ఈ బామ్మ.. వందేళ్ల క్రితం నాటి స్పానిష్ ఫ్లూను చూసింది.. ఇప్పుడు కరోనాపై గెలిచింది..

ABN , First Publish Date - 2020-06-01T18:42:02+05:30 IST

సిల్వియా గోల్డ్‌షొల్‌... ఏడేళ్లప్పుడు స్పానిష్‌ ఫ్లూ చూసింది... ఆ తరవాత రెండు ప్రపంచ యుద్ధాలకూ సాక్షి. ఇప్పుడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనాను చూడడమే కాదు

ఈ బామ్మ.. వందేళ్ల క్రితం నాటి స్పానిష్ ఫ్లూను చూసింది.. ఇప్పుడు కరోనాపై గెలిచింది..

108 ఏళ్ల బామ్మ... జగజ్జేత 


సిల్వియా గోల్డ్‌షొల్‌... ఏడేళ్లప్పుడు స్పానిష్‌ ఫ్లూ చూసింది... ఆ తరవాత రెండు ప్రపంచ యుద్ధాలకూ సాక్షి. ఇప్పుడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనాను చూడడమే కాదు ఆ రాకాసి వైరస్‌ కోరల నుంచి బయట పడింది. 108 ఏళ్ల వయసులో  కొవిడ్‌ - 19 ను జయించిన అత్యధిక వయస్కురాలిగా అందర్నీ అబ్బురపరుస్తోంది..


ఓ చిరునవ్వుతో ప్రపంచాన్ని గెలవచ్చు అన్న దానికి సిల్వియా గోల్డ్‌షొల్‌ చక్కని ఉదాహరణ. అమెరికాలో ప్రస్తుతం ఆమె ఓ స్టార్‌. ప్రతి వార్తాపత్రికలో, టీవీ ఛానళ్లలో ఆమె కథనాలే. కొంతమంది ఇంటర్వ్యూల కోసమూ ప్రయత్నించారు. వివిధ దేశాలు ఆమె కథల్నే చెప్పకుంటున్నాయి. కరోనాతో ప్రపంచమంతా తల్లడిల్లి పోతుంటే సిల్వియా కరోనా విజయం మాత్రం జగాన్ని దోచుకుంది.  


చెదరని చిరునవ్వు... 

కరోనా వైరస్‌ సోకిందంటే ఓ మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ ఈ నూటా ఎనిమిదేళ్ల బామ్మ మాత్రం దానికి పూర్తి భిన్నం. ఏదో ఘనకార్యం సాధించిన దానిలా చిరునవ్వును మాత్రం వీడలేదు. ఏప్రిల్‌లో ఆమె కరోనాకు గురైంది. ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డులో ఉంచినా అదే స్థైర్యం. పైగా నర్సులూ, వైద్య సిబ్బందినీ... ఎలా ఉన్నారు? ఏం తిన్నారు? పిల్లలు ఏం చేస్తున్నారు అంటూ పలకరింపులు. అప్పటి వరకూ నిస్సత్తువ, నిస్తేజం, నిరాశలకు కేరాఫ్‌ అడ్రస్‌లుగా ఉండే పేషెంట్లను చూసిన వారందరికీ ఈ బామ్మ ఓ అద్భుతం. ఆమె మాటలు క్రమంగా ఓదార్పుగా మారాయి. తమ కష్టసుఖాలను ఆమెతో పంచుకోవడం మొదలుపెట్టారు. ఆమె సానుకూల దృక్పథం ఆస్పత్రి సిబ్బందిని కట్టిపడేసింది. దాని వల్లే సిల్వియా కరోనా కోరల నుంచి బయటపడింది. అతి పెద్ద వయసులో కరోనా బారి నుంచి తప్పించుకున్న తొలి అమెరికా వాసిగా రికార్డుల కెక్కింది. ఆ విజయానికి కారణం ఏమిటి అన్న పరిశోధనలు మొదలయ్యాయి కూడా. 


సిల్వియా తల్లిదండ్రులు రష్యా నుంచి వలస వచ్చారు. న్యూయార్క్‌లోనే ఆమె పుట్టి పెరిగింది. బుక్‌కీపర్‌గా పనిచేసేది. ఎక్కడ ఏ అవసరం వచ్చినా సిద్ధంగా ఉండేది. వాలంటరీ సర్వీసులకు తను పెట్టింది పేరు. ఏ కారణం చేతో పెళ్లి చేసుకోలేదు. తన తోబుట్టువులంతా జీవితంలో స్థిరపడినా తను అలాగే ఉండిపోయింది. సన్నిహితులకు, స్నేహితులకు నోట్లో నాలుకలా ఉండేది. ఇరవై ఏళ్ల క్రితమే న్యూజెర్సీకి మారింది. అక్కడి అల్లెండేల్‌ వృద్ధుల కేంద్రంలో పదేళ్ల నుంచి నివసిస్తోంది. సహచరులందరూ ఆమెను ‘పెద్దక్కా’ అంటూ పిలుస్తారు. అమెరికాలో న్యూయార్క్‌ తరవాత కరోనా కేసులు ఎక్కువగా నమోదైంది న్యూజెర్సీలోనే. అంతేకాదు, మరణాల రేటులో వృద్ధుల సంఖ్యే ఎక్కువగా ఉంది. అలాంటిది సిల్వియా ఎలా బయటపడింది? ‘కరోనా నుంచి తప్పించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను’ అంటూ భోళాగా నవ్వుతుంది. ‘మా అమ్మానాన్న ఎక్కువ కాలం జీవించలేదు కానీ పుట్టిన ప్రతి ఒక్కరూ నూరేళ్లూ జీవించాలని నా కోరిక. ఆ భగవంతుడు ఈ విన్నపాన్ని వింటున్నాడనే ఆశిస్తున్నా’. 


సిల్వియాకు వైరస్‌ సోకిందన్న వార్త వినగానే ఆమె దగ్గరి బంధువులందరూ తల్లడిల్లిపోయారు. ఈసారి కష్టమే అని అనుకున్నారు. కానీ ఆమె అనూహ్యంగా బయటపడడంతో వాళ్ల ఆనందానికి అంతే లేదు. ‘చురుకుదనానికి పెట్టింది పేరు మా మేనత్త. ఒక్కమాటలో వర్ణించాలంటే ఆమె ఓ సంబరం... తన చుట్టూ పండగ లాంటి వాతావరణాన్ని సృష్టించుకుంటుంది. అదే ఆమె విజయ రహస్యం’ అని సెల్వియా మేనకోడలు విశ్లేషిస్తుంది. ‘గొప్ప జీవితం, గొప్ప దృక్పథం, గొప్ప మానసిక స్థైర్యానికి ప్రతిరూపం. సిల్వియా మీరింకా అనేక వసంతాలు జీవించాలని కోరకుంటున్నా’ అని గవర్నర్‌ మర్ఫీ ఆమెకు సందేశాన్ని పంపించారు. ఈ చీకటి రోజుల్లో ఇలాంటి కథలు వెలుగును నింపుతాయి.

Updated Date - 2020-06-01T18:42:02+05:30 IST