మత్తులో కొత్త జిల్లా

ABN , First Publish Date - 2022-05-23T05:58:51+05:30 IST

పల్లెలు మత్తులో జోగుతున్నాయి. గ్రామ ఆర్థిక వ్యవస్థను నాటు సారా ప్రభావితం చేస్తోంది.

మత్తులో కొత్త జిల్లా
సంజామలలో సారా ఊటను ధ్వంసం చేస్తున్న పోలీసులు (ఫైల్‌)

పల్లెల్లో పారుతున్న సారా

పట్టణాలకూ చేరిన వ్యాపారం

అడవుల్లో యథేచ్ఛగా తయారీ

నాయకుల అండదండలతో ఆగని దందా

నెలన్నరలో 398 కేసులు


పల్లెలు మత్తులో జోగుతున్నాయి.  గ్రామ  ఆర్థిక వ్యవస్థను నాటు సారా ప్రభావితం చేస్తోంది. విచ్చలవిడి సారా విక్రయాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. నంద్యాల జిల్లా ఏర్పడిన నెలన్నర కాలంలో సారా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. కొంతమంది నాయకులు సారా వ్యాపారం వెనుక ఉన్నారనే ఆరోపణలూ ఉన్నాయి. జిల్లాలో ఇప్పటికి దాదాపు 398 కేసులు నమోదయ్యాయి. ఇది చాలు గ్రామాల్లో సారాజ్యం ఎలా ఉందో అర్థం చేసుకోడానికి. కేసులు నామమాత్రమేనని...కఠినమైన చర్యలు లేకనే నాటు ఏరులై పారుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


నంద్యాల, ఆంధ్రజ్యోతి: నంద్యాల జిల్లాలోని పల్లెల్లో నాటు సారా వ్యాపారం ముమ్మరంగా సాగుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా సారా విక్రయాలు జోరుగా ఉండేవి. కొత్త జిల్లాలోనూ అదే తీరు సాగుతోంది. పోలీసులు దాడులు చేస్తున్నామని అంటున్నారు. కానీ సారా తయారీ, విక్రయాలు అదుపులోకి రావడం లేదు. పోలీసుల చర్యలు నామ మాత్రంగా ఉండిపోయాయనే విమర్శలు ఉన్నాయి. 


కేసులు పెడుతున్నా..


కొత్త జిల్లా ఏర్పడ్డాక సారా తయారీదారులపైన పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 4 నుంచి మే 20వ తేదీ వరకు 398 కేసులు నమోదయ్యాయి. 532 మందిని అదుపులోకి తీసుకున్నారు. 1.92 లక్షల లీటర్ల బెల్లం ఊటను, 11 వేల లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. సారాను తరలిస్తున్న 31 వాహనాలను సీజ్‌ చేశారు. తయారు చేస్తున్నారనే ఆరోపణలపై ఏప్రిల్‌ 26న ముగ్గురిపై, మే 20న మరో నలుగురిపై పీడీ యాక్టు నమోదు చేశారు. ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నా సారా వ్యాపారం జిల్లాలో ఏ మాత్రం తగ్గడం లేదు. దొరికిన వారు దొరుకుతున్నా, మిగిలిన వారు అమ్మకాలు కొనసాగిస్తున్నారు.


పట్టణాలకు విస్తరించి..


ఒకపుడు గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాలకే పరిమితమైన నాటు సారా అమ్మకాలు ఇప్పుడు పట్టణాలకూ పాకాయి. గతంలో చీప్‌ లిక్కర్‌ తాగే వారంతా ఇపుడు నాటు సారా వైపు చూస్తున్నారు. జిల్లాలో మద్యం అమ్మకాలకు దీటుగా సారా అమ్మకాలు సాగుతున్నాయి. గతంలో 50ఎంఎల్‌, 100ఎంఎల్‌, 200ఎంఎల్‌ ప్యాకెట్లను రూ.10, రూ.20, రూ.30 చొప్పున అమ్మకాలు జరిపేవారు. ప్రస్తుతం 250ఎంఎల్‌, అర లీటరు, లీటరు ప్యాకెట్లు, మందు సీసాల్లో విక్రయిస్తున్నారు. లీటరు సారా రూ.300  వరకు ధర పలుకుతోంది. పట్టణ ప్రాంతాల్లో యువత సైతం లీటరు బాటిల్‌లో సారా కొని కూల్‌డ్రింక్‌లలో కలుపుకుని తాగుతున్నారు. గ్రామాల్లో రాత్రయితే చాలు వ్యాపారం ఊపందుకుంటోంది. బ్రాందీ షాపులు లేని గ్రామాల్లో ఉదయం నుంచే అమ్మకాలు జరుగుతున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారంగా ఇది మారిపోయింది. కొంత మందికి ఇది కుటీర పరిశ్రమగా మారిపోయింది. సారా వ్యాపారంలో కొందరు ముఠాలుగా ఏర్పడి దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. నాయకుల అండదండలతో సారాను సరిహద్దులు దాటించి విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారు. 


