న్యూ ఇయర్‌ వేడుకల్లో కొత్తగా...

ABN , First Publish Date - 2022-01-01T05:30:00+05:30 IST

ఓ వైపు కొత్త సంవత్సరం వేడుకలు, మరోవైపు వణికిస్తున్న

న్యూ ఇయర్‌  వేడుకల్లో కొత్తగా...

ఓ వైపు కొత్త సంవత్సరం వేడుకలు, మరోవైపు వణికిస్తున్న చలి. ఈ సమయంలో ఇంటికొచ్చిన స్నేహితులకు బిర్యానీ పార్టీ ఇస్తే ఏం బాగుంటుంది? మనదేశంలోని వివిధ ప్రాంతాల్లో వింటర్‌ స్పెషల్‌ రెసిపీలుగా గుర్తింపు పొందిన వంటలను రుచి చూపిస్తే కొత్త ఏడాదంతా గుర్తుపెట్టుకుంటారు. ఆ వంటల విశేషాలు ఇవి...




నూడుల్స్‌ సూప్‌ 

ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, మేఘాలయ, అసోంలలో పాపులర్‌ సూప్‌ ఇది. రకరకాల వెజిటబుల్స్‌, నూడుల్స్‌తో చేసే ఈ సూప్‌ శరీరంలో వేడిని పుట్టిస్తుంది. 

కావలసినవి

నూడుల్స్‌ - 150గ్రాములు, తరిగిన ఉల్లిపాయలు - పావు కప్పు, బీన్స్‌ - ఐదారు, క్యారెట్‌ - ఒకటి, క్యాబేజీ తురుము - పావు కప్పు, స్ర్పింగ్‌ ఆనియన్స్‌ - రెండు(గార్నిష్‌ కోసం), కొత్తిమీర - ఒక కట్ట, స్వీట్‌ చిల్లీ సాస్‌ - మూడు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, సోయాసాస్‌ - రెండు టీస్పూన్లు, నూనె - రెండు టీస్పూన్లు, జీలకర్ర పొడి - అర టీస్పూన్‌, గరం మసాలా - పావు టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత. కూరగాయల రసం - నాలుగు కప్పులు.

తయారీ విధానం

 ముందుగా నూడుల్స్‌ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బీన్స్‌, క్యారెట్‌, కొత్తిమీరను తరిగి పక్కన పెట్టుకోవాలి.

 స్టవ్‌పై వెడల్పాటి పాన్‌ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు, దంచిన వెల్లుల్లి వేసి వేయించాలి. 

 ఉల్లిపాయలు  వేగిన తరువాత కట్‌ చేసి పెట్టుకున్న బీన్స్‌, క్యారెట్‌, క్యాబేజీ తురుము వేసి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.

 కాసేపు ఉడికిన తరువాత గరంమసాల, స్వీట్‌ చిల్లీ సాస్‌, సోయా సాస్‌ వేసి కలియబెట్టుకోవాలి. 

 ఇప్పుడు కూరగాయల రసం పోయాలి. చిన్నమంటపై ఐదు నిమిషాలు మరిగించాలి. అవసరమైతే కొన్ని నీళ్లు 

కలుపుకోవచ్చు. 

 తరువాత తరిగిన కొత్తిమీర వేసి మరో ఐదు నిమిషాలు మరిగించాలి. 

 చివరగా నూడుల్స్‌ వేసి, జీలకర్ర పొడి వేసి కలియబెట్టుకోవాలి. చిన్నమంటపై రెండు, మూడు నిమిషాలు ఉంచి దింపుకోవాలి. స్ర్పింగ్‌ ఆనియన్స్‌తో గార్నిష్‌ 

చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.




చిక్కుడుకాయ రసం


చలికాలంలో బెంగళూరుతో పాటు కర్ణాటకలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో ఈ రసం ఎక్కువగా తీసుకుంటారు. ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా లభించే ఈ రసాన్ని ఇడ్లీ, రైస్‌, రోటీతో పాటు తింటారు. హల్వా, ఐస్‌క్రీమ్‌తోనూ తినడానికి ఇష్టపడతారు. 

