Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 20 May 2022 22:00:51 IST

కాంగ్రెస్‌ శ్రేణుల్లో నయా జోష్‌..!

twitter-iconwatsapp-iconfb-icon
కాంగ్రెస్‌ శ్రేణుల్లో నయా జోష్‌..!

రాహుల్‌ సభతో పార్టీ వైపు నాయకుల చూపు

ఓదెలు బాటలోనే మరికొందరు సీనియర్లు

జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణలు

మంచిర్యాల, మే 20 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొత్త ఉత్సాహంలో మునిగి తేలుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రోజు రోజుకూ బలం పుంజుకుంటుండటంతో అప్పటి దాకా సమయం కోసం వేచి చూస్తున్న అగ్రనాయకులు బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెళ్లిలో ఆగస్టు 9న రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన దళిత గిరిజన దండోరా ఆత్మగౌరవ సభ విజయవంతం కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఆ సభ సక్సస్‌తో రాష్ట్ర పార్టీ నాయకత్వంపై నమ్మకం ఏర్పడ్డ కాంగ్రెస్‌ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకం అవుతున్నారు. అలాగే ఈ నెల 6న వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరుకావడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం రానుందనే నమ్మకం కార్యకర్తలు, నాయకుల్లో కలిగింది. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు.

జిల్లాలో బలోపేతం దిశగా...

ఇంతకాలం జిల్లాలో స్తబ్దంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం దిశగా పయనిస్తోంది. మంచిర్యాల నియోజక వర్గం మినహా మిగతా చోట్ల పార్టీకి పెద్దగా బలమైన నాయకత్వం లేక నాయకులు, కార్యకర్తలు నిరాశలో ఉండేవారు. మంచిర్యాల నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, ఆయన సతీమణి, డీసీసీ అధ్యక్షురాలు  సురేఖల కృషితో పార్టీ బలంగా ఉంది. చెన్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గాల్లో పార్టీని ముందుకు నడిపించేందుకు సత్తాగల నాయకత్వం లేకుండాపోయింది. బెల్లంపల్లిపై మాజీ మంత్రి గడ్డం వినోద్‌ దృష్టి సారించడంతో అక్కడ పార్టీ కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటు న్నాయి. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌లకు కంచుకోటగా ఉన్న చెన్నూరులో నాయకత్వ లోపం కారణంగా పార్టీ పూర్తి బలహీనంగా తయారయింది.  2018 సాధారణ ఎన్నికల్లో ప్రస్తుత పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత చెన్నూరు స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం వెంకటేశ్‌నేత టీఆర్‌ఎస్‌లో చేరి ఎంపీగా గెలవడంతో పార్టీకి నాయకత్వమే లేకుండా పోయింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో అక్కడి నాయకుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.  

ఓదెలు బాటలో మరికొందరు....

అధికార పార్టీని వీడిన నల్లాల ఓదెలు మాదిరిగానే మరికొందరు కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు ఆయన బాటలో నడవనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. చెన్నూరు నియోజక వర్గంలోని పలు మండలాలకు చెందిన సీనియర్‌ నాయకులు ఓదెలుతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నియోజక వర్గానికి చెందిన జిల్లా పరిషత్‌ మాజీ వైస్‌ చైర్మన్‌తోపాటు భీమారం మండలానికి చెందిన సీనియర్లు ఒకరిద్దరు అధికార పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం.  ఈ క్రమంలో కాంగ్రెస్‌లో చేరిన ఓదెలు నాలుగైదు రోజుల్లో నియోజక వర్గ పరిధిలో బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి భంగపాటు తప్పదని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓదెలు కాంగ్రెస్‌లో చేరడంతో చెన్నూరులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. 

‘బోడ’ పయనమెటు...?

ఇంతకాలం చెన్నూరు నియోజక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి సరియైన నాయకత్వం లేకపోవడంతో ఆ స్థానంపై మాజీ మంత్రి బోడ జనార్దన్‌ ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ హయాంలో చెన్నూరుపై తనదైన శైలిలో ముద్ర వేసిన బోడ వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రిగా పని చేశారు. అనంతరం జరిగిన పరిణామాల కారణంగా ఓటమి పాలయినప్పటికీ ఆయన చెన్నూరుపై దృష్టి మరల్చలేదు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన ఏ కార్యక్రమంలో పాల్గొనకుండా స్తబ్దంగా ఉంటున్నారు. 1985లో టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఎన్టీఆర్‌ కేబినెట్‌లో 1989 వరకు కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. జిల్లాలోని చెన్నూరు నియోజక వర్గం నుంచి 2004 వరకు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన బోడ రాజకీయ జీవితం అనంతరం జరిగిన పరిమాణాల కారణంగా ప్రశ్నార్థకంగా మారింది. 2004లో టీడీపీ, టీఆర్‌ఎస్‌ పొత్తు కారణంగా పెద్దపెల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు టీఆర్‌ఎస్‌కు దక్కగా చెన్నూరు నుంచి నల్లాల ఓదెలును సీటు వరించింది. అనంతరం రేవంత్‌ రెడ్డితో కలిసి 2018లో బోడ జనార్దన్‌ ఢిల్లీలో రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 2019 ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి గ్రూప్‌నకు అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెక్‌ పెట్టడంతో మళ్లీ బోడకు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి నియమితులు కావడం, జిల్లా కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం, రేవంత్‌తో బోడకు సత్సంబంధాలు ఉండటంతో ఇటీవల కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం నల్లాల ఓదెలు చేరడంతో బోడ పయనమెటు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీజేపీలోనే ఉండి చెన్నూరు నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో బోడ ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.