ముచ్చటగా.. మూడు

ABN , First Publish Date - 2022-01-26T05:30:00+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాజపత్రాన్ని ప్రచురించింది. ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తూ నోటిఫికేషన్లు విడుదల చేసింది.

ముచ్చటగా.. మూడు

కొత్త జిల్లాల రాజపత్రం ప్రచురణ

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలుగా విభజన

జిల్లా కేంద్రాలుగా గుంటూరు, నరసరావుపేట, బాపట్ల

అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరణకు 30 రోజుల గడువు

వేగవంతంగా ప్రభుత్వ కార్యాలయాలు, సిబ్బంది విభజనకు కసరత్తు 


 

గుంటూరు జిల్లా నైసర్గీక స్వరూపం..

గుంటూరు కేంద్రంగా ఏర్పాటయ్యే గుంటూరు జిల్లాలో రెవెన్యూ డివిజన్లుగా గుంటూరు, తెనాలి ఉంటాయి. తాడికొండ, తుళ్లూరు, ఫిరంగిపురం, మేడికొండూరు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, పెదకాకాని మండలాలు గుంటూరు డివిజన్‌లో ఉంటాయి. తెనాలి డివిజన్‌లో తెనాలి, కొల్లిపర, పొన్నూరు, చేబ్రోలు, దుగ్గిరాల, కాకుమానుతో పాటు గతంలో గుంటూరు డివిజన్‌లో ఉన్న మంగళగిరి, తాడేపల్లి మండలాలు ఉంటాయి.  


జిల్లా కేంద్రం : గుంటూరు 

- నియోజకవర్గాలు : 7 (తాడికొండ, 

- గుంటూరు పశ్చిమ, తూర్పు, పొన్నూరు, 

 ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి)

- రెవెన్యూ డివిజన్లు : గుంటూరు (10) తెనాలి (8)

- మొత్తం మండలాలు : 18

- వైశాల్యం : 2,443చ.కి.మీ

- జనాభా : 20.91 లక్షలు 

==================

బాపట్ల జిల్లా స్వరూపం

బాపట్ల జిల్లాలో కొత్తగా బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. బాపట్ల రెవెన్యూ డివిజన్‌లో గతంలో తెనాలి డివిజన్‌లో ఉన్న వేమూరు, కొల్లూరు, చుండూరు, భట్టిప్రోలు, అమర్తలూరు, రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాలను చేర్చారు. చీరాల డివిజన్‌లో గతంలో ఒంగోలు డివిజన్‌లో ఉన్న చీరాల, వేటపాలెం, అద్దంకి, జే పంగులూరు, సంతమాగులూరు, బల్లికురవ, కొరిశపాడు, పర్చూరు, యద్ధనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు ఉంటాయి.  

జిల్లా కేంద్రం : బాపట్ల

- నియోజకవర్గాలు : 6  ( వేమూరు, రేపల్లె,

  బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల)

- రెవెన్యూ డివిజన్లు : కొత్తగా బాపట్ల  (12)  

- కొత్తగా చీరాల (13)

- మొత్తం మండలాలు : 25

- వైశాల్యం : 3.829 చ.కి.మీ

- జనాభా : 15.87 లక్షలు 

పల్నాడు జిల్లా స్వరూపం

పల్నాడు జిల్లాలో గురజాల, నరసరావుపేట రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. గురజాల డివిజన్‌లో గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం, మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడితో పాటు గతంలో గుంటూరు రెవెన్యూ డివిజన్‌లో ఉన్న పెదకూరపాడు, బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు, అమరావతిని చేర్చారు. నరసరావుపేట డివిజన్‌లో నకరికల్లు, చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు, నరసరావుపేట, రొంపిచర్ల, వినుకొండ, బొల్లాపల్లి, నూజెండ్ల, శావల్యాపురం, ఈపూరుతో పాటు గతంలో గుంటూరు డివిజన్‌లో ఉన్న సత్తెనపల్లి, రాజుపాలెం, ముప్పాళ్లని చేర్చారు.  