కావలసినవి

ఉడికించిన చిక్కుడు విత్తనాలు - రెండు కప్పులు, చిక్కటి చింత పండురసం - మూడు టీస్పూన్లు, కరివేపాకు - రెండు రెమ్మలు, పసుపు - ఒక టీస్పూన్‌, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాలు - ఒక టీస్పూన్‌.

గ్రైండింగ్‌ కోసం : జీలకర్ర - రెండు టీస్పూన్లు, ధనియాలు - రెండు టీస్పూన్లు, పచ్చిమిర్చి - నాలుగు, ఇంగువ - అర టీస్పూన్‌, కొబ్బరి తురుము - పావు కప్పు, ఉడికించిన చిక్కుడు - రెండు మూడు టేబుల్‌స్పూన్లు. 

తయారీ విధానం

 స్టవ్‌పై పాన్‌ పెట్టి జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. నూనె వేయకుండా రోస్ట్‌ చేసుకోవాలి. తరువాత వీటిని మిక్సీలో వేసి, కొబ్బరి తురుము కలిపి, ఉడికించిన చిక్కుడు వేసి పేస్టులా చేసుకోవాలి. అవసరమైతే కాస్త నీళ్లు కలుపుకోవచ్చు.

 స్టవ్‌పై మళ్లీ పాన్‌ పెట్టి రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించిన చిక్కుడు గింజలు వేయాలి. కాసేపయ్యాక మిక్సీలో చేసిన పేస్టు వేయాలి. పసుపు వేసి మరిగించాలి. చింతపండు రసం కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. రసం మరుగుతున్నప్పుడే  కరివేపాకు వేయాలి.

 స్టవ్‌పై పాత్ర పెట్టి నెయ్యి వేసి వేడి అయ్యాక ఆవాలు వేసి వేయించాలి. ఈ పోపును రసంలో కలుపుకొని సర్వ్‌ చేయాలి. 




ఆవాల ఆకుల కర్రీ 


పంజాబ్‌తో పాటు కొన్ని ఉత్తర భారత రాష్ట్రాల్లో ఇది ఫేమ్‌స్‌ వింటర్‌ ఫుడ్‌. ఆవ ఆకులతో చేసే ఈ వంటకంలో పీచుపదార్థంతోపాటు ఫైటోన్యూట్రియెంట్స్‌ లభిస్తాయి. ఈ వంటకం తయారుచేసుకోవడానికి...

కావలసినవి

ఆవాల ఆకులు - నాలుగు కట్టలు చిన్నవి, పాలకూర - రెండు కట్టలు, పచ్చిమిర్చి - మూడు, మొక్కజొన్న పిండి - ఒక కప్పు, నెయ్యి - మూడు టేబుల్‌స్పూన్లు, దంచిన అల్లం - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - నాలుగైదు, ఉల్లిపాయలు - రెండు, వెన్న - ఒక టేబుల్‌స్పూన్‌. 

తయారీ విధానం

 ఆవాల ఆకులను, పాలకూరను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా తరగాలి. 

 స్టవ్‌పై ఒక పాత్రను పెట్టి అర లీటరు నీళ్లు పోసి మరిగించాలి. అందులో కట్‌ చేసిన పెట్టుకున్న ఆకుకూరలు వేయాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చిలో సగం వేయాలి. మూత పెట్టి చిన్నమంటపై ఇరవై నిమిషాలు మరిగించాలి.

  పాత్రను దించి అందులో మొక్కజొన్న పిండి కొద్దికొద్దిగా వేస్తూ కలియబెట్టాలి. మెత్తటి పేస్టులా తయారయ్యేలా కలుపుకోవాలి.

 మరొక పాత్రలో నెయ్యి వేసి అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించాలి. తరువాత అందులో పేస్టులా తయారుచేసి పెట్టుకున్న మిశ్రమం కలపాలి. మరో పావుగంట పాటు ఉడికించాలి. తగినంత ఉప్పు వేసుకుని దింపుకోవాలి.

