క పదునైన వాక్యమైనా

పలకరించదు

కావ్యమేదీ.. కన్నీరు తుడవదు

కలం కాలాన్ని నిద్ర లేపదు

నిజం పెదవి దాటలేదు

అక్షరానికి నిప్పంటుకున్న వాసన కావాలి

అణుశక్తిలా ఆలోచనలు రేగాలి

అంతరంగంలో ఉప్పెన పెల్లుబికి ఉరకాలి.

కవిత్వం ఇంకా సజీవంగా ఉందంటూ 

          సాక్ష్యం పలికే

నవ జీవన పత్రం రచించాలి

నడిచి వచ్చే దారుల్లో నిలబడి

ధైర్యాన్ని పలికే నాలుగు మాటలు కావాలి

                     రాయగలవా మరి.

గరిమెళ్ళ నాగేశ్వర రావు

93816 52097


Read more