జిల్లా కేంద్రం : నరసరావుపేట

- నియోజకవర్గాలు : 7  (గురజాల, మాచర్ల, 

 చిలకలూరిపేట, పెదకూరపాడు, 

 నరసరావుపేట,వినుకొండ, సత్తెనపల్లి

-  రెవెన్యూ డివిజన్లు : గురజాల  (14)  

- నరసరావుపేట (14)

- మొత్తం మండలాలు : 28

- వైశాల్యం : 7,298 చ.కి.మీ

- జనాభా :  20.42 లక్షలు


వ్యాపార, విద్యా కేంద్రంగా.. మిర్చి ఘాటుకు మారుపేరుగా ఉన్న గుంటూరు ముచ్చటగా మూడు జిల్లాలుగా మారింది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న గుంటూరు సీమ బ్రిటీష్‌ వారి హయాంలో కలెక్టర్ల పాలనతో గుంటూరు ప్రత్యేక జిల్లా హోదా పొందింది. ఆ సమయంలో జిల్లాలో 14 తాలూకాలు ఉండేవి. ఆ తర్వాత 1904 అక్టోబరు 1న గుంటూరు ప్రాంతాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు.  ఆ తర్వాత 21 తాలూకాలుగా ఉన్న గుంటూరు జిల్లా 1985లో ఏర్పడిన మాండలిక వ్యవస్థలో 57 మండలాలుగా ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో జిల్లా పరిధిలో మూడు లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. ఆ ప్రకారం మూడు జిల్లాలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గజిట్‌ విడుదల చేసింది. దీంతో ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న గుంటూరు జిల్లా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలుగా మారింది. 


గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, జనవరి 26(ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాజపత్రాన్ని ప్రచురించింది. ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తూ నోటిఫికేషన్లు విడుదల చేసింది. గుంటూరు జిల్లాను గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలుగా చేస్తూ గజిట్‌ పబ్లికేషన్‌ చేసింది. జిల్లాలకు హెడ్‌క్వార్టర్స్‌లని కూడా నిర్ణయించింది. గుంటూరు జిల్లాకు గుంటూరు నగరం, బాపట్ల జిల్లాకు బాపట్ల, పల్నాడు జిల్లాకు నరసరావుపేటలను జిల్లా కేంద్రాలు ఖరారు చేసింది. గజిట్‌ నోటిఫికేషన్లు ప్రచురించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం స్థానిక ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. తెలుగు, ఇంగ్లీషు భాషలలో వాటిని అందజేయాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. 30 రోజుల వరకు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తామని ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి గజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, సిబ్బంది విభజనకు కసరత్తు వేగవంతం చేశారు. వైశాల్యం, జనాభా ప్రకారం చూసుకుంటే మూడు జిల్లాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. వైశాల్యంపరంగా కొత్తగా ఏర్పడే గుంటూరు జిల్లా చిన్నది అయినప్పటికీ జనాభా సంఖ్య ప్రకారం చూసుకొంటే అత్యధికంగా ఉన్నది. ఇందుకు కారణం అత్యంత జనసాంద్రత కలిగిన గుంటూరు నగరం ఉండటమే. మరోవైపు గుంటూరు కంటే ఎక్కువ వైశాల్యం ఉన్నప్పటికీ బాపట్ల జిల్లాలో జనాభా సంఖ్య గుంటూరు కంటే 5 లక్షల తక్కువే.  నరసరావుపేట జిల్లా అత్యధిక వైశాల్యం కలిగి గుంటూరు జిల్లాతో సమానంగా జనాభాని కలిగి ఉంటుంది. బాపట్ల జిల్లాకు ప్రకాశం జిల్లా ఉద్యోగులు సగం శాతం పైగా విభజించాల్సి ఉంటుంది. కార్యాలయాల పరంగా చూసుకొంటే గుంటూరు జిల్లాకు సకల మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఇందుకు కారణం కలెక్టరేట్‌తో పాటు జిల్లా స్థాయి కార్యాలయాలు ఇక్కడ ఉండటమే. నరసరావుపేట, బాపట్ల జిల్లాలకు ఆ సౌకర్యాలు మాత్రం అంతగా లేవు. నరసరావుపేటకు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఉన్నది. బాపట్లకు అది కూడా లేదు. ఈ దృష్ట్యా బాపట్ల జిల్లాలో పెద్దఎత్తున ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇదేవిధంగా నరసరావుపేటలోనూ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి.  


