కొత్త భయాలు

ABN , First Publish Date - 2020-04-02T05:57:18+05:30 IST

అనేక దేశాలతో పోల్చితే కరోనా విషయంలో మన పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉన్నదని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మర్కజ్‌ ఉదంతం మనలను భయోత్పాతంలో ముంచెత్తింది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలోని మర్కజ్‌ మసీదులో దేశవిదేశాలకు ...

కొత్త భయాలు

అనేక దేశాలతో పోల్చితే కరోనా విషయంలో మన పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉన్నదని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మర్కజ్‌ ఉదంతం మనలను భయోత్పాతంలో ముంచెత్తింది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలోని మర్కజ్‌ మసీదులో దేశవిదేశాలకు చెందిన వేలాదిమందితో మార్చిలో జరిగిన జమాత్‌ సభ ఇప్పుడు కరోనా వ్యాప్తికి మరో కారణమవుతున్నది. అధికారులు, శానిటైజేషన్‌ సిబ్బంది ముప్పై ఆరుగంటలకు పైగా శ్రమించి మర్కజ్‌ భవనంలో మిగిలివున్న దాదాపు రెండున్నరవేల మందిని ఖాళీచేయించి, భవనాన్ని శుద్ధిచేశారు. కరోనా లక్షణాలున్నట్టుగా అనుమానిస్తున్న ఆరువందలమందిని వివిధ ఆస్పత్రులకు తరలించి, మిగతావారిని క్వారైంటైన్‌లో ఉంచారు. ఈ జమాత్‌లో పాల్గొన్నవారిని గుర్తించి కరోనా వ్యాప్తిని కట్టడిచేసేందుకు ప్రభుత్వాలు అష్టకష్టాలూ పడుతున్నాయి. 


దేశం ప్రమాదం అంచున ఉండగా, తబ్లిగీ జమాత్‌ నిర్వహణ నిర్వాహకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. కరోనా నియంత్రణ దృష్ట్యా ప్రభుత్వం జారీ చేసిన అనేక ఆదేశాలను నిర్వాహకులు పాటించలేదు. యాభైమందికి మించి ఒకచోట గూమిగూడకూడదన్న నియమాన్నీ, భౌతికదూరాన్ని పాటించాలన్న ఆదేశాన్నీ వారు బేఖాతరు చేశారన్నది ఆరోపణ. సమావేశంలో పాల్గొన్నవారిలో వందలాదిమంది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు తరలిపోయి కరోనా వ్యాప్తికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారకులవుతున్నారు. దాదాపు 20దేశాలనుంచి ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చినవారికి, అప్పటికే విదేశాల్లో కరోనా బలంగా ఉన్న నేపథ్యంలో విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించకపోవడం పెద్ద తప్పిదం. మర్కజ్‌ ఓ ప్రబలమైన కొవిడ్‌ హాట్‌స్పాట్‌గా మారడం వెనుక పూర్తిగా నిర్వాహకులనే తప్పుబట్టి ప్రయోజనం లేదు. ఏడాది పొడవునా ఈ సంస్థ ప్రధాన కార్యాలయం జమాత్‌ కార్యకర్తల రాకపోకలతో సందడిగా ఉంటుందన్న విషయాన్ని అటుంచితే, మొన్న జరిగిన సమావేశానికి ఎంతోముందుగానే విదేశీయుల రాకపోకలు నిర్థారణ కావడం, వారిని దేశంలోకి అనుమతించడం జరిగిపోయింది. మార్చి ౧3 వరకూ కూడా కొవిడ్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ కాదని చెబుతూ వచ్చిన భారతదేశం 1౫ వతేదీన కానీ అన్ని వీసాలను రద్దుచేయలేదు. సామూహిక మత ప్రార్థనలు సహా అన్ని సమావేశాలనూ మార్చి 16న కానీ ఢిల్లీ ప్రభుత్వం రద్దుచేయని విషయాన్ని నిర్వాహకులు గుర్తుచేస్తున్నారు. కరోనా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పటికి ఓ సమగ్రమైన వ్యూహం ఏర్పడని మాట వాస్తవం. తమకు ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు రాకపోయినా తమకు తాముగా అతిథుల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నించామని నిర్వాహకుల వాదన. ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నంతకాలం పోగలినవారు పోగా, మిగిలినవారు చిక్కుబడిపోయారని నిర్వాహకులు అంటున్నారు. మర్కజ్‌లో వేలమంది మిగిలే ఉన్నారన్న సమాచారం అందిన వారం తరువాత కూడా అధికారులు రంగంలోకి దిగని విషయమూ తెలుస్తూనే ఉన్నది. నిర్వాహకుల నిర్లక్ష్యాన్నీ, వారి వాదనల్లోని అసత్యాలను అటుంచితే, ఈ సమావేశం విషయంలో పాలనా పరమైన వైఫల్యం కూడా లేకపోలేదు. మర్కజ్‌లో వేలాదిమంది గుమిగూడిన విషయం పోలీసులకు, నిఘా వర్గాలకు తెలియదని అనుకోలేం. మార్చి 16 ఆదేశాలు అక్కడ ఉల్లంఘనకు గురవుతున్నప్పుడు ఢిల్లీ పోలీసులు ఎందుకు ఊరుకున్నారో, మర్కజ్‌ ఖాళీ చేయాలని చెప్పడానికి ఆ తరువాత ఓ వారం ఎందుకు పట్టిందో తెలియదు.  


ఇటీవల పంజాబ్‌కు చెందిన సిక్కుమత బోధకుడు ఒకరు ఇటలీ, జర్మనీ ఇత్యాది దేశాలు పర్యటించి వచ్చి దాదాపు ఇరవై గ్రామాల్లో దాని వ్యాప్తికి, నలభైవేలమంది క్వారంటైన్‌కు కారకుడై తాను మరణించిన విషయం తెలిసిందే. ఇలా ప్రమాదం ఏ రూపంలోనైనా ముంచుకురాచ్చును కనుకనే ముందస్తు వ్యూహాలు ముఖ్యం. మర్కజ్‌ ఘటనను మొత్తం ముస్లిం సమాజానికి కట్టబెట్టి, వారిపై విషం చిమ్మేందుకు కొందరు ప్రయత్నిస్తుండటం విషాదం. జరిగినదానికి ఏవో కుట్రలను కట్టబెట్టి సమాజాన్ని చీల్చడం వల్ల దేశానికి మరింత నష్టం వాటిల్లుతుంది. వయో లింగభేదాలు, కులమతాలకు అతీతంగా దేశం యావత్తూ సంఘటితంగా ఒక ఉమ్మడి శత్రువుమీద పోరాడుతున్న తరుణంలో ఈ రకమైన విభజన యత్నాలు ప్రమాదకరం. మనసులకు కాస్తంత సాంత్వననూ, నమ్మకాన్ని అందించే మతం, సంక్షోభ సమయాల్లో సంఘటిత పోరాటశక్తిని సమకూర్చాలే కానీ, విభజనకు ఉపకరించకూడదు. కల్లోల కాలంలోనూ అర్థంలేని కుట్రసిద్ధాంతాలను ముందుకు తెస్తే అగ్నిపరీక్షలను దాటడం అసాధ్యమైపోతుంది.

Updated Date - 2020-04-02T05:57:18+05:30 IST