చిత్తూరులో వివాదాస్పదంగా మారిన కొత్త జిల్లాల ఏర్పాటు

ABN , First Publish Date - 2020-07-07T14:48:14+05:30 IST

అక్కడ కొత్త జిల్లాల ఏర్పాటు అంశం వివాదాస్పదంగా మారింది. ఘనచరిత్ర కలిగిన తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేయకపోవడం ఏమిటంటూ అక్కడి ప్రజలు రాష్ట్రప్రభుత్వం తీరుపై విరుచుకుపడుతున్నారు. తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేస్తే సరి.. లేకుంటే

చిత్తూరులో వివాదాస్పదంగా మారిన కొత్త జిల్లాల ఏర్పాటు

అక్కడ కొత్త జిల్లాల ఏర్పాటు అంశం వివాదాస్పదంగా మారింది. ఘనచరిత్ర కలిగిన తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేయకపోవడం ఏమిటంటూ అక్కడి ప్రజలు రాష్ట్రప్రభుత్వం తీరుపై విరుచుకుపడుతున్నారు. తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేస్తే సరి.. లేకుంటే వేర్పాటు ఉద్యమం చేస్తామని ప్రజాసంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. అధికార వైసీపీ మినహా మిగతా అన్ని రాజకీయపక్షాలు ఏకతాటిపైకి వస్తున్నాయి. ఇంతకీ ఈ పరిణామాలు ఎక్కడ చోటుచేసుకుంటున్నాయో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే!


ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియతో కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఈ అంశం చిత్తూరు జిల్లా వివాదాస్పదంగా మారింది. జిల్లాలోని మదనపల్లెలో మంటలు రేపింది. ఘనచరిత్ర కలిగిన మదనపల్లెని జిల్లా కేంద్రం చేయకపోవడం ఏమిటని ప్రభుత్వం తీరుపై ఆ ప్రాంతంలోని ప్రజాసంఘాల నాయకులు, వైసీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీల నేతలు భగ్గుమంటున్నారు. అంతేగాక తమకు చాలా దూరంగా ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తూ.. అందులో మదనపల్లెను కలపడాన్ని వారు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంశంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మదనపల్లె వాసులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేస్తే సరి.. లేదంటే కర్ణాటకకు అత్యంత దగ్గరగా ఉన్న తమ ప్రాంతాన్ని ఆ రాష్ట్రంలోనైనా కలపాలని వారు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఈ రెండింటిలో ఏది జరగకున్నా.. వేర్పాటువాద ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. మదనపల్లెలోని ప్రజా సంఘాల నాయకులు, వైసీపీ మినహా అఖిలపక్షం నేతలు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించుకున్నారని సమాచారం.


చిత్తూరు జిల్లాలోని మదనపల్లె రెవిన్యూ డివిజన్ లో మొత్తం 31 మండలాలు, 501 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 7,847.17 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 18.11 లక్షల జనాభా, నాలుగు మునిసిపాలిటీలు, ఆరు శాసనసభ నియోజకవర్గాలను కలిగిన మదనపల్లె.. అతిపెద్ద రెవిన్యూ డివిజన్ గా ప్రత్యేకత పొందింది. అంతేగాక ఈ ప్రాంతానికి ఘనచరిత్ర కూడా ఉంది. క్రీ.శ. 1622లో ఏర్పడినట్టు చోళరాజ్య చరిత్ర తెలుపుతోంది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సంస్కృతుల మేలు కలయికతో మదనపల్లె అన్నింటా ప్రత్యేకతను చాటుకుంటోంది. అప్పటినుంచి ఎందరెందరో పాలనలను చవిచూసి, అనేక ప్రాంతాల్లోకి మార్పులు, చేర్పులు జరిగి ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొన్న మదనపల్లె చివరకు 1911లో ఏర్పడ్డ చిత్తూరు జిల్లా పరిధిలోకి చేరింది. హార్సిలీహిల్స్ వంటి ఎత్తయిన ప్రదేశాలు, చల్లని వాతావరణం, బ్రిటీష్ కాలంలోనే వేసవి విడుదుల ఏర్పాటు, గవర్నర్ బంగ్లా, సబ్ కలెక్టర్ కార్యాలయం, రుషివ్యాలీ లాంటి జాతీయస్థాయి విద్యాసంస్థ మదనపల్లె లో ఉండటం విశేషం. 


ఇక నోబెల్ బహుమతి గ్రహీత రవీంధ్రనాథ్ ఠాగూర్ రచించిన జాతీయగీతాన్ని.. మదనపల్లెలోని బి.టి. కళాశాలలో ఆయనే ఆంగ్ల భాషలోకి అనువదించడం.. ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపునిచ్చింది. అలాగే ఇక్కడ టీబీ వ్యాధి చికిత్సకోసం ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ ఏర్పాటైంది. 150ఏళ్ల చరిత్ర కలిగివున్న కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును కూడా ఇందిరాగాంధీ మదనపల్లెలోనే ప్రకటించారు. దేశంలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ కూడా ఇక్కడ ఉంది. ఐర్లాండ్ దేశస్థురాలు అనిబిసెంట్ మదనపల్లెలోనే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. జిడ్డు క్రిష్టమూర్తి లాంటి తత్వవేత్తలను, మరెందరో స్వాతంత్ర సమరయోధులను, విద్యావేత్తలను, మదనపల్లె అందించింది. మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలను కూడా మదనపల్లె రెవిన్యూ డివిజన్ కు సంబంధించిన వారే. ఇంతటి చరిత్ర, ప్రత్యేకతలు కలిగిన మదనపల్లెను జిల్లా  కేంద్రంగా కాకుండా రాజంపేట పేరుమీద ప్రతిపాదించిన జిల్లాలో కలపడాన్ని మదనపల్లె వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.


నిజానికి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించింది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ చర్యలు తుదిదశకు చేరుకున్నాయి. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సివుంది. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ స్థానాలు చిత్తూరు, తిరుపతి, రాజంపేట పార్లమెంట్ పరిధులలో ఉన్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది కాబట్టి.. చిత్తూరు జిల్లా పరిధిలోకి చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు చేరుతాయి. తిరుపతి జిల్లా పరిధిలోకి ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలతోపాటు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లె, గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలు చేరుతాయి. ఇక రాజంపేట జిల్లా విషయానికి వస్తే కడప జిల్లాలోని రాజంపేట, కోడూరు, రాయచోటిలతోపాటు చిత్తూరు జిల్లాలోని పీలేరు, మదనపల్లె, తంబళ్ళపల్లె, పుంగనూరు నియోజకవర్గాలతో కలిపి రాజంపేట కొత్త జిల్లాలోకి చేరుతున్నాయి.


మొత్తంమీద ఘనచరిత్ర కలిగిన మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయకుండా రాజంపేటలో కలపడం ఏమిటి? అని ప్రశ్నిస్తూ ఆ ప్రాంతవాసులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మదనపల్లె- రాజంపేటకు మధ్య దూరం కూడా చాలా ఉందనీ, అలాంటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందనీ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలనీ, లేదంటే అత్యంత సమీపంలో ఉన్న కర్ణాటకలో కలపాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగేవరకు తాము ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని తేల్చి చెబుతున్నారు. ఇందుకోసం మదనపల్లె ప్రాంతంలోని వైసీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయపార్టీలు, పలు ప్రజాసంఘాలు ఒక్కటయ్యాయి. సమావేశాలు పెట్టుకుని.. ఉద్యమపోరుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మరి మదనపల్లెలో కొత్త జిల్లా అంశంపై రేగిన వివాదం.. మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

Updated Date - 2020-07-07T14:48:14+05:30 IST