దుబాయ్ వెళ్తున్నారా? అయితే ఇది మీ కోసమే!

ABN , First Publish Date - 2020-10-16T13:30:07+05:30 IST

పర్యాటకులు, విమానయాన సంస్థల కోసం దుబాయ్ గురువారం కొత్త ప్రయాణ మార్గదర్శకాలు జారీ చేసింది. దక్షిణాసియా దేశాల నుండి వచ్చిన చాలా మంది ప్రయాణికులు దేశంలో ప్రవేశానికి కావాల్సిన అర్హతలు లేకవడంతో బుధ, గురువారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.

దుబాయ్ వెళ్తున్నారా? అయితే ఇది మీ కోసమే!

దుబాయ్: పర్యాటకులు, విమానయాన సంస్థల కోసం దుబాయ్ గురువారం కొత్త ప్రయాణ మార్గదర్శకాలు జారీ చేసింది. దక్షిణాసియా దేశాల నుండి వచ్చిన చాలా మంది ప్రయాణికులు దేశంలో ప్రవేశానికి కావాల్సిన అర్హతలు లేకవడంతో బుధ, గురువారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలోనే దుబాయ్ సర్కార్ ఈ కొత్త ప్రయాణ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం... రిటర్న్ టికెట్ లేకుండా విజిట్, టూరిస్ట్ వీసాలపై దుబాయ్‌కు వచ్చే ప్రయాణికులకు దేశంలో ప్రవేశానికి అనుమతి ఉండదు. అలాగే ప్రయాణికుడిని వారి దేశానికి తిరిగి తీసుకువెళ్లడం కోసం విమాన టికెట్ ఖర్చులను విమానయాన సంస్థనే భరించాలి. 


భారతదేశం, పాకిస్తాన్ దౌత్య కార్యకలాపాల మిషన్ గురువారం ఇలా రిటర్న్ టిక్కెట్లు లేకుండా దుబాయ్‌ వచ్చిన సుమారు 300 మందికి పైగా ప్రయాణికులను తిరిగి స్వదేశాలకు పంపించినట్లు ప్రకటించాయి. ఈ కొత్త నిబంధన తెలియక దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ప్రయాణికుల్లో భారత్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్‌కు చెందిన వారు ఉన్నట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. 


దుబాయ్‌లోని భారత కాన్సుల్ ప్రతినిధి నీరజ్ అగర్వాల్ మాట్లాడుతూ... "భారతదేశం నుండి వచ్చిన సుమారు 200 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకున్నారు. వీరిలో గురువారం 140 నుంచి 150 మందిని తిరిగి భారత్‌కు పంపించడం జరిగింది. మరో 45 మంది ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ నిబంధనలను క్లియర్ చేసి యూఏఈలోకి ప్రవేశించగలిగారు. వీరిలో చాలా మంది ఎయిర్ విస్తారా, గోఎయిర్, ఫ్లైదుబాయ్, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌ విమానాల ద్వారా దుబాయ్ రావడం జరిగింది" అని తెలిపారు. దుబాయ్‌లోని పాకిస్తాన్ కాన్సుల్ జనరల్ అహ్మద్ అమ్జాద్ అలీ మాట్లాడుతూ..."గురువారం నుండి సుమారు 169 మందిని స్వదేశానికి పంపించాం. విమానాశ్రయంలో చిక్కుకున్న పాక్ ప్రయాణికులను విమానంలో అందుబాటులో ఉన్న సీట్ల ప్రకారం మేము తిరిగి వారి స్వదేశానికి పంపుతున్నాం." అని తెలిపారు.

Updated Date - 2020-10-16T13:30:07+05:30 IST