 పైన వెన్న వేసి వేడి వేడి కర్రీ సర్వ్‌ చేసుకోవాలి.




ఉందియు

గుజరాత్‌లో పాపులర్‌ వంటకం ఇది. సూరత్‌లో పుట్టిన  ఈ వంటకం ఈ సీజన్‌లో అక్కడి ప్రతి వంటింట్లోనూ ఘుమఘుమలు పంచుతుంది. 

కావలసినవి

చిక్కుడుకాయ - 100గ్రాములు, అరటికాయలు - రెండు, చామగడ్డలు - 100 గ్రాములు, బంగాళదుంపలు - 100గ్రాములు, వంకాయలు - పావుకేజీ, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర - ఒక టీస్పూన్‌.

గుంత పొంగనాల కోసం : శనగపిండి - ఒకకప్పు, మెంతి ఆకులు - పావు కప్పు, ఇంగువ - చిటికెడు, బేకింగ్‌ సోడా - పావు టీస్పూన్‌, ఉప్పు - ఒక టీస్పూన్‌, పంచదార - రెండు టీస్పూన్లు, కారం - అర టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, నిమ్మరసం - కొద్దిగా.

మసాలా కోసం : అల్లం - ఒక అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, పచ్చిమిర్చి - ఒకటి, కొబ్బరి తురుము - ఒక కప్పు, కొత్తిమీర - ఒకకట్ట, నిమ్మకాయ - ఒకటి, నువ్వులు - మూడు టీస్పూన్లు, ధనియాల పొడి - మూడు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, పంచదార - రెండు టీస్పూన్లు, కారం - అర టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌.

తయారీ విధానం

 ముందుగా మసాలా కోసం సిద్ధం చేసుకున్న పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి, నిమ్మరసం పిండి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్టులా చేసుకోవాలి. 

 చిక్కుడుకాయలను చిన్నగా కట్‌ చేసుకోవాలి. అరటికాయలు, చామగడ్డల పొట్టుతీసి కట్‌ చేసి పెట్టుకోవాలి. 

 వంకాయలను నిలువుగా కట్‌ చేసి మధ్యలో మసాలా పేస్టును కూరాలి. బంగాళదుంపలను కూడా అలాగే కట్‌ చేసి మధ్యలో మసాలా పేస్టు కూరాలి.

 స్టవ్‌పై కుక్కర్‌ పెట్టి నెయ్యి వేసి వేడి అయ్యాక జీలకర్ర వేయాలి. జీలకర్ర వేగిన తరువాత మసాలా కూరిన వంకాయలు, బంగాళదుంపలు వేయాలి. మిగిలిన మసాలాలో  కొద్దిగా వేసి కలుపుకోవాలి.

 తరువాత అరటికాయ ముక్కలు, చామగడ్డ ముక్కలు వేసి మిగిలిన మసాలా  వేసి కలుపుకోవాలి.

 కొద్దిగా ఉప్పు వేసి చిక్కుడుకాయ ముక్కలు వేయాలి. తరువాత ఒక కప్పు నీళ్లు పోసి మూత పెట్టి నాలుగైదు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించి ఆవిరి పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి.

 ఇప్పుడు పొంగనాలు తయారుచేసుకోవాలి. ఒక ప్లేట్‌లో శనగపిండి తీసుకుని అందులో మెంతి ఆకులు, కారం, ఉప్పు, పంచదార, బేకింగ్‌సోడా, ఇంగువ, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. పొంగనాల ప్లేట్‌లో వేసి ఉడికించి పెట్టుకోవాలి. 

 తరువాత స్టవ్‌పై వెడల్పాటి పాన్‌ పెట్టి నెయ్యి వేసి వేడి అయ్యాక కుక్కర్‌లోని మిశ్రమం వేయాలి. తరువాత పొంగనాలు వేయాలి. రుచికి తగినంత ఉప్పు వేసి చిన్నమంటపై మూతపెట్టి పదినిమిషాలు ఉడికిస్తేఉందియు రెడీ.


Updated Date - 2022-01-01T05:30:00+05:30 IST