అటో.. ఇటో..

ABN , First Publish Date - 2022-01-28T06:11:29+05:30 IST

అటో.. ఇటో..

అటో.. ఇటో..

మచిలీపట్నం కేంద్రమైన కృష్ణాజిల్లాలోకి విజయవాడ విమానాశ్రయం

ఎన్టీఆర్‌ విజయవాడ జిల్లాలోనే ఉంచాలన్న వాదన

సిటీ విస్తరణకు గన్నవరమే కీలకం

దాదాపు ఐటీ సెజ్‌లన్నీ ఇక్కడే..

నిర్ణయం మార్చుకోవాలన్న డిమాండ్‌

పెనమలూరునూ ఎన్టీఆర్‌ విజయవాడలోనే ఉంచాలన్న విజ్ఞప్తులు

పేరుకు విజయవాడ విమానాశ్రయం.. పరిధి మాత్రం మచిలీపట్నం కేంద్రమైన కృష్ణాజిల్లాలో. రాష్ట్ర ప్రభుత్వ తాజా ముసాయిదా నోటిఫికేషన్‌లో తీసుకున్న ఈ నిర్ణయంతో విజయవాడ విస్తరణకు కీలకమైన విమానాశ్రయం కృష్ణాజిల్లాలోకి వెళ్లిపోతుంది. రాష్ట్ర విభజన తర్వాత  నగరానికే కాకుండా అమరావతి రాజధానికి, నవ్యాంధ్రకే తలమానికంగా నిలిచిన ఈ విమానాశ్రయంతో పాటు గన్నవరం, పెనమలూరు ప్రాంతాలనూ ఎన్టీఆర్‌ విజయవాడ జిల్లాలోనే ఉంచాలన్న వాదన వినిపిస్తోంది. 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నాటి బ్రిటీష్‌ పాలకులు అప్పటి విజయవాడ భౌగోళిక పరిస్థితులను చూసి.. విస్తరించటానికి అనువుగా ఉన్న ప్రాంతం కాబట్టి గన్నవరాన్ని విమానాశ్రయ నిర్మాణానికి ఎంచుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధ విమానాల కార్యకలాపాలకు దీనిని  వినియోగించారు. తిరిగి 90వ దశకం నుంచి తన ఉనికిని చాటుకుంటూ దేశంలోని మెట్రోపాలిటన్‌ ఎయిర్‌పోర్టులను తలదన్నేలా తయారైంది. అనంతరం నవ్యాంధ్రకే నెంబర్‌వన్‌ విమానాశ్రయంగా మారింది. విజయవాడ స్థాయిని ప్రపంచ పటంలో ఆవిష్కృతం చేసింది. అలాంటి విమానాశ్రయాన్ని కృష్ణాజిల్లాలో కాకుండా ఎన్టీఆర్‌ విజయవాడ జిల్లాలోనే ఉంచితే బాగుండన్న డిమాండ్‌ వినిపిస్తోంది. 

అభివృద్ధి చెందుతున్న దశలో..

కృష్ణా, గుంటూరు జిల్లాలు అమరావతి రాజఽధాని ప్రాంత పరిధిలో ఉన్నాయి. ఈ రెంటికీ దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయంగా విజయవాడ విమానాశ్రయం ఉంది. గడిచిన కాలంలో రూ.1,800 కోట్లతో అభివృద్ధి చెందింది. ఇంటీరియం టెర్మినల్‌, రోడ్ల విస్తరణ, బ్యూటిఫికేషన్‌, అదనపు పార్కింగ్‌ బేలు, టాక్సీస్టాండ్లు, ఫైర్‌ పైటింగ్‌ వ్యవస్థలు, రన్‌వే విస్తరణ వంటి ఎన్నో పనులు జరిగాయి. కార్గో టెర్మినల్‌, ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ అభివృద్ధి చెందాయి. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల అవసరాల కోసం రూ.611 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులు చేపడుతున్నారు. దీనికి అనుగుణంగా విమానాల పార్కింగ్‌ కోసం ఆప్రాన్‌ను కూడా నిర్మించారు. ఇలాంటి ఎయిర్‌పోర్టు విజయవాడ నగరానికి ఉంటుందనుకుంటే, మచిలీపట్నం కేంద్రంగా కృష్ణాజిల్లాలో కలిపారు. 

