రామతీర్థానికి కొత్త విగ్రహాలు

ABN , First Publish Date - 2021-01-24T08:51:04+05:30 IST

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం కోదండరాముని ఆలయంలో ప్రతిష్టించేందుకు తిరుమలలో తయారు చేయించిన శ్రీసీతారామలక్ష్మణుల విగ్రహాలు శనివారం మధ్యాహ్నం రామతీర్థానికి ప్రత్యేక వాహనంలో చేరుకున్నాయి.

రామతీర్థానికి కొత్త విగ్రహాలు

  • తిరుమల నుంచి ప్రత్యేక వాహనంలో తరలింపు
  • ఘన స్వాగతం పలికిన అర్చకులు, ప్రజలు
  • శాస్ర్తోక్తంగా పూజా కార్యక్రమాలు
  • 28న బాలాలయంలో ప్రతిష్ఠాపన


నెల్లిమర్ల, తిరుమల, జనవరి 23: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం కోదండరాముని ఆలయంలో ప్రతిష్టించేందుకు తిరుమలలో తయారు చేయించిన శ్రీసీతారామలక్ష్మణుల విగ్రహాలు శనివారం మధ్యాహ్నం రామతీర్థానికి ప్రత్యేక వాహనంలో చేరుకున్నాయి. తిరుమలలో నిష్ణాతులైన శిల్పులతో కృష్ణ శిలరాతితో తయారు చేయించిన ఈ విగ్రహాల రాకను పురస్కరించుకుని దేవస్థానం అర్చకులు, అధికారులు, పోలీసులు, స్థానికులు వెళ్లి ఘన స్వాగతం పలికారు. అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించి వాహనం నుంచి కిందకు దించారు. అనంతరం వాటిని మోసుకుంటూ ప్రధానాలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు.  విగ్రహాలను రామతీర్థం ప్రధానాలయంలో ప్రత్యేకంగా ధాన్యంతో నింపి చక్కగా అలంకరించిన బాలాలయంలో భద్రపరిచారు. ఈ నెల 28న బాలాలయంలోనే సీతారామలక్ష్మణ విగ్రహాలను ప్రతిష్ఠించనున్నట్లు దేవదాయ శాఖ ఆర్‌జేసీ భ్రమరాంబ విలేకరులకు చెప్పారు. 25 నుంచే స్వామికి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు.  గత నెల 28న కోదండరాముని ఆలయంలోని శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసంచేసిన విషయం తెలిసిందే. దేవదాయ శాఖ ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు టీటీడీ శిల్పులు పది రోజుల గడువుకు ముందే వాటిని చక్కగా తీర్చిదిద్ది  అప్పగించారు.     


ఏడాదిలోపు ఆలయ పునర్నిర్మాణం: మంత్రి వెల్లంపల్లి

విజయనగరం జిల్లా రామతీర్థ ఆలయాన్ని ఏడాదిలోపు పునర్నిర్మాణం చేయనున్నట్లు దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. టీటీడీ నుంచి శుక్రవారం నూతన విగ్రహాలు రామతీర్థానికి తరలించినట్లు తెలిపారు. రామతీర్థ ఆలయాన్ని పూర్తిగా తొలగించి ఏడాదిలోపు పునర్నిర్మాణం చేయాలని నిర్ణయించామని, అప్పటివరకు విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ఠిస్తామని చెప్పారు.

Updated Date - 2021-01-24T08:51:04+05:30 IST