రెండు డివిజన్లలో.. రాజధాని

గజిబిజిగా రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలు

అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు


కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెవెన్యూ డివిజన్లలో గజిబిజి గందరగోళం నెలకొన్నది. అమరావతి రాజధాని గుంటూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్నది. కాగా కొత్తగా ప్రతిపాదించిన గుంటూరు, తెనాలి రెవెన్యూ డివిజన్లలోకి అమరావతిని చేర్చారు. తుళ్లూరు మండలం గుంటూరు డివిజన్‌లో ఉండగా మంగళగిరి, తాడేపల్లిని తెనాలి డివిజన్‌లో పడేశారు. ఈ నేపథ్యంలో ఆయా మండలాల ప్రజలు రెవెన్యూ సంబంధించి ఏ సమస్య వచ్చినా తెనాలి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని రాజధాని ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నారు. బాపట్ల జిల్లాలోని బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్‌ ప్రజల పరిస్థితి కూడా ఇలానే ఉన్నది. ప్రస్తుతం ఒంగోలు డివిజన్‌లో ఉన్న చీరాల, వేటపాలెం, అద్దంకి, జేపంగులూరు, సంతమాగులూరు, బల్లికురవ, కొరిశపాడు, పర్చూరు, యద్ధనపూడి, కారంపూడి, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరుని చీరాల రెవెన్యూ డివిజన్‌లో చేర్చారు. మార్టూరు చూడబోతే చిలకలూరిపేటకు సమీపంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు ఏ సమస్య వచ్చినా చీరాల/బాపట్లకి వెళ్లాలి.     పల్నాడు జిల్లాలోని గురజాల డివిజన్‌లోకి ప్రస్తుతం గుంటూరులో ఉన్న పెదకూరపాడు, బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు, అమరావతిని చేర్చారు. ఈ నేపథ్యంలో అమరావతి నుంచి గురజాల వెళ్లాలంటే 100 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. ప్రస్తుతం అమరావతి ప్రాంత ప్రజలకు గుంటూరు డివిజన్‌ కేంద్రం కేవలం 35 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. దీనిపై ఆ ప్రాంత ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అచ్చంపేట ప్రాంత ప్రజలకు కూడా ఇదే పరిస్థితి. పెదకూరపాడు నుంచి గురజాల వెళ్లాలన్నా రెండు గంటలకు పైగా 84.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రెవెన్యూ డివిజన్లపై ఆ పరిధిలోని మండలాల ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి.  పల్నాడు జిల్లాకు పిడుగురాళ్ల/గురజాల కేంద్రంగా ఉండాలని ఆ ప్రాంత నాయకులు కోరుతున్నారు. ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఈ విషయంపై ఇప్పటికే అభ్యంతరం తెలిపారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పల్నాడు హెడ్‌క్వార్టర్స్‌ నరసరావుపేటలోనే ఉండాలని కోరుతున్నారు. 

  

