కొత్త ఆర్థిక సంవత్సరం (2022-23) శుక్రవారం నుంచి ప్రారంభమవుతోంది. ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో కొన్ని మార్పులు మేలు చేస్తే, కొన్ని మాత్రం వాతలు పెట్టేలా ఉన్నాయి. ఆ మార్పులు ఏమిటంటే..
ఐటీ రిటర్న్‌ల అప్డేట్ : ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు చాలా మంది తెలిసో తెలియకో కొన్ని తప్పులు, పొరపాట్లు చేస్తుంటారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త వెసులుబాటు కల్పించారు. ఇలాంటి వ్యక్తులు కొన్ని షరతులకు లోబడి రెండేళ్లలోగా తమ ఐటీ రిటర్న్‌లను అప్డేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ అప్డేటెడ్ రిటర్న్స్‌లో గతంలో వెల్లడించని అదనపు ఆదాయాన్ని వెలల్లడిస్తే, ఆ ఆదాయంపై అదనంగా 25 శాతం పన్ను చెల్లించాలి.
‘క్రిప్టో’లపై పన్ను: ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అన్ని రకాల క్రిప్టో కరెన్సీలపై వచ్చే లాభాలు ఆదాయ పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ లాభాలపై ఇక 30 శాతం పన్ను విధిస్తారు. ఒక క్రిప్టో కరెన్సీ లావాదేవీల్లో వచ్చిన నష్టాలను మరో క్రిప్టో కరెన్సీ లావాదేవీల్లో వచ్చే లాభాలతో సర్దుబాటు చేసుకునేందుకు మాత్రం అనుమతించరు.
‘పీఎ్‌ఫ’పైనా పన్ను పోటు: ఇప్పటి వరకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాల్లో ఎంత జమ చేసినా, అసలు, దానిపై వచ్చే వడ్డీకి పూర్తి పన్ను మినహాయింపు ఉండేది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఇక ఆ పప్పులు ఉడకవు. ఇక ఏటా రూ.2.5 లక్షల వరకే పన్ను మినహాయింపు ఉంటుంది. అంతకు మించి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తే ఆ మొత్తం, దానిపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను పోటు తప్పదు. ఇలా అదనంగా జమ చేసే మొత్తానికి మరో పీఎఫ్ ఖాతా తెరుస్తారు.
పన్నుల్లో మార్పులు: ఇప్పటి వరకు లిస్టెడ్ కంపెనీల షేర్లు, మ్యూచువల్ ఫండ్ పథకాల యూనిట్ల అమ్మకంపై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై గరిష్ఠంగా 15 శాతం సర్‌చార్జీ విధిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అన్ని రకాల ఆస్తులపై వచ్చే దీర్ఘకాలిక లాభాలకు ఈ సర్‌చార్జీ వర్తిస్తుంది.
ఎన్పీఎస్: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ మూలవేతనం, డీఏల్లో 14 శాతం వరకు కొత్త పెన్షన్ పథకం (ఎన్‌పీఎ్‌స)లో పొదుపు చేసి పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకూ ఈ సౌలభ్యం అందుబాటులోకి రానుంది.
వయోవృద్ధులకు ఊరట: ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 75 లేదా అంతకంటే వయసు పైబడిన వయో వృద్ధులకు ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. కొన్ని షరతులకు లోబడి వీరు ఇక ఏటా ఐటీ రిటర్న్‌లు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే దీనికి సంబంధించి వీరు తమ బ్యాంక్‌కు మాత్రం డిక్లరేషన్ ఇవ్వాలి.
కేవైసీ లేకపోతే తిప్పలే: కేవైసీ (నో యువర్ కస్టమర్) వివరాలు పూర్తి చేయని బ్యాంక్ ఖాతాదారులు వెంటనే ఆ పని పూర్తి చేయడం మంచిది. లేకపోతే వీరు తమ ఖాతాల నుంచి నగదు తీసుకోవడం లేదా డిపాజిట్ చేయడంలో తీవ్ర ఆంక్షలు ఎదుర్కోక తప్పదు.
సెక్షన్ 80ఈఈఏకు గుడ్‌బై: రూ.45 లక్షల కంటే తక్కువ ధర ఉండే అందుబాటు ధర గృహాలు కొనేవారికి ఇప్పటి వరకు సెక్షన్ 80ఈఈఏ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉండేది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మినహాయింపు రద్దు చేశారు.
రిటర్న్ ఫైల్ చేయకపోతే అధిక టీడీఎస్: గడువు లోగా తమ ఐటీ రిటర్న్‌లు ఫైల్ చేయని వారికి ఇక తిప్పలే. ఇలాంటి వారికి వచ్చే వడ్డీ, డివిడెండ్ వంటి ఆదాయాలపై ఇక అధిక టీడీఎస్, టీసీఎస్ విధిస్తారు. పీఎఫ్ లేదా జీతం ద్వారా వచ్చే ఆదాయాలకు మాత్రం ఈ పన్ను పోటు ఉండదు.
టీడీఎ్సలో మార్పులు: రూ.50 లక్షలకు మించిన వ్యవసాయేతర స్థిరాస్తుల అమ్మకంపై ఎవరైనా ఒక శాతం టీడీఎ్సగా చెల్లించాలి. ప్రస్తుతం కొనుగోలుదారుడు అమ్మకందారుడికి చెల్లించిన మొత్తం ఆధారంగానే ఈ ఒక శాతం టీడీఎస్ నిర్ణయిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి స్టాంప్ డ్యూటీ లేదా చెల్లించిన మొత్తంలో ఏదో ఒక దాని ఆధారంగా టీడీఎస్ మొత్తాన్ని మినహాయించవచ్చు.
పోస్టాఫీస్ పథకాల వడ్డీ చెల్లింపుల్లో మార్పులు
పోస్టాఫీస్ పొదుపు పథకాలపై చెల్లించే వడ్డీని ఇక నగదు రూపంలో చెల్లించరు. ఈ ఖాతాతో లింక్ అయి ఉన్న ఖాతాదారుల బ్యాంక్ ఖాతాకు లేదా పోస్టాఫీసు ఖాతాకు ఈ వడ్డీని బదిలీ చేస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పోస్టాఫీస్ పొదుపు పథకాల్లో మదు పు చేసిన ఇన్వెస్టర్లు తమ ఖాతాలను, బ్యాంక్ పొదుపు ఖాతాలతో అనుసంధానం చేసుకోవడం మంచిది.