కొత్త ఆశలు!

ABN , First Publish Date - 2022-07-26T06:15:49+05:30 IST

భారత పదిహేనవ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాల్ లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఆమెతో ప్రమాణం చేయించారు....

కొత్త ఆశలు!

భారత పదిహేనవ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాల్ లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. తొలి గిరిజన, రెండవ మహిళా రాష్ట్రపతిగా ఆమె ప్రమాణం చేస్తున్న దృశ్యం అమృతోత్సవ భారతానికి మరింత వన్నెతెచ్చే అంశం. 


ఆదివారం రామ్ నాథ్ కోవింద్ జాతినుద్దేశించిన చేసిన తన వీడ్కోలు ప్రసంగంలో ప్రస్తావించిన స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం వంటి విలువలు దేశంలో ఏ మేరకు అమలు జరుగుతున్నాయన్నది అటుంచితే, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ ఆయనపై గట్టి విమర్శలే చేశారు. రాజ్యాగాన్ని పణంగా పెట్టి కోవింద్ తన పదవీకాలాన్ని పూర్తిగా బీజేపీ ఎజెండా పూర్తికి సహకరించారని ఆమె ఆరోపించారు. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దుచేసే ఆర్టికల్ 370, పౌరసత్వ సవరణ చట్టం వంటి అనేక ఏకపక్ష నిర్ణయాలను ఆయన సమర్థించారనీ, దళితులు, మైనారిటీలపై దాడులను ఆయన అడ్డుకోలేదన్నది ఈ విమర్శ సారాంశం. కోవింద్ పూర్తిగా పాలకులతో రాజీపడిపోయారనీ, అధికారం ఉండి కూడా వారిని ఒక్కమారు కూడా ప్రశ్నించలేదని కొందరి ఆవేదన. ఒక రాష్ట్రపతిగా ఆయన రూల్ బుక్ కు కట్టుబడి వ్యవహరించారనీ, పాలన కుంటుబడకుండా చూశారనీ, దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు అండగాఉన్నారని మెచ్చుకొనే వారు కూడా ఉండవచ్చు. విమర్శకు, తూకానికీ ఎవరూ అతీతులు కారు కానీ, కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగాన్ని, చట్టాన్ని సంరక్షిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేసిన అనంతరం చేసిన ప్రసంగంలో కొన్ని హామీలు ఇవ్వడం సంతోషించాల్సిన విషయం. 


శతాబ్దాలుగా అణగారినవర్గాలు, దళిత ఆదివాసీలూ తనలో వారిని చూసుకుంటున్నారని ఆమె చేసిన వ్యాఖ్య పాలకులను సంతోషపెట్టేందుకు ఉద్దేశించినదిగా కాక, మనసులోనుంచి వచ్చినదేనని భావించాలి. అందువల్ల, ఆమెను తమ ప్రతినిధిగా భావిస్తున్న ఆయా వర్గాల ఆశలనూ, ఆకాంక్షలనూ వమ్ముచేసే చట్టాలనూ, చర్యలనూ ఆమె తన పరిధికి లోబడి వీలైనంత వరకూ నిలుపుదలచేస్తారనీ, కనీసం ప్రశ్నిస్తారని ఆశించడంలో తప్పులేదు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన సంతాల్, పైకా, కోల్, భిల్ వంటి నాలుగు ప్రధాన ఆదివాసీ విప్లవాలను గుర్తుచేసిన ఆమె ఆ పోరాటాల స్ఫూర్తినీ, ఆశయాన్నీ చెరిగిపోకుండా కాపాడవచ్చు. అడవిపైన ఆదివాసులకు ఉన్న హక్కులను లాక్కుంటూ, నిర్వాసితులను చేస్తూ, కోట్లాది ఎకరాల అటవీభూమిని భూస్వాములకు, కార్పొరేట్లకు కట్టబెడుతున్న ఈ కాలంలో అత్యున్నత పీఠం మీద ఉన్న తమ మనిషి మీద ఆదివాసులు కచ్చితంగా ఆశలు పెట్టుకుంటారు. పర్యావరణ పరిరక్షణలో ఆదివాసీల సాంప్రదాయక పాత్ర ఇప్పుడు ఏ విధంగా తెగిపోతున్నదో, దానిని కాపాడటానికి ఏమి చేయాలో ఆమెకు తెలియనిదేమీ కాదు. వివిధ భాషలు, మతాలు, ఆహారపు అలవాట్లతో భిన్నత్వానికి మారుపేరుగా ఉన్న భారతదేశాన్ని శ్రేష్ఠభారత్ చేస్తామన్నందుకూ సంతోషించవచ్చు. కానీ, ఏక్ భారత్ అన్న నినాదంతో ఆ భిన్నత్వాన్ని రూపుమాపేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఆమె గుర్తించాలని కోరుకోవచ్చు. పిన్నవయసులోనే చదువు కోసం తపించి, శ్రమించి, ఉపాధ్యాయురాలిగా కూడా పనిచేసిన ఆమె ఇప్పుడు విద్యకు పాలకులు కొత్తరంగులు పులుముతున్నారని గ్రహిస్తే మంచిది. రాష్ట్రపతి పదవిని రబ్బర్ స్టాంప్ అంటూ నిట్టూర్చడం వల్ల కానీ, ఏకంగా ఈ దేశ సామాజికార్థిక స్వరూపస్వభావాలను మార్చేయాలని ఆశించడం కానీ సరికాదు. కానీ, రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతను నోటిమాటకు పరిమితం చేయడమో, లాంఛనప్రాయమైనదిగానో చూడటం కాక, రాజ్యాంగ పరిరక్షకురాలిగా ఆమె మనస్పూర్తిగా వ్యవహరించి, కర్తవ్యానికి కట్టుబడినప్పుడు విస్తృత ప్రజాశ్రేయస్సు సాధ్యపడుతుంది. సంతకానికి ముందు ఓ ప్రశ్న, ఓ సలహా, వివరణ కావాలన్న ఓ మాట ఆమె నుంచి వస్తే, మందబలంతో తాము అనుకున్నది ఏదైనా చేయగలమన్న అతిశయం పాలకుల్లో తగ్గుతుంది, ప్రజలకు ప్రజాస్వామ్యం మీద మరింత విశ్వాసం పెరుగుతుంది. అత్యయికస్థితి ఆదేశాలమీద అర్థరాత్రి సంతకించిన రాష్ట్రపతినీ, మా నేత చెబితే చీపురు పట్టుకుంటానన్న రాష్ట్రపతినీ కూడా చరిత్ర గుర్తుపెట్టుకుంది. కానీ, అట్టడగువర్గాలకు, విస్తృత ప్రజాశ్రేణులకు హానిచేసే చర్యలకూ, చేష్టలకూ అడ్డుకట్టవేసే ఒక వాతావరణాన్ని సృష్టించిన ఆదివాసీ మహిళగా ద్రౌపది చరిత్రలో నిలిచిపోవాలని దేశం కోరుకుంటోంది.

Updated Date - 2022-07-26T06:15:49+05:30 IST