పల్నాడుకి మహర్దశ

పల్నాడు జిల్లాతో వెనుకబడిన పల్నాడు ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. ఎన్నో ఏళ్ళుగా పల్నాడును జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రజల కల ఎట్టకేలకు ప్రభుత్వం సాకారం చేసింది. జిల్లా ఏర్పాటులో భాగంగా గతంలోనే పిడుగురాళ్లలో వైద్య కళాళాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక సంస్కృతి, సంప్రదాయాలకు, పౌరుషానికి పల్నాడు ప్రతీక. రాజకీయాలలో కూడా ఓ విశిష్టమైన స్థానాన్ని సంతరించుకుంది. ఉమ్మడి రాష్ట్రానికి ముగ్గురు ముఖ్య మంత్రులు    కాసు బ్రహ్మానందరెడ్డి, నేదురుమల్లి జనార్థనరెడ్డి, కొణిజేటి రోశయ్య ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించారు.    జిల్లా కేంద్రం గుంటూరు అయినా రాజకీయాలకు నరసరావుపేట కేంద్రంగా భాసిల్లింది. నాగార్జున సాగర్‌ జలాశయం నిర్మాణంతో పల్నాడు ప్రజల జీవన విధానంలో మార్పు వచ్చింది. ఇక్కడ పండించే బీపీటీ వరికి మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలలో కూడా మంచి గిరాకీ ఉంది. దాన్యాగారంగా వెలుగొందుతున్న పల్నాడు పత్తి, మిరప పంటల సాగుకు ప్రసిద్ధి చెందింది. నాగార్జున సాగర్‌, అమరావతి, కోటప్పకొండ, చేజర్ల, గుత్తికొండ బిళంలు పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. మాచర్లలోని చెన్నకేశవస్వామి ఆలయం పల్నాటి చరిత్రకు కేంద్రంగా ఉంది. చిలకలూరిపేట నియోజకవర్గం పరిశ్రమల ఖిల్లాగా వెలుగొందుతున్నది. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ళ ప్రాంతం సున్నపు రాయి పరిశ్రమలు నెలకొల్పారు. కోహినూరు వజ్రానికి పల్నాడు పుట్టినిల్లు. నక్సల్స్‌ ఉద్యమానికి గుత్తికొండ బిళం వేదికగా నిలిచింది. సాగర్‌ జలాశయం, మధ్యలో ఉన్న నాగార్జున కొండ, అమరావతిలో బౌద్ధ కేంద్రాలు ఉన్నాయి. ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర సన్నిధి అధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్నది.  

  

బాపట్ల జిల్లా.. భవితకు ఖిల్లా 

బాపట్ల జిల్లాతో పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజల భవితకు బంగారుబాటలుగా మారునున్నాయి. బాపట్లలో జిల్లా కేంద్రానికి తగిన విధంగా అభివృద్ధి పనులకు రెండున్నరేళ్లుగా అంకురార్పణ చేశారు.  సముద్రతీరంలో రేపల్లె, బాపట్ల, చీరాల నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. ఆక్వాపరిశ్రమలు పెద్దఎత్తున అభివృద్ధి చెందుతున్నాయి. రూ.కోట్ల విదేశీ మారకద్రవ్యం వస్తుంది. ఇప్పటికే బాపట్ల పట్టణం విద్యాకేంద్రంగా విరాజిల్లుతుంది. బాపట్లలో వ్వసాయ కళాశాల, వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల, ఆహారవిజ్ఞాన సాంకేతిక కళాశాలలతోపాటు బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీ పరిధిలో బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాల, బాపట్ల మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల, బీఫార్మసీ కళాశాల, పాలిటెక్నిక్‌ కళాశాల, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, పబ్లిక్‌స్కూల్‌, జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఎంతో ప్రాముఖ్యం ఉన్న వేదపాఠశాలలు బాపట్లలో, వెదుళ్ళపల్లిలో ఉన్నాయి. సూర్యలంకలో కేంద్రీయ విద్యాలయం కూడా ఉంది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న సూర్యలంక సముద్రతీరం బాపట్ల జిల్లాలోనే ఉంది. నిజాంపట్నం హార్బర్‌, చీరాలలోని ఓడరేవు కూడా ఈ జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెంది ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు వేలాది ఎకరాల ఆసైన్డ్‌భూములు కూడా ఈ ప్రాంతాలలో ఉన్నాయి. ఎన్నో  అభివృద్ధి పనులతో పాటు సుమారు 55 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్‌ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 400 ఎకరాల్లోని బాపట్ల వ్యవసాయ కళాశాలలో యూనివర్సిటీ ఏర్పాటుకు డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి కృషి చేస్తున్నారు. 

 

Updated Date - 2022-01-26T05:30:00+05:30 IST