Buried Cash: 90 ఏళ్ల నాటి ఇంటిని కొనుగోలు చేసిన జంట.. నేల తవ్వుతుండగా బయటపడ్డ నోట్ల కట్టలు..!

ABN , First Publish Date - 2022-07-29T23:53:28+05:30 IST

తొంభై ఏళ్ల నాటి నోట్ల కట్టల మిస్టరీని ఛేదించామంటూ అమెరికాలోని(USA) ఓ జంట ప్రస్తుతం సంబరపడిపోతోంది.

Buried Cash: 90 ఏళ్ల నాటి ఇంటిని కొనుగోలు చేసిన జంట.. నేల తవ్వుతుండగా బయటపడ్డ నోట్ల కట్టలు..!

ఎన్నారై డెస్క్: తొంభై ఏళ్ల నాటి నోట్ల కట్టల మిస్టరీని ఛేదించామంటూ అమెరికాలోని(USA) ఓ జంట ప్రస్తుతం సంబరపడిపోతోంది. చరిత్ర వెలికి తీశామని స్థానిక మీడియాకు చెప్పి మురిసిపోయింది. న్యూజెర్సీ(New jersey) రాష్ట్రానికి చెందిన రిచర్డ్, సుజేన్ గిల్సన్ దంపతులు నాలుగేళ్ల క్రితం వైల్డ్‌వుడ్(Wildwood) ప్రాంతంలో ఓ చిన్న ఇంటిని కొనుగోలు చేశారు. అది 1920ల్లో నిర్మించిన కాటేజీ. 1930ల్లో ఆ ఇల్లు.. జేమ్స్ డెంప్సీ అనే వ్యక్తి చేతుల్లోకి వెళ్లింది. ‘ది గ్రేట్ డిప్రెషన్‌’గా పేరుపడ్డ తీవ్ర ఆర్థిక సంక్షోభం అమెరికాను అతలాకుతలం చేస్తున్న కాలమది! ఇదిలాఉంటే.. రిచర్డ్, సుజేన్ దంపతులు ఆ ఇంటిని కొనుగోలు చేశాక..తమకు నచ్చిన విధంగా ఇంటికి కొన్ని మార్పులు చేశారు. ఈ క్రమంలో ఓ రోజు రిచర్డ్.. చెట్లు పాతేందుకు ఇంటి ముందు నేల తవ్వుతుండగా.. నోట్ల కట్టలు(Cash) బయటపడ్డాయి. 


తొలుత వాటిని చూసిన రిచర్డ్ అవి గంజాయి ప్యాకెట్లని పొరపడ్డాడు. మరింత పరిశీలనగా చూస్తే..ఆ ప్యాకెట్లలో ఉన్నవి నోట్ల కట్టలని అర్థమైంది. వాటి మీద ‘1934’ అని ముద్రించి ఉంది. లెక్కపెట్టి చూడగా.. అవి మొత్తం 2 వేల డాలర్లని తేలింది. దీంతో..రిచర్డ్ ఒక్కసారిగా షాకైపోయాడు. 90 ఏళ్ల నాటి కరెన్సీ నోట్లు చూసి అతడికి నోటమాట రాలేదు. నేటి లెక్కల ప్రకారం వాటి విలువ దాదాపు 40 వేల డాలర్లు. అయితే..రిచర్డ్  వెంటనే ఈ విషయాన్ని భార్యతో చెప్పాడు. ఆపై.. నగదు ఎవరిదో.. భూమిలో ఎందుకు పాతిపెట్టాల్సి వచ్చిందో తెలుసుకునేందుకు ఆ జంట ప్రయత్నాలు ప్రారంభించింది. చాలా కాలం పాటు ఎటువంటి పురోగతి లేకపోవడంతో ..అంతా ఓ మిస్టరీగా మారింది.


అయితే.. ఇటీవల ఆ జంట జేమ్స్ డెంప్సీ  మనవరాలిని కలుసుకోవడంతో మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆ డబ్బుని నేలలో పాతిపెట్టమని తన తాత అప్పట్లో తన తల్లికి చెప్పినట్టు జేమ్స్ మనవరాలు పేర్కొంది. ఆ తరువాత.. తన కుటుంబం ఆ డబ్బు కోసం ఎంత వెతికినా ఉపయోగం లేకపోయిందని చెప్పింది. ఇన్నాళ్ల తరువాత ఆ సంపద రిచర్డ్ దంపతులకు దొరికినందుకు ఆశ్చర్యపోయింది. అయితే.. ఈ డబ్బును తాను అస్సలు ఖర్చు చేయనని రిచర్డ్ మీడియాకు తెలిపారు. ‘‘2 వేల డాలర్లంటే పెద్ద మొత్తమే కానీ.. మరీ జీవితాలు మారిపోయేంత భారీ మొత్తమేమీ కాదు. అయితే.. ఆ నోట్ల వెనకున్న చరిత్ర చాలా ఆసక్తికరమైనది. తొంభై ఏళ్ల నాడు ఓ వ్యక్తి చేసిన పనికి ఇది సాక్ష్యం. ఆ డబ్బులను ఏం చేస్తావని నిత్యం అనేక మంది నన్ను అడుగుతుంటారు. నేను మాత్రం అందులో ఒక్క డాలర్ కూడా ఖర్చు పెట్టను.’’ అని రిచర్డ్ చెప్పారు.  

Updated Date - 2022-07-29T23:53:28+05:30 IST