మత్తు పదార్థాలు కలిపి..


సాధారణంగా నాటుసారాను నల్లబెల్లం, తెల్ల తుమ్మ, కుళ్లినపండ్లతో తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్ప పువ్వును కూడా వాడతారు. అయితే వాటితో మత్తు తక్కువగా ఉంటుంది. అందుకని ప్రమాదకర మత్తుమందులను కలుపుతున్నారు. ఆల్ఫాజోలం, డైజోఫాం వంటి మత్తు పదార్థాలతో పాటు, పొలాలకు చల్లే యూరియా వంటివి కలుపుతున్నట్లు సమాచారం. వీటిని తాగడం వల్ల శరీరంలోని లివర్‌, కిడ్నీ దెబ్బతింటాయి. ప్రాణాలు పోయే ప్రమాదం ఏర్పడుతుంది. జిల్లాలో సారా మరణాలు ఉన్నా కేసులు నమోదు కాకపోవడం వల్ల వెలుగులోకి రాలేదన్న ఆరోపణలున్నాయి.


అక్కడైతే ఎవరికీ తెలియదని..


సారాని తయారు చేయడం ఒక పెద్ద తతంగం. స్థలం కూడా ఎక్కువ కావాలి. అందువల్ల తయారీదారులు అడవిని తమ స్థావరాలుగా మార్చుకుంటున్నారు. ఆత్మకూరు, నందికొట్కూరు, బండి ఆత్మకూరు, మహానంది, వెలుగోడు, గడివేముల, రుద్రవరం, ఆళ్లగడ్డ, చాగలమర్రి మండలాల్లోని నల్లమల అటవీ ప్రాంతం, తండాల్లో సారా తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. ఇక్కడకి పోలీసు వాహనాలు వెళ్లలేని పరిస్థితి. దీనికి తోడు అటవీ ప్రాంతం ఆనుపానులు అన్నీ సారా తయారీదారులకు తెలిసి ఉండటం వల్ల లోతట్టు ప్రాంతాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో పోలీసుల రాకను ముందుగానే గుర్తించి అక్కడి నుంచి పారిపోతున్నారు. పోలీసులకు బెల్లం ఊటలు, సారా మాత్రమే దొరుకుతున్నాయి. తప్పించుకున్న వారు స్థావరం మార్చి మళ్లీ యథారీతిగా సారా తయారు చేస్తున్నారు. 


అండదండలతోనే..


సారా విక్రయాల విషయం ఎక్సైజ్‌, పోలీసు శాఖకు సమాచారం ఉన్నా తయారీదారులపై పూర్తిస్థాయిలో దాడులు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఉన్నతాధికారుల నుంచి దాడులు చేయాలని ఆదేశాలు వస్తే ఆ సమాచారం సారా వ్యాపారులకు ముందుగానే తెలిసిపోతోందనే విమర్శలు ఉన్నాయి. నామమాత్రంగా బట్టీలను పగలగొట్టి, దాడులు చేసినట్లు చూపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సారా తయారీదారులకు, వ్యాపారులకు నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడుల్లో ఎవరైనా పట్టుపడితే పోలీసులకు నాయకులు ఫోన్‌ చేసి మనవాడే వదిలేయండంటూ  ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీని వల్ల నంద్యాల కొత్త జిల్లాలోని పల్లెలు నిత్యం మత్తుతో జోగుతున్నాయి. 

Updated Date - 2022-05-23T05:58:51+05:30 IST