BC విద్యార్థుల కోసం ఏటా కొత్త గురుకులాలు

ABN , First Publish Date - 2022-07-07T20:36:12+05:30 IST

రాష్ట్రంలో ఇకనుంచి ఏటా కొత్తగా కొన్ని బీసీ గురుకులాలను ప్రారంభిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న గురుకులాల

BC విద్యార్థుల కోసం ఏటా కొత్త గురుకులాలు

జిల్లా యూనిట్‌గా ప్రతి జిల్లాలో ఏర్పాటు.. 

త్వరలో 15 మహిళా డిగ్రీ కాలేజీలు కూడా

బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్‌


హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇకనుంచి ఏటా కొత్తగా కొన్ని బీసీ గురుకులాలను ప్రారంభిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న గురుకులాల సంఖ్యను త్వరలోనే రెట్టింపు చేస్తామని చెప్పారు. నూతన బీసీ గురుకులాలు, ప్రతి జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 281 బీసీ గురుకులాలు ఉండగా.. వాటిలో మొత్తం 1,52,440 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. ఈ ఏడాది నుంచి జిల్లా యూనిట్‌గా.. ప్రతి జిల్లాలో ఒక గురుకులం చొప్పున మొత్తం 33 బీసీ గురుకులాలను కొత్తగా ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అలాగే ఈ విద్యాసంవత్సరం 4 గురుకుల పాఠశాలలను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని, వచ్చే ఏడాది 115 పాఠశాలల ను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


డిగ్రీ కాలేజీల్లో మూడు కొత్త కోర్సులు

బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ప్రస్తుతం ఒక్క మహిళా డిగ్రీ కాలేజీ మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే 15 మహిళా డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గంగుల తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసే డిగ్రీ కాలేజీల్లో కోర్సులు వైవిధ్యంగా ఉండాలన్నారు. ఈ విషయంలో ఉన్నత విద్యామండలి సహకారం అందించాలని మండలి చైర్మన్‌ను  ఆదేశించారు. డిగ్రీ కాలేజీల్లో అందించే ఆరు కోర్సుల్లో 3 కొత్త కోర్సులు ఉండాలన్నారు. పరిశ్రమలతో అనుసంధానమై కోర్సులను రూపొందించాలని తెలిపారు. డిగ్రీ పూర్తిచేసుకున్న విద్యార్థులకు సంక్షేమ శాఖ ద్వారానే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు నిర్వహించి, వారికి మంచి వేతనాలు అందేలా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తామని మంత్రి చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా 21 బీసీ స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమీక్షలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొ. లింబాద్రి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ గురుకుల కార్యదర్శి మల్లయ్య బట్టు తదితరులు పాల్గొన్నారు. 


ఎస్టీ స్టడీ సర్కిళ్లలో ప్రైవేటు ఉద్యోగాలకు శిక్షణ

ప్రతి జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటుచేయబోతున్న ఎస్టీ స్టడీ సర్కిళ్లలో ప్రైవేటు ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ స్టడీ సర్కిళ్లలో ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే శిక్షణ ఇస్తున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో స్టడీ సర్కిల్‌ను ఏర్పాటుచేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో సంబంధిత అధికారులతో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువతకు దేశంలో ఎక్కడైనా ఉపాధి లభించే విధంగా స్టడీ సర్కిళ్లలో శిక్షణ అందించాలన్నారు. అందుకు తగినట్టు ప్రతి స్టడీ సర్కిల్‌లో ఫ్యాకల్టీ, కంప్యూటర్లు, ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చాలని సూచించారు. గురుకుల విద్యార్ధులకు భోజనం, ఇతర సదుపాయాలను మరింత మెరుగుపర్చాలని అధికారులను సూచించారు. రాజేంద్రనగర్‌ గురుకులంలో మాదిరిగానే.. ఖమ్మం, పరిగి, హయత్‌నగర్‌, వరంగల్‌ గురుకులాల్లో ఈ ఏడాది నుంచి ఐఐటీ జేఈఈ, ఎంసెట్‌ కోచింగ్‌ ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. 

Updated Date - 2022-07-07T20:36:12+05:30 IST