సిటీ విస్తరణకు ఆస్కారమేదీ? 

విజయవాడను భవిష్యత్తులో గ్రేటర్‌ సిటీ, అనంతరం మెగాసిటీగా మారే అవకాశాలున్నాయి. ఇటీవల ఇబ్రహీంపట్నం, కొండపల్లి, తాడిగడప మునిసిపాలిటీలను చేశారు. ఇప్పుడు విస్తరణ దృష్టంతా నున్న, కొండపావులూరు, గన్నవరం ప్రాంతాలపై పడింది. విజయవాడలో విలీనం కావటానికి గన్నవరంలోని గ్రామాలు అంగీకార పత్రాలు కూడా ఇచ్చాయి. గన్నవరం ర్యాపిడ్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా పరిధిలోకి వస్తుంది. తాజా జిల్లాల మార్పుతో గన్నవరం మండలాన్ని గుడివాడ ఆర్‌డీవో పరిధిలోకి తీసుకొచ్చారు. గన్నవరం ప్రాంత ప్రజలకు విజయవాడ 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ, 86 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం కలెక్టరేట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

ఐటీ మాటేంటి?

గన్నవరం ఎయిర్‌పోర్టుకు అభిముఖంగానే అనేక ఐటీ కంపెనీలు ఉన్నాయి. హెచ్‌సీఎల్‌తో పాటు మేథ ఐటీ టవర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మచిలీపట్నం జిల్లా పరిధిలోకి వెళ్తాయి. దీంతో కీలకమైన ఐటీ కంపెనీలు ఎన్టీఆర్‌ విజయవాడ జిల్లాలో లేకుండా పోతాయి. 


గన్నవరాన్ని విజయవాడ జిల్లాలోనే ఉంచాలి

హనుమాన్‌ జంక్షన్‌, జనవరి 27 : గన్నవరం నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్‌ విజయవాడ జిల్లాలోనే ఉంచాలని అఖిలపక్ష సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. స్థానిక విజయవాడ రోడ్డులోని లయన్స్‌ క్ల్లబ్‌లో క్లబ్‌ అధ్యక్షుడు నందిగం స్వామి అధ్యక్షతన గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల గోపాల కృష్ణారావు మాట్లాడుతూ గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాలు విజయవాడ కేంద్రానికి దగ్గరగా ఉన్నందున మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటుచేసే కృష్ణాజిల్లాలో కలపడం సహేతుకం కాదన్నారు. బీజేపీ బాపులపాడు మండల అధ్యక్షుడు తోట మురళీధర్‌ మాట్లాడుతూ విజయవాడ కేంద్రానికి దగ్గరగా ఉన్న గన్నవరం నియోజకవర్గాన్ని దాదాపు 80 కిలోమీటర్ల దూరంలోని మచిలీపట్నంలో కలపడం అర్థరహితమన్నారు. రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి గుండపనేని ఉమా వరప్రసాద్‌ మాట్లాడుతూ పరిపాలన వ్యవస్థను ప్రజల వద్దకు తీసుకురావడం కోసం 1987లో నందమూరి తారకరామారావు మండల వ్యవస్థను తెచ్చారని, పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా గన్నవరం నియోజకవర్గాన్ని మచిలీపట్నంలో చేర్చడం సహేతుకం కాదన్నారు. వైసీపీ మండల కన్వీనర్‌ అవిర్నేని శేషగిరిరావు మాట్లాడుతూ జిల్లాను రెండుగా విభజించడాన్ని తాము స్వాగతిస్తున్నామని, గన్నవరం నియోజకవర్గాన్ని విజయవాడ కేంద్రంగా చేసే జిల్లాలో కలపడానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు చలమలశెట్టి రమేశ్‌బాబు, కాంగ్రెస్‌ మండల నాయకులు పడకల శ్రీనివాసరావు, టీడీపీ హనుమాన్‌ జంక్షన్‌ పట్టణ అధ్యక్షుడు అట్లూరి శ్రీనివాసరావు, విశ్రాంత ఉపాధ్యాయుడు అక్కినేని రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 





Updated Date - 2022-01-28T06:11:29+05:30 IST