విద్యార్థులతో హోలీ జరుపుకున్న ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2022-03-18T19:50:26+05:30 IST

భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విద్యార్థులతో హోలీ జరుపుకున్నారు.

విద్యార్థులతో హోలీ జరుపుకున్న ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విద్యార్థులతో హోలీ జరుపుకున్నారు. ఢిల్లీలోని ఐదు కార్పొరేషన్ పాఠశాలల నుంచి విద్యార్థులు ఆయన కార్యాలయానికి వచ్చారు. కార్యాలయ సిబ్బందితో కలిసి వెంకయ్యనాయుడు హోలీ పండగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు దేశభక్తి పాటలు పాడారు. మరికొందరు కథలు చెప్పారు. దాదాపు గంటసేపు వారితో ఉపరాష్ట్రపతి ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి ‘మీరు ఎప్పుడైనా నిరాశకు గురయ్యారా?’ అని వెంకయ్యను అడగగా.. ‘నేనెప్పుడూ నిరాశ చెందలేదు. కానీ కొన్నిసార్లు పార్లమెంటులో కొందరు సభ్యుల ప్రవర్తన కారణంగా ఆవేదన చెందాను’ అని ఆయన తెలిపారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు అహరహం పాటుపడిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ తనకు స్ఫూర్తి అని ఉపరాష్ట్రపతి అన్నారు.


విధి నిర్వహణను, కుటుంబ బాధ్యతలను ఎలా సమన్వయం చేసుకుంటారని మరో విద్యార్థి ఉపరాష్ట్రపతిని అడగగా.. ‘క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత కుటుంబసభ్యులతో కొంత సమయం గడుపుతున్నాను. ఇప్పటికీ నేను చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన విధులెన్నో ఉన్నప్పటికీ.. నా మనవడు, మనవరాళ్లతో తరచుగా మాట్లాడుతూ ఉంటాను’ అని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు మాతృభూమిని, మాతృభాషను విస్మరించవద్దని, దేశ భద్రత, సమగ్రత, ఐకమత్యం కోసం పనిచేయాలని విద్యార్థులకు సూచించారు. మనకున్నదాన్ని ఇతరులతో పంచుకోవడమే భారతీయ సంస్కృతి అన్నారు. వీలున్నప్పుడు మన సంప్రదాయ దుస్తులు ధరించేందుకు ఏమాత్రం సంకోచించవద్దని చిన్నారులకు సూచించారు. హోలీ సందర్భంగా మనుమరాలు నిహారిక, రవితేజలతో, తన వ్యక్తిగత సహాయ బృందంతో కలిసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పంక్తి భోజనం చేశారు.

Updated Date - 2022-03-18T19:50:26+05:30 IST