పరిశ్రమలపై విద్యుత్‌ పిడుగు

ABN , First Publish Date - 2022-05-15T06:37:33+05:30 IST

సగటు వినియోగదారుడి నుంచి వీలైనన్ని విధాలుగా ఏదో ఒక పేరుతో అదనంగా ఆదాయం రాబట్టుకోవడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది.

పరిశ్రమలపై విద్యుత్‌ పిడుగు

‘ఎలక్ర్టిసిటీ డ్యూటీ’ (ఈడీ)  యూనిట్‌కు ఆరు పైసల నుంచి రూపాయికి పెంపు

ఏప్రిల్‌ నుంచే వసూలు చేస్తామంటూ నోటీసులు

గగ్గోలు పెడుతున్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సగటు వినియోగదారుడి నుంచి వీలైనన్ని విధాలుగా ఏదో ఒక పేరుతో అదనంగా ఆదాయం రాబట్టుకోవడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. తాజాగా విద్యుత్‌ వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న ‘ఎలక్ర్టిసిటీ డ్యూటీ’ (ఈడీ)ని పెంచాలని నిర్ణయించింది. సాధారణ వినియోగదారుల నుంచి కాకుండా పరిశ్రమల నిర్వాహకులు, వ్యాపారుల నుంచి చాలాకాలంగా ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో యూనిట్‌కు ఆరు పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఇదే పేరుతో పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో 14 పైసలు నుంచి రూ.1.80 పైసలు వరకు వసూలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా పెంచాలని నిర్ణయించినట్టు ఇంధన శాఖ పేర్కొంది. వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తున్నామని, అదీ కాకుండా విద్యుత్‌ వ్యయాలు పెరిగిపోయినందున ఈడీ చార్జీలు పెంచక తప్పడం లేదని, దీనికి విద్యుత్‌ నియంత్రణ మండలి కూడా ఆమోదించిందని చెబుతూ ఆరు పైసలను రూపాయికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాలు ఏప్రిల్‌ నెల నుంచే వసూలు చేస్తామని పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు నోటీసులు పంపుతోంది. వాటిని చూసి అంతా గగ్గోలు పెడుతున్నారు. 


తగ్గించమంటే ఇంకా పెంచుతారా?

పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు కరోనా కాలానికి మినిమం డిమాండ్‌ (ఎండీ) చార్జీలు తగ్గిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆ పని చేయలేదని, పైగా ఇప్పుడు ‘ఈడీ’ యూనిట్‌కు రూపాయి చేస్తే తాము ఎక్కడి నుంచి తెచ్చి బిల్లులు కట్టాలని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమలకు యూనిట్‌ ఆరు రూపాయలకే ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటూ మినిమం డిమాండ్‌ చార్జీలు కిలోవాట్‌కు రూ.450 చొప్పున తీసుకుంటున్నారని, దీనివల్ల యూనిట్‌కు అదనంగా మూడు రూపాయలు పడుతోందని ఓ పారిశ్రామికవేత్త వివరించారు. ప్రస్తుతం విశాఖ ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు, వ్యాపారులు అంతా యూనిట్‌కు రూ.9 చొప్పున చెల్లిస్తున్నారని, ఈడీ చార్జీ రూపాయితో కలుపుకొంటే ఇప్పుడు రూ.10 అవుతుందన్నారు. ఇలా విద్యుత్‌ చార్జీలు పెంచుతూ, మరోవైపు సాయంత్రం ఆరు గంటలు దాటితే...50 శాతమే విద్యుత్‌ వినియోగించాలని ఆంక్షలు విధిస్తున్నారని, ఇలాగైతే రాష్ట్రంలో పరిశ్రమలు నడపలేమని చిన్న, మధ్యతరహా పరిశ్రమల యూనియన్‌కు చెందిన ఒక పారిశ్రామికవేత్త ఆవేదన వ్యక్తంచేశారు.

Updated Date - 2022-05-15T06:37:33+05:30 IST