3 రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు మినహాయింపు.. నేటి నుంచి అమల్లోకి
అసోంలో 60% జిల్లాల్లో చట్టం వర్తించదు
నాగాలాండ్‌లోని 7 జిల్లాలు, మణిపూర్‌లోని 6 జిల్లాల ప్రజలకు ఊరట
సాధారణ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
న్యూఢిల్లీ, మార్చి 31: ఈశాన్య రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారిన సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్ఎస్పీఏ) అమలయ్యే కల్లోలిత ప్రాంతాల పరిధిని మూడు రాష్ట్రాల్లో కుదించారు. ఏపిల్ర్ 1 నుంచి నాగాలాండ్, అసోం, మణిపూర్‌లలోని కొన్ని ప్రాంతాల్లో ఈ చట్టం వర్తించదు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గురువారం ట్విటర్లో ఒక ప్రకటన చేశారు. నాగాలాండ్‌లో గత డిసెంబరులో సైనికులు జరిపిన కాల్పుల్లో 14 మంది సాధారణ పౌరులు మరణించారు. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తేసే విషయాన్ని పరిశీలించేందుకు కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రం 3 రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను చట్టం పరిధి నుంచి మినహాయించింది.
ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడం, పలు తీవ్రవాద సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ఆయుధాలతో లొంగిపోవడం, శాంతి భద్రతల పరిస్థితి మెరుగు పడటం వల్ల వాటిని చట్టం పరిధి నుంచి మినహాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు హోంమంత్రి తెలిపారు. గత కొద్ది సంవత్సరాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో 7000 మంది తీవ్రవాదులు లొంగిపోయారు. 2014తో పోలిస్తే హింసాత్మక సంఘటనలు 74 శాతం తగ్గిపోయాయి. ఈ చట్టాన్ని ఉపసంహరించాలని ఈశాన్య రాష్ట్రాల్లోనూ, జమ్మూ కశ్మీరులోనూ భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. మణిపూర్‌కు చెందిన ఇరోమ్ చాను షర్మిల 16 ఏళ్లపాటు నిరవధిక నిరాహారదీక్ష చేసింది. త్రిపురలో 2015లో, మేఘాలయలో 2018లో ఈ చట్టాన్ని పూర్తిగా ఎత్తేశారు.
1990 నుంచి అసోం మొత్తం ఈ చట్టం కింద కల్లోలిత ప్రాంతంగా ఉంది. తాజా నిర్ణయంతో 23 జిల్లాల్లో పూర్తిగా, ఒక జిల్లాలో పాక్షికంగా చట్టం అమలును నిలిపేస్తున్నారు. మణిపూర్‌లో రాజధాని ఇంపాల్ మున్సిపాలిటీ తప్ప మిగతా రాష్ట్రమంతా 2004 నుంచి సాయుధ ద ళాల ప్రత్యేక అధికారాల చట్టం పరిధిలో ఉంది. తాజా నిర్ణయంతో ఆరు జిల్లాల్లోని 15 పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రా మాలు ప్రత్యేక చట్టం అమలు కాదు. అరుణాచల్ ప్రదేశ్‌లో 2015 నుంచి మూడు జిల్లాల్లో పూర్తిగా, తొమ్మిది జిల్లాల్లోని 16 పోలీస్ స్టేషన్ల పరిధిలో పాక్షికంగా, అసోం సరిహద్దుల్లోని 20 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ప్రత్యేక చట్టం అమల్లో ఉంది. ప్రస్తుతం కేవలం 3 జిల్లాల్లో, నాలుగో జిల్లాలోని రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో కల్లోలిత ప్రాంతంగా పరిగణిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
1995 నుంచి నాగాలాండ్‌లోని అన్ని జిల్లాలు ఈ చట్టం పరిధిలో ఉన్నాయి. నాగాలాండ్ జిల్లాలను దశల వారీగా చట్టం పరిధి నుంచి తప్పించాలని కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే నాగాలండ్‌లోని ఏడు జిల్లాల పరిధిలోని 15 పోలీస్ స్టేషన్లను చట్టం పరిధి నుంచి తప్పించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అసోం సీఎం హిమంత బిస్వాస్ స్వాగతించారు.
క్విట్ ఇండియా కాలం నుంచి...
సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టానికి 84 ఏళ్ల చరిత్ర ఉంది. క్విట్ ఇండియా ఉద్యమకాలంలో 1942లో వలస పాలకులు మొదటి సారిగా ఆర్డినెన్స్ రూపంలో ఈ చట్టాన్ని తెచ్చారు. నెహ్రూ స్వతంత్ర భారతావనికి తొలి ప్రధానమంత్రి అయ్యాక ఈ ఆర్డినెన్స్‌ను కొనసాగించాలని నిర్ణయించారు. 1958లో దానికి చట్టరూపం ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కశ్మీరులో, ఉగ్రవాద సమస్య తీవ్రంగా ఉన్న రోజుల్లో పంజాబ్‌లో కూడా ఈ చట్టాన్ని అమలు చేశారు. మొదట పంజాబ్‌ను, తర్వాత త్రిపుర, మేఘాలయలను చట్టం పరిధి నుంచి మినహాయించారు. నాగాలాండ్, మణిపూర్, అసోం, జమ్మూ కశ్మీరులతో పాటు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ చట్టం అమల్లో ఉంది.
ఈ చట్టంలోని మూడో సెక్షన్ కింద ఒక రాష్ట్రాన్ని లేదా రాష్ట్రంలో కొంత ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలి. కేంద్రం కానీ, గవర్నర్ కానీ ఆ ప్రకటన చేయొచ్చు. దాంతో అక్కడున్న సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాలు వస్తాయి. అనుమానం వస్తే చాలు.. ఎక్కడైనా సోదాలు చేయొచ్చు. ఎవరినైనా వారెంటు లేకుండా అరెస్టు చేయొచ్చు. సొంత నిర్ణయంతో కాల్పులకు దిగొచ్చు. పొరపాటున ఎవరినైనా కాల్చిచంపినా సంబంధిత సాయుధ జవానుపై విచారణ జరపడానికి వీల్లేదు. అరెస్టు చేయడానికి వీల్లేదు. సాధారణ కాల్పులు జరిపే సమయంలో ప్రొటోకాల్ పాటించారా? అనేది పరిశీలిస్తారు. ఎవరినైనా అరెస్టు చేసినా 24 గంటల్లో స్థానిక పోలీసులకు అప్పగించాలి.