కరోనా బీభత్సం

ABN , First Publish Date - 2020-07-11T08:20:58+05:30 IST

కరోనా బీభత్సం సృష్టిస్తోంది. రోజూ వేలసంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండగా, మరణాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.

కరోనా బీభత్సం

  • కేసుల్లో దూసుకుపోతున్న రాష్ట్రం
  • జాతీయ స్థాయిలో 9వ స్థానం
  • మరో వారంలో 5వ స్థానానికి? 
  • కొత్త కేసులు 1608.. మరణాలు 15 
  • మొత్తం పాజిటివ్‌లు 25,422 
  • మంత్రి కుమారుడికి కొవిడ్‌? 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

కరోనా బీభత్సం సృష్టిస్తోంది. రోజూ వేలసంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండగా, మరణాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు ఇప్పటికే 25వేలు దాటిపోగా, మృతుల సంఖ్య 300కు చేరువైంది. గతనెల వరకూ జాతీయ ర్యాంకుల్లో 11వ స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు తొమ్మిదో స్థానానికి చేరింది. ఇదే వేగం కొనసాగితే మరికొన్ని రోజుల్లోనే ఐదో స్థానంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. టాప్‌ టెన్‌లో ఉన్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణల్లో మాత్రమే కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. 


రోజుకు పది మరణాలు

రాష్ట్రంలో శుక్రవారం రికార్డు స్థాయిలో 1,608మంది వైరస్‌ బారిన పడగా, ఒక్కరోజులో అత్యధికంగా 15మంది మృతిచెందారు. తాజా కేసుల్లో 1,576మంది రాష్ట్రంలోని వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 32మందికి కొవిడ్‌ నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌లు 25,422కు పెరిగాయి. శుక్రవారం అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృషా, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 292కు పెరిగింది. ఈ నెల మొదటి పదిరోజుల్లోనే వందమంది మృతిచెందారు. కర్నూలు జిల్లాలో మృతుల సంఖ్య 93 కాగా, ఇది ఆదివారం నాటికి వంద దాటుతుందని అంచనా. ఆ తర్వాత కృష్ణాజిల్లాలో 75మంది మరణించారు. తూర్పుగోదావరి, అనంతపురంలోనూ మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇదిలాఉండగా, కర్నూలు జిల్లాలో మరో 144మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2,939కి చేరింది.


పాణ్యం మండలంలోని ఓ గ్రామంలో ఒకేసారి 17మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపింది. విజయనగరం జిల్లాలో మరో 92 కేసులు నమోదయ్యాయి.  తూర్పుగోదావరిలో మరో 163 కేసులు తేలాయి. కాకినాడ జీజీహెచ్‌లో ఓ హౌస్‌సర్జన్‌, ఇద్దరు పీజీ డాక్టర్లకు కరోనా సోకింది. అనంతపురం జిల్లాలో ఒకేరోజు రికార్డు స్థాయిలో 191మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో మరో 77మందికి వైరస్‌ సోకింది. టీటీడీలో 92మంది ఉద్యోగులు కరోనా లక్షణాలకు లోనైనట్టు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. గుంటూరు జిల్లాలో 208, విశాఖలో 148, శ్రీకాకుళంలో 115, కడపలో 93, ప్రకాశంలో 88, నెల్లూరులో 82, కృష్ణాలో 80 కొత్త కేసులు వచ్చాయి. 

 

డీటీసీపీ ప్రధాన కార్యాలయంలో కలకలం 

గుంటూరు జిల్లా మంగళగిరిలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌(డీటీసీపీ) రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఓ అటెండర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆఫీసులోని సుమారు 70మందికి కరోనా పరీక్షలు చేశారు. 


చిత్తూరులో భయాందోళన 

చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కీలక నేత అల్లుడికి కరోనా సోకినట్లు సమాచారం. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన ఆయనకు తొలుత నెగెటివ్‌ వచ్చినట్టు తెలిసింది. కొద్దిరోజుల కిందట అతడి సోదరికి వైరస్‌ సోకడంతో ముందు జాగ్రత్త చర్యగా శుక్రవారం టెస్టు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. జిల్లాలో తూర్పు ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే గన్‌మన్‌కు పాజిటివ్‌ అని తేలింది. ఇటీవల హైదరాబాద్‌ నుంచి జిల్లాకు వచ్చిన ఎమ్మెల్యే వెంట ఈ గన్‌మన్‌ ఉన్నట్టు సమాచారం. 


స్పీకర్‌ ఆఫీసుకు రావొద్దు

అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని ఆరోగ్యం విషయంలో ఎలాంటి దుష్ప్రచారం చేయవద్దని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని ఆయన కార్యాలయం ప్రకటించింది. ఆయన్ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి రెండు వారాలపాటు ఎవరూ రావద్దని సూచించింది. 


ఆ ఎక్సైజ్‌ సీఐకి పాజిటివ్‌ 

క్రమంగా మద్యం తరలిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో అరెస్టు అయిన ఎక్సైజ్‌ సీఐ, ఎస్‌ఐ, కారు డ్రైవర్‌కు గురువారం రాత్రి ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఎక్సైజ్‌ మహిళా సీఐకి, కారు డ్రైవర్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


మంత్రి హోం క్వారంటైన్‌ 

ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి కుమారుడు కరోనా బారిన పడినట్లు సమాచారం. స్థానికంగా చేసిన ట్రూనాట్‌ పరీక్షల్లో పాజిటివ్‌ లక్షణాలు కనిపించడంతో వైద్యసిబ్బంది మరోసారి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. మంత్రి కుమారుడితో పాటు ఇద్దరు గన్‌మెన్లకు కూడా లక్షణాలు కనిపించాయి. వారి నుంచి కూడా నమూనాలు సేకరించారు. ఈ నేపథ్యంలో మంత్రితో పాటు కుటుంబీకులకు, వ్యక్తిగత సిబ్బందికి ట్రూనాట్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. ముందుజాగ్రత్తగా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 

Updated Date - 2020-07-11T08:20:58+05:30 IST