ఇండోర్‌లో ఏడుగురికి కొత్త డెల్టా వేరియంట్‌

ABN , First Publish Date - 2021-10-25T06:24:21+05:30 IST

బ్రిటన్‌లో దడపుట్టిస్తున్న కొత్త డెల్టా కరోనా వేరియంట్‌ ‘ఏవై.4’కు సంబంధించిన కేసులు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోనూ బయటపడ్డాయి.

ఇండోర్‌లో ఏడుగురికి కొత్త డెల్టా వేరియంట్‌

యాక్టివ్‌ కేసులు తగ్గుముఖం, 1,72,594కు చేరిక 

న్యూఢిల్లీ, అక్టోబరు 24 : బ్రిటన్‌లో దడపుట్టిస్తున్న కొత్త డెల్టా కరోనా వేరియంట్‌ ‘ఏవై.4’కు సంబంధించిన కేసులు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోనూ బయటపడ్డాయి. దీని వల్ల ఏడుగురికి కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ సోకినట్లు గుర్తించగా, వారిలో ఇద్దరు ఆర్మీ అధికారులు ఉన్నారు. సెప్టెంబరులో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన శాంపిళ్లను నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) శాస్త్రవేత్తలు జన్యు విశ్లేషణ చేయగా ఈవిషయం వెల్లడైంది. మహారాష్ట్ర నుంచి సేకరించిన శాంపిళ్లలో 1 శాతం మేర ‘ఏవై.4’ వేరియంట్‌ కేసులే ఉన్నట్లు గుర్తించారు. ‘‘ఏవై.4 అనేది డెల్టా కరోనా వేరియంట్లలో ఒక ఉపజాతి. అది డెల్టా కాదు.. డెల్టా ప్లస్‌ కాదు’’ అని ఇండోర్‌కు చెందిన వైద్య నిపుణులు స్పష్టంచేశారు. ప్రస్తుతానికి ఇది ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’ జాబితాలోనే ఉన్నందున పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జికా వైరస్‌ తొలి కేసు వెలుగుచూసింది. సైన్యంలో వారెంట్‌ ఆఫీసర్‌గా పనిచేసే ఓ 57 ఏళ్ల వ్యక్తిలో ఈ ఇన్ఫెక్షన్‌ను గుర్తించారు.


ఈనేపథ్యంలో బాధితుడితో సన్నిహితంగా మెలిగిన వారందరిని ఐసొలేట్‌ చేశారు. ప్రభుత్వ వైద్య నిపుణుల బృందం ఢిల్లీ నుంచి కాన్పూర్‌కు వెళ్లి వారి నుంచి శాంపిళ్లను సేకరించి, పరీక్షల నిమిత్తం పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపింది. ఇక దేశంలో 15,906 కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.41 కోట్లు దాటింది. ఈనేపథ్యంలో యాక్టివ్‌ కొవిడ్‌ కేసుల సంఖ్య కూడా తగ్గి 1,72,594కు చేరింది. కాగా, భారత్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేగాన్ని పుంజుకుంది. తాజాగా 100 కోట్ల టీకా డోసుల మైలురాయిని కూడా అధిగమించాం.

Updated Date - 2021-10-25T06:24:21+05:30 IST