కొత్త కుబేరులు

ABN , First Publish Date - 2022-05-26T06:07:51+05:30 IST

సరిగ్గా రెండేళ్ళక్రితం ఈ ప్రపంచంలో 2,095 మంది బిలియనీర్లు ఉన్నారని లెక్కగట్టాం. ఆ తరువాత ఓ భయంకరమైన వైరస్ యావత్ ప్రపంచాన్నీ కమ్మేసి, అధికారిక లెక్కల ప్రకారమే ఓ యాభైకోట్ల కేసులు...

కొత్త కుబేరులు

సరిగ్గా రెండేళ్ళక్రితం ఈ ప్రపంచంలో 2,095 మంది బిలియనీర్లు ఉన్నారని లెక్కగట్టాం. ఆ తరువాత ఓ భయంకరమైన వైరస్ యావత్ ప్రపంచాన్నీ కమ్మేసి, అధికారిక లెక్కల ప్రకారమే ఓ యాభైకోట్ల కేసులు, ఓ అరవైలక్షల మరణాలు నమోదైనాక ఆ శతకోటీశ్వరుల సంఖ్య ఇప్పుడు 2,668! కరోనా విలయతాండవం లెక్కకే కాదు, ఊహకు కూడా అందనిది. సమస్తరంగాలను అది ఛిన్నాభిన్నం చేసింది. ఈ మహాసంక్షోభం నుంచి ప్రతి ముప్పైగంటలకో కుబేరుడు పుట్టుకొచ్చాడట. కరోనా కారణంగా దాదాపు రెండేళ్ళ అనంతరం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ‘ప్రాఫిటింగ్ ఫ్రమ్ పెయిన్’ పేరుతో ఆక్స్‌ఫామ్ విడుదల చేసిన నివేదిక విస్మరించలేని ఒక ప్రమాద హెచ్చరిక.


కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడించిన ఈ కష్టకాలంలోనే తమ సంపద మరింత పెరిగినందుకు బిలియనీర్లంతా పండుగచేసుకోవడానికి దావోస్ వస్తున్నారని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్య ఓ చేదునిజం. పెరిగిపోతున్న అసమానతలమీద ఎప్పటికప్పుడు తన నివేదికలతో కఠిన హెచ్చరికలు చేసే ఆక్స్‌ఫామ్ ఎవరు పట్టించుకున్నా లేకున్నా తనవంతుగా సూచనలనూ చేస్తున్నది. కరోనా సంక్షోభంతో ప్రపంచంలో ఆర్థిక తారతమ్యాలు మరింత పెరిగాయనీ, కానీ అదే కొవిడ్ కాలంలో 573మంది కొత్త బిలియనీర్లు పుట్టుకొచ్చారని అంటోంది. ప్రతీ శతకోటీశ్వరుడు అవతరించేందుకు అవసరమయ్యే కాలంలో దాదాపు పదిలక్షలమంది దుర్భరమైన పేదరికంలోకి జారిపోతుంటారని కూడా ఆక్స్‌ఫామ్ హెచ్చరించింది. ఆహారం, ఇంధనరంగాలకు చెందిన పారిశ్రామిక బిలియనీర్ల సంపద రెండురోజులకో బిలియన్ డాలర్ల చొప్పున పెరిగిందని, కరోనా వారికి కాసులు కురిపించిందని నివేదిక అన్నది. గత రెండేళ్ళలో బిలియనీర్లు ఆర్జించిన సంపద వారు గత 23 ఏళ్ళలో ఆర్జించిన దానితో సమానం. ప్రపంచ కుబేరుల మొత్తం సంపద గ్లోబల్ జీడీపీలో దాదాపు 14శాతం. దిగ్గజ కంపెనీలు బాగుపడుతుండగా, వేతనాలు స్వల్పంగానే పెరిగి, దశాబ్దస్థాయి గరిష్ఠధరలతో పేదలు, కార్మికులు కష్టాలపాలవుతున్నారు. ఐదు అతిపెద్ద ఇంధన కంపెనీలు సెకనుకి 2,600 డాలర్ల లాభాన్ని దండుకుంటే, ఫార్మారంగంలో బడా ఔషధ తయారీ కంపెనీలు సెకనుకు వెయ్యి డాలర్ల లాభాన్ని ఆర్జించాయి, ఆ రంగానికి చెందిన ఓ నలభైమంది కొత్తగా బిలియనీర్లు అయ్యారు. ప్రభుత్వ పరిశోధనాసంస్థల్లో, ప్రజల డబ్బుతో తయారైన ఈ టీకాలను ధనికదేశాలకు ఎక్కువరేట్లకు అమ్ముకొని అపరకుబేరులు ఆవిర్భవించారు. అల్పాదాయ దేశాల్లోని 87శాతం మందికి ఇప్పటికీ రెండోడోసు కొవిడ్ టీకా అందలేదనీ, పేదదేశాల్లోని ప్రజలు ఆహారం కోసం రెట్టింపు ఖర్చుచేయవలసి వస్తున్నదనీ, కొన్ని దేశాల్లో అధికధరల కారణంగా తిరుగుబాట్లు ఆరంభమైనాయని నివేదిక వివరించింది.


పెరిగిపోతున్న హెచ్చుతగ్గులు, అసమానతల గురించి చెబుతున్నప్పుడల్లా ఆ సంస్థ పరిష్కారం కూడా సూచిస్తూన్నది. ధనికులపై సంపదపన్ను విధించాలన్న డిమాండ్ కొత్తదేమీ కాదు. మిలియనీర్లపై 2శాతం, బిలియనీర్లపై 5శాతం పన్ను విధిస్తే ఏటా 2.52 లక్షలకోట్ల డాలర్ల ఆదాయం సమకూరుతుందని, దానితో 232కోట్ల మందిని పేదరికంనుంచి బయటపడవేయవచ్చునని ఈ సంస్థ లెక్కలు కట్టింది. ఓ నూటయాభైమంది మిలియనీర్లు దావోస్ సదస్సు ముందు చేరి లోపల ఉన్నవారిని ఉద్దేశించి ఇదే డిమాండ్ చేశారు, బహిరంగ లేఖలు రాశారు. ఒక చిన్న నిర్ణయంతో పరిష్కారం కాగల తీవ్ర సమస్యను అలక్ష్యం చేయడం సరికాదని కూడా వారు హెచ్చరించారు. బిలియనీర్లకు భారీ రాయితీలతో మరింత దోచిపెట్టే అలవాటున్న పాలకులకు, పెద్దలను కొట్టి పేదలకు పంచేంత విశాలమైన మనసు, ధైర్యం ఉంటాయా? ఇటీవల మనదేశంలో ధనికులపై కరోనా సెస్ విధించి, పేదలకు అన్నంపెట్టమని సలహా ఇచ్చినందుకు కొందరు ఉన్నతాధికారులు ప్రధానమంత్రి కార్యాలయ ఆగ్రహానికి గురై ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. క్రమంగా పెరుగుతున్న అసమానతలను కరోనా మహమ్మారి మరింత తీవ్రతరం చేసింది. ఒకపక్క అదానీవంటివారు అపరిమిత వేగంతో ప్రపంచస్థాయి సంపన్నుడిగా పరిణమిస్తూ, మరోపక్క ప్రభుత్వం దేశంలో ఆహారకొరతలేదనీ, ఆకలిచావులు లేవనీ దబాయిస్తుంటే ప్రజలు ఎంతో కాలం విని ఊరుకోలేరు. ప్రభుత్వాలు క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించి, కుబేరులనుంచి కాస్తంతైనా రాబట్టి, ఆరోగ్యం, ఉపాధికల్పన, సామాజిక భద్రత ఇత్యాది రంగాల్లో భారీగా వెచ్చించనిదే పరిస్థితులు మారవు.

Updated Date - 2022-05-26T06:07:51+05:30 IST