Abn logo
Sep 28 2020 @ 11:44AM

టీడీపీకి కొత్త సారథులు

Kaakateeya

నెట్టెంకు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం

కొనకళ్లకు నారాయణకు మచిలీపట్నం బాధ్యతలు

మచిలీపట్నం సమన్వయకర్తగా కొండపల్లి అప్పలనాయుడు

విజయవాడకు ధూళిపాళ్ల నరేంద్ర

రాజమండ్రి, నరసాపురం నియోజకవర్గాలకు గద్దె 

గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బచ్చుల అర్జునుడు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీలుండగా.. ఇప్పుడు జిల్లా కమిటీలకు బదులు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమిస్తోంది. ప్రతి రెండు లోక్‌సభ నియోజకవర్గాలకూ కలిపి ఒక సమన్వయకర్తను, ప్రతి జిల్లాకు ఒక ఇన్‌చార్జిని నియమిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఆదివారం అధ్యక్షులను ప్రకటించింది. 


జిల్లాలో రెండు లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి మాజీమంత్రి నెట్టెం రఘురామ్‌ను, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావును అధ్యక్షులుగా నియమించింది. మచిలీపట్నం సమన్వయకర్తగా సీనియర్‌ నేత కొండపల్లి అప్పలనాయుడు, విజయవాడ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే ఽధూళిపాళ్ల నరేంద్ర నియమితులయ్యారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావును రాజమండ్రి, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తగా టీడీపీ అధినేత చంద్రబాబు నియమించారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కొత్త కమిటీల ఏర్పాటుతో ఇప్పటి వరకు ఉన్న జిల్లా, అర్బన్‌ కమిటీలు రద్దయినట్లే. ఇప్పటి వరకు పార్టీ జిల్లా, విజయవాడ అర్బన్‌ అధ్యక్షులుగా ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, బుద్ధా వెంకన్న ఉన్నారు. గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ పార్టీకి దూరం కావడంతో ఆ నియోజకవర్గ బాధ్యతలను అర్జునుడికి అప్పగించారు. బుద్దా వెంకన్నకు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 


 సాధారణ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత నైరాశ్యంలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపి, పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు టీడీపీ అధినాయకత్వం కసరత్తును ప్రారంభించింది. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాలవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించి, పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులపై లోతుగా సమీక్షించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర కీలక పదవుల్లో ఉన్నవారు కిందిస్థాయి కార్యకర్తలను, నాయకులను కలుపుకుపోవడంలో విఫలమవడమే పార్టీ పరాజయానికి ప్రధాన కారణమని ఆ సమావేశాల్లో అభిప్రాయం వ్యక్తమైంది.


అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు తనదైన శైలిలో పార్టీని మళ్లీ పటిష్ఠం చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరినీ కలుపుకు వెళుతూ, పార్టీ అధిష్ఠానం ఆలోచనలకు అనుగుణంగా యువతను పార్టీ వైపు ఆకర్షించే కార్యక్రమాలకు పెద్దపీట వేసే వారికే కీలక బాధ్యతలు అప్పగించాలని భావించారు. ఆ దిశగానే  పార్లమెంటు అధ్యక్షుల ఎంపిక జరిగినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 


అనుభవజ్ఞులకు బాధ్యతలు 

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్ష పదవికి చివరి వరకు ప్రస్తుత ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) పేరు వినిపించింది. ఎంపీలను పార్టీ అధ్యక్షులుగా నియమించకూడదన్న నియమాన్ని పాటించడంతో ఆయన సూచన మేరకు మాజీ మంత్రి నెట్టెం రఘురాంకు బాధ్యతలు అప్పగించారు. రఘురాం గతంలో జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కొంతకాలం మంత్రిగా కొనసాగారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపైనా ఆయనకు అవగాహన ఉండటంతో.. ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జుల అభిప్రాయాలను కూడా పార్టీ పరిగణనలోకి తీసుకుంది. అధికశాతం నాయకులు రఘురాంకే ఓటేయడంతో ఆయన ఎంపికకు మార్గం సుగమమైంది. ఇదే తరహాలో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మాజీ ఎంపీ కొనకళ్లకు బాధ్యతలు అప్పగించారు.  


ఉద్యమ కారుడిగా కొనకళ్ల

మచిలీపట్నం : కొనకళ్ల నారాయణరావు ఏపీఎస్‌ఆర్టీసీ నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడిగా 30 ఏళ్లు బాధ్యతలు నిర్వర్తించారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారి, బందరు పోర్టు అభివృద్ధి కోసం ఏర్పడిన అఖిలపక్ష కమిటీకి అధ్యక్షుడిగా ఉంటూ 505 రోజులపాటు సాగిన ఉద్యమంలో కీలకపాత్ర వహించారు. 2009 నుంచి 2019 వరకు రెండు పర్యాయాలు మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి నిర్మాణంలో, మచిలీపట్నం-గుడివాడ-నరసాపురం రైల్వేడబ్లింగ్‌ పనుల్లో ప్రముఖ పాత్ర పోషించారు. 


పార్టీని బలోపేతం చేస్తా : కొనకళ్ల

చంద్రబాబు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తాను.  ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లేందుకు నాయకులకు, కార్యకర్తలకు అవగాహన కల్పిస్తా. పార్లమెంటులో ప్యానల్‌ స్పీకర్‌గా చేశాను. అన్ని నియోజకవర్గాలకూ ఎంపీ నిధులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. మళ్లీ ప్రజల వద్దకు వెళ్లే అవకాశాన్ని చంద్రబాబు కల్పించారు. రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే ధ్యేయంగా అందరం సమన్వయంతో పనిచేస్తాం. 


పిన్న వయస్కుడిగా శాసనసభకు నెట్టెం 

జగ్గయ్యపేట : ల్యాండ్‌ మోర్టగేజ్‌ బ్యాంక్‌ (ఎల్‌ఎంబీ) డైరెక్టర్‌గా 1981లో నెట్టెం రఘురామ్‌ రాజకీయ అరంగేట్రం చేశారు. 1985లో 28 సంవత్సరాలకే అసెంబ్లీకి ఎన్నికైన పిన్నవయస్కుడుగా నిలిచారు. జగ్గయ్యపేట నుంచి 1985, 1989, 1994 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభంజనంలో జిల్లాలో టీడీపీ తరపున గెలిచిన ముగ్గురిలో నెట్టెం ఒకరు. 1996లో చంద్రబాబు కేబినెట్‌లో ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కీలకంగా వ్యవహరించారు. 


టీడీపీ పూర్వ వైభవమే లక్ష్యం : నెట్టెం

వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా ఉన్న తరుణంలో పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన బాధ్యతలను, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిర్వర్తిస్తా. పార్టీలో 35 సంవత్సరాలుగా క్రియాశీలకంగా ఉన్నా. జిల్లా పరిస్థితులపై అవగాహన ఉంది. ప్రజల మనసు గెలుచుకునేలా పార్టీని తీర్చిదిద్దుతా. సోమవారం పార్టీ అధినేతను కలిశాక కార్యాచరణ ప్రకటిస్తా. పార్టీ నేతలను కలుపుకుని ప్రజల సమస్యలపై పోరాటం చేస్తా. Advertisement